తెలంగాణను నిలువరించండి
ఎన్నిసార్లు విన్నవించినా విద్యుత్తు ఉత్పత్తి పెరిగిపోతోంది అలాగైతే ఆంధ్రప్రదేశ్ ఎంతో నష్టపోతుంది ఒప్పంద సూత్రాలను తెలంగాణ ఉల్లంఘిస్తోంది వారిని నిలువరించేలా కఠిన చర్యలు తీసుకోండి కృష్ణా బోర్డు అధికారాలను గౌరవించడంలేదు బోర్డు కార్యదర్శికి ఏపీ ఈఎన్‌సీ నారాయణరెడ్డి లేఖ విధాత,గుంటూరు : ‘శ్రీశైలం జలాశయం నుంచి జలవిద్యుత్తు ఉత్పత్తికి తెలంగాణ ఇక నుంచి నీళ్లు తీసుకోకుండా చూడాలి. తెలంగాణ యంత్రాంగాన్ని ఈ విషయంలో నిలువరించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని మరోసారి విన్నవిస్తున్నాం. ఎన్నిసార్లు వద్దని చెబుతున్నా జలవిద్యుత్తు […]

- ఎన్నిసార్లు విన్నవించినా విద్యుత్తు ఉత్పత్తి పెరిగిపోతోంది
- అలాగైతే ఆంధ్రప్రదేశ్ ఎంతో నష్టపోతుంది
- ఒప్పంద సూత్రాలను తెలంగాణ ఉల్లంఘిస్తోంది
- వారిని నిలువరించేలా కఠిన చర్యలు తీసుకోండి
- కృష్ణా బోర్డు అధికారాలను గౌరవించడంలేదు
- బోర్డు కార్యదర్శికి ఏపీ ఈఎన్‌సీ నారాయణరెడ్డి లేఖ
విధాత,గుంటూరు : ‘శ్రీశైలం జలాశయం నుంచి జలవిద్యుత్తు ఉత్పత్తికి తెలంగాణ ఇక నుంచి నీళ్లు తీసుకోకుండా చూడాలి. తెలంగాణ యంత్రాంగాన్ని ఈ విషయంలో నిలువరించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని మరోసారి విన్నవిస్తున్నాం. ఎన్నిసార్లు వద్దని చెబుతున్నా జలవిద్యుత్తు ఉత్పత్తి ఆపకపోగా ఇంకా పెంచుతూనే ఉన్నారు. ఒక్క సోమవారమే (28.6.21) 16,877 క్యూసెక్కుల నీటిని జలవిద్యుత్తు కోసం తీసుకున్నారు. మరోవైపు వందశాతం జలవిద్యుత్తు ఉత్పత్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం జెన్‌కోను ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అంటే శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్తు కేంద్రం నుంచి రోజుకు 4 టీఎంసీలు విద్యుత్తు ఉత్పాదన కోసం వాడేస్తారని అర్థం. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను పూర్తిగా దెబ్బతీస్తుంది’ అని ఆంధ్రప్రదేశ్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు మరో లేఖను కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు పంపింది. ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సీ) సి.నారాయణరెడ్డి ఈ మేరకు బోర్డు కార్యదర్శికి లేఖ రాశారు.
‘వరదల సమయంలో మినహా మిగిలిన వేళల్లో శ్రీశైలం, నాగార్జునసాగర్ ఉమ్మడి జలాశయాల నుంచి బోర్డు ఆదేశాలు లేకుండా నీటిని తీసుకోవడానికి వీల్లేదు. అయినా బోర్డు నుంచి ఎలాంటి ఆదేశాలూ లేకుండానే తెలంగాణ ఏకపక్షంగా శ్రీశైలం నుంచి నీటిని తీసుకుంటోంది. కనీసం కృష్ణా బోర్డుకు సమాచారం కూడా ఇవ్వడం లేదు. ఇది బోర్డు అధికారాలను గౌరవించకపోవడమే. ఉమ్మడి జలాశయాల నుంచి నీటి నిర్వహణ కోసం ఏర్పాటుచేసిన త్రిసభ్య కమిటీ నిర్ణయాల ప్రకారం ముందుకు వెళ్లాలన్న ఒప్పంద సూత్రాలను ఉల్లంఘించినట్లే’ అని ఈఎన్‌సీ తన లేఖలో వివరించారు. ‘జూన్ ఒకటితో ప్రారంభమైన కొత్త నీటి సంవత్సరంలో ఇంతవరకూ శ్రీశైలం జలాశయంలోకి 17.36 టీఎంసీల నీటి ప్రవాహాలు వచ్చాయి. అందులో 6.9 టీఎంసీలను విద్యుదుత్పత్తి కోసం తెలంగాణ వినియోగించుకుంది. మొత్తం నీటి ప్రవాహాల్లో ఇది 40 శాతం. నాగార్జునసాగర్ జలాశయంలో ఖరీఫ్ అవసరాల కోసం అవసరమైన నీళ్లున్నా తెలంగాణ శ్రీశైలం నీళ్లను వాడేస్తోంది. సాగర్ జలాశయం కింద, కృష్ణా డెల్టాలో వ్యవసాయ అవసరాలకు నీరు వినియోగించుకునే క్రమంలోనే శ్రీశైలంలో జలవిద్యుత్తు ఉత్పత్తి చేపట్టాలి. ఇలా శ్రీశైలం నుంచి నీళ్లు వాడుకుంటూ పోతే నీటిమట్టాలు పడిపోతాయి. పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తీసుకోవాలంటే శ్రీశైలం జలాశయంలో 854 అడుగుల నీటిమట్టం ఉండాలి. అప్పుడు కూడా కేవలం 7,000 క్యూసెక్కులు మాత్రమే నీటిని తీసుకోగలం. తెలంగాణ ఇలా చేయడం వల్ల పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తీసుకోవడం చాలా ఆలస్యమవుతుంది. తెలంగాణ పూర్తి జలవిద్యుత్తు ఉత్పత్తి చేపడితే ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో నష్టం కలుగుతుంది. 854 అడుగుల నీటిమట్టం స్థాయికి నీళ్లు నిలిచే అవకాశం ఉండదు’ అని ఆ లేఖలో ఈఎన్‌సీ పేర్కొన్నారు. శ్రీశైలం జలాశయం నుంచి ఏ రోజు ఎంత నీటిని తెలంగాణ వినియోగించుకుందో తెలియజేసే వివరాలను ఆ లేఖకు జతచేశారు.