జైలులో లేను..ప్రజా హృదయాల్లో ఉన్నా..త్వరలోనే బయటకు వస్తా
నేను జైలులో లేను..మీ అందరి గుండెల్లో ఉన్నాను..ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ప్రజా చైతన్యంలో ఉన్నానంటు చంద్రబాబు జైలు నుంచి ప్రజలకు బహిరంగ లేఖ రాశారు

- జైలు నుంచి చంద్రబాబు బహిరంగ లేఖ
విధాత : నేను జైలులో లేను..మీ అందరి గుండెల్లో ఉన్నాను..ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ప్రజా చైతన్యంలో ఉన్నాననంటు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు జైలు నుంచి ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. తెలుగు ప్రజలకు విజయ దశమి శుభాకాంక్షలతో ఈ లేఖ రాశారు. విధ్వంస పాలన అంతం చేయాలనే మీ సంకల్పంలో ఉన్నాను..ప్రజలే నా కుటుంబం అని లేఖలో పేర్కోన్నారు. 45ఏళ్ల నా ప్రజాజీవితం కళ్ల ముందు కదలాడుతుందని, నా రాజకీయ ప్రస్థానమంతా తెలుగు ప్రజల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా సాగిందని, ఇందుకు ఆ దేవుడితో పాటు మీరే సాక్ష్యమన్నారు. ఓటమి భయంతో నన్ను జైలు గోడల మధ్య బంధించి ప్రజలకు దూరం చేశామనుకుంటున్నారని, నేను మీ మధ్య లేకపోవచ్చని, అభివృద్ధి రూపంలో ప్రతిచోట కనిపిస్తునే ఉంటానన్నారు. సంక్షేమం పేరు వినిపించిన ప్రతిసారి నేను గుర్తుకొస్తునే ఉంటానన్నారు. ప్రజల్నించి ఒక్క రోజు కాదు ఒక్క క్షణం కూడా దూరం చేయలేఏరన్నారు.
కుట్రతో నాపై అవినీతి ముద్ర వేయాలని ప్రయత్నించారని, నేను నమ్మిన విలువలు, విశ్వసనీయతను ఎన్నడు చెరిపేయలేరని, ఈ చీకట్లు తాత్కాలికమేనని, సత్యం అనే సూర్యుడి ముందు ఈ కారు మబ్బులు వీడిపోతాయన్నారు. సంకేళ్లు నా సంకల్పాన్ని బంధించలేవని, జైలు గోడలు నా ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీయలేవన్నారు. జైలు ఊచలు నన్ను ప్రజల్నించి దూరం చేయలేవన్నారు. ఈ దసరాకి పూర్తి స్థాయి మ్యానిఫెస్టో విడుదల చేస్తానని, రాజమహేంద్రవరం మహానాడులో ప్రకటించానని, అదే రాజమహేంద్రవరం జైలులో నన్ను ఖైదు చేశారన్నారు. త్వరలో బయటకొచ్చి మ్యానిఫెస్టో విడుదల చేస్తానన్నారు.
ఎప్పుడు బయటకు రాని దివంగత ఎన్టీఆర్ కూతురు, నా సతీమణి భువనేశ్వరి నిజం గెలువాలని మీ ముందుకు నేను లేనప్పుడు మీ కోసం పోరాడేందుకు వస్తుందన్నారు. నా అక్రమ అరెస్టుతో చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించనుందని తెలిపారు. చెడు గెలిచినా నిలవదని, మంచి తాత్కాలికంగా ఓడినట్లుగా కనిపించినా కాల పరీక్షలో గెలిచి తీరుతుందని, త్వరలోనే చెడుపై మంచి విజయం సాధిస్తుందన్నారు.