విద్యుత్తు తిమింగలాలపై అంత ప్రేమెందుకో!

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వంలో కన్నా కూటమి ప్రభుత్వంలోనే ఆర్థిక నేరగాళ్ల హవా మరింత పెరిగిందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

విద్యుత్తు తిమింగలాలపై అంత ప్రేమెందుకో!

హైదరాబాద్, సెప్టెంబర్‌ 9 (విధాత): ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వంలో కన్నా కూటమి ప్రభుత్వంలోనే ఆర్థిక నేరగాళ్ల హవా మరింత పెరిగిందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం గడిచినా విద్యుత్ శాఖలో ఆర్థిక నేరగాళ్ల సామ్రాజ్యం మరింతగా పట్టు పెంచుకుంటున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 2024 కు ముందు విద్యుత్ శాఖలో విస్తరించిన అవినీతిపై నేటి కూటమి నాయకులు ప్రచార, ప్రసార సాధనాల్లో గగ్గోలు పెట్టారు. ఇప్పుడు ఆ నేరగాళ్లకే దాసోహం అయ్యారంటూ ఏపీ రిటైర్డ్‌ ఎంప్లాయీస్ యూనియన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక లేఖాస్త్రాన్ని కూటమి ప్రభుత్వం పై సంధించింది. విద్యుత్ శాఖలో అవినీతి తిమింగలాలు అంటూ యూనియన్ సంధించిన బహిరంగ లేఖలోని వివరాలు ఇలా ఉన్నాయి.

మద్యం కుంభకోణం మించి విద్యుత్ సంస్థల్లో దోపిడీ
వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం రూ.3,500 కోట్లు మాత్రమే. విద్యుత్ శాఖలో జరిగిన అవినీతి ఒక లక్షా యాభై వేల కోట్ల రూపాయలని అంటున్నారు. రాష్ట్రంలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఉన్నా, సీఐడీ వంటి విచారణ సంస్థలున్నా ఏమీ చేయలేని పరిస్థితి ఉందని చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా విద్యుత్ సంస్కరణలు చేసిన మీరు, విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కం లు) లో తిష్టవేసిన ఆర్థిక నేరస్థులైన సీఎండీలు, ఉన్నతాధికారులు, షిర్డి సాయి లాంటి కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోనట్లయితే మీరు కలలు గనే 2047 సాకారం కలగానే మిగిలిపోతుందని యూనియన్‌ నాయకులు హెచ్చరించారు. పార్టీకి రూ.40 కోట్లు ఫండ్ గా ఇచ్చి ప్రజా ధనాన్ని దోచుకుతింటున్నారని ఆరోపించారు. వారంలో ఒకరోజు మీరు షిర్డీ సాయి సంస్థ ప్రతినిధులతో సమావేశం కావడాన్ని సామాన్య ప్రజలు మొదలు పార్టీ నాయకుల వరకు ఎవరూ హర్షించడం లేదని స్పష్టంచేశారు. విద్యుత్ కుంభకోణం పై విచారణ జరిపి, విద్యుత్ ఛార్జీల భారం తగ్గిస్తారని ఆశించిన వినియోగదారుల ఆశలను నాశనం చేశారనే వాదన ప్రజల్లో బలంగా విన్పిస్తున్నది.

ఆర్థిక శాఖ మంత్రి, షిర్టీ సాయికి మధ్య ఉన్న బంధమేంటి?
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, అవినీతి పరుడైన షిర్డీ సాయి సంస్థకు మధ్య ఉన్న అవినాభావ సంబంధం ఏమిటో తేల్చాలని యూనియన్‌ నేతలు డిమాండ్‌ చేశారు. వైసీపీ హయాంలో ఈ సంస్థపై ఆరోపణలు చేయడమే కాకుండా హైకోర్టులో కేసు కూడా వేశారని గుర్తు చేశారు. ఇప్పుడా సంస్థ ప్రతినిధులతో సన్నిహితంగా ఉంటున్నారని అన్నారు. ఆర్ అండ్ బీ శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తమ బంధువు అని, శివప్రసాద్ రెడ్డి అనే వ్యక్తిని వెంటేసుకుని సీఎంవో చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని పేర్కొన్నారు. అప్పట్లో షిర్డీ సాయిపై ఆరోపణలు చేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పట్టాభి ఏమయ్యారు? నోరెందుకు మూతపడిందో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. వారాంతంలో ఈ సంస్థ ప్రతినిధులతో ఐఏఎస్ అధికారులు అంటకాగుతున్నారని మండిపడ్డారు. స్టార్ హోటళ్లలో భేటీలు, గానాభజానాల ఫొటోలు తమ వద్ద ఉన్నాయని చెబుతున్నారు.

విద్యుత్ సంస్థల్లో భారీ కుంభకోణం
గత ఆరు సంవత్సరాలలో సుమారు ఒక లక్ష కోట్ల రూపాయల దోపిడికి పాల్పడిన కాంట్రాక్టర్లు, సంస్థలు వీరేనన్న విషయం ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలియదా? యువ నాయకుడు ప్రోద్భలంతో జరుగుతుందా? అనే అనుమానాలను వ్యక్తం చేశారు. విజయానంద్ ప్రధాన కార్యదర్శి అయిన తరువాత షిర్డీ సాయి ప్రతినిధులు ఆయన క్యాంపు కార్యాలయంలోనే మకాం వేసి పనులు చక్కబెట్టుకుంటున్నారని, విద్యుత్ సంస్థల్లో లక్ష కోట్లు దోచుకున్న సంస్థల వివరాలు ఇవేనంటూ వెల్లడించారు.

షిర్డీ సాయి రూ.63,000 కోట్లు
యాక్సిస్ పవర్ రూ.6,000 కోట్లు
జీవీఎస్ రూ.4,000 కోట్లు
సీవెల్ రూ.15,000 కోట్లు
సృష్టి రూ.1,000 కోట్లు
సన్ షైన్ రూ.1,000 కోట్లు
లక్ష్మీ నరసింహా రూ.5,00 కోట్లు
పావని రూ.5,00 కోట్లు
పీవీఆర్ రూ.3,000 కోట్లు
బినామీ సంస్థలు రూ.15,000 కోట్లు

ఏపీఈఆర్సీలో ఖాళీలు
ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఏపీఈఆర్సీ) లో సభ్యుల పదవీ కాలం ముగిసి ఆరు నెలలు అవుతున్నది. ఇప్పటి వరకు ఖాళీలను భర్తీ చేయలేదంటే అందుకు కారణం ప్రస్తుత ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ అని యూనియన్‌ నేతలు విమర్శిస్తున్నారు. విద్యుత్ శాఖ కూడా ఈయనే పర్యవేక్షిస్తున్నారు. యాక్సిస్ పవర్ లో రవిరెడ్డి తో పాటు విజయానంద్ కూటా వాటాదారులు అనే వాదన బలంగా ఉంది. యాక్సిస్ కు చెల్లిస్తున్న ధరలు పరిశీలిస్తే అన్ని వెలుగులోకి వస్తాయని చెబుతున్నారు. చైర్మన్‌, సభ్యులను నియమిస్తే తన మాట వినేవారు ఉండరనే కారణంతో కాలయాపన చేస్తున్న విషయం మీకు తెలియదా? అని ప్రశ్నించారు.

ముగ్గురు సీఎండీ లపై ఏ చర్యలు తీసుకున్నారు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ పంపిణీ సంస్థలను సర్వ నాశనం చేసిన ముగ్గురు సీఎండీ లు హెచ్ వై దొర, హరనాథ్, జనార్థన్ రెడ్డి, సంతోష్ రావు తో పాటు అవినీతి కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. వీరికేమీ తీసిపోని విధంగా డైరెక్టర్లు శ్రీనివాస ముర్తి, శివప్రసాద్ రెడ్డి, ఆయూబ్ ఖాన్, కే.బాబు అప్పటి విద్యుత్ శాఖ మంత్రి తో కలిసి అనేక అక్రమాలకు పాల్పడ్డారంటూ అధికారుల పేర్లను ప్రస్తావించి, తమ హయాంలో చేసిన అక్రమాల వివరాలను, ఎవరెవరితో ఆర్థిక, రాజకీయ బంధాలు ఉన్నాయో వివరిస్తూ అందులో పొందుపర్చారు. అయినప్పటికీ కూటమి ప్రభుత్వంలో షిర్డీ సాయి కి కాంట్రాక్టులు ఇస్తునే ఉన్నారని విమర్శించారు. ఈ సంస్థ లో సబ్ కాంట్రాక్టు పనులు చేసిన వారికి డబ్బులు చెల్లించడం లేదని, తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక నానా యాతన పడుతున్నారని ఏపీ రిటైర్డు ఎంప్లాయీస్ యూనియన్ ఆందోళన వ్యక్తం చేసింది.