అనాధలకు అండగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు : కృతికా శుక్లా

విధాత‌: కరోనాతో అనాధలైన చిన్నారులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న భరోసా, వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతుందని రాష్ట్ర మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు. పిల్లల సమగ్ర సంరక్షణ, విద్య, ఉపాధి, వసతి వంటి సౌకర్యాలతో పాటు వారి పేరిట రూ.పది లక్షలు డిపాజిట్ చేసేలా కేంద్రం నుండి మార్గదర్శకాలు జారీ అయ్యాయన్నారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన బాలలకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.10 లక్షలు చొప్పున […]

అనాధలకు అండగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు : కృతికా శుక్లా

విధాత‌: కరోనాతో అనాధలైన చిన్నారులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న భరోసా, వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతుందని రాష్ట్ర మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు. పిల్లల సమగ్ర సంరక్షణ, విద్య, ఉపాధి, వసతి వంటి సౌకర్యాలతో పాటు వారి పేరిట రూ.పది లక్షలు డిపాజిట్ చేసేలా కేంద్రం నుండి మార్గదర్శకాలు జారీ అయ్యాయన్నారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన బాలలకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.10 లక్షలు చొప్పున బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయగా, వారికి 18 ఏళ్లు నిండగానే ఆమొత్తాన్ని తీసుకునే అవకాశం ఉందని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మరో రూ.10 లక్షల డిపాజిట్‌ 23 ఏళ్ల వయసు నిండిన తరువాత తీసుకునేలా ఉత్తర్వులు విడుదల అయ్యాయన్నారు. ఈ నేపధ్యంలో వారికి అవసరమైన సహకారం అందేలా వివిధ ప్రభుత్వ శాఖలను సమన్వయం చేయనున్నామన్నారు. పీఎం కేర్‌ స్కీమ్‌ పథకానికి ఇప్పటికే కొందరు అర్హులను గుర్తించామని, అయితే ఈ సంవత్సరం డిసెంబర్‌ 31 వరకు లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని డాక్టర్ శుక్లా వివరించారు.

పిఎం కేర్స్ పధకం కింద ఇప్పటికే వివిధ జిల్లాలలో 237 మంది ఎంపిక పూర్తి అయ్యిందని డాక్టర్ కృతికా శుక్లా వివరించారు. శ్రీకాకుళంలో 9, విజయనగరంలో 3, విశాఖపట్నంలో 33, తూర్పు గోదావరిలో 31, పశ్చిమ గోదావరిలో 25, కృష్ణలో 22, గుంటూరులో 12, ప్రకాశంలో 12, నెల్లూరులో 18, చిత్తూరులో 16, వైఎస్ ఆర్ కడపలో 21, కర్నూలులో 9, అనంతపురంలో 26 మందిని ఎంపిక చేసామన్నారు. ప్రభుత్వ పధకాల కింద మద్దతు కోరుతూ రిజిస్టేషన్లకు అర్హులైన పిల్లలు చైల్డ్‌లైన్ 1098, జిల్లా బాలల సంరక్షణ యూనిట్ల నుండి పిలుపు అందిన 24 గంటలలోపు హాజరైతే, అర్హులైన పిల్లల ఆధార్ నమోదును సిడబ్యుసి నిర్ధారిస్తుందన్నారు. వీరిని పిఎం కేర్స్ పిల్లల సంరక్షణ పోర్టల్‌లో నమోదు చేసి అన్ని రకాల భద్రతలు కల్పిస్తామని రాష్ట్ర మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కృతికా శుక్లా వివరించారు.