YS. Sharmila | 15వేల కోట్లకే పండుగ చేసుకోవాలా ? బీజేపీకి చంద్రబాబు మద్దతు ఉపసంరించుకోవాలి : వైఎస్.షర్మిల
కేంద్ర బడ్జెట్‌లో కేవలం 15 వేల కోట్ల నిధులు మాత్రమే రాష్ట్రానికి కేటాయించారని, దీనికే పండుగ చేసుకోవాలా అని సీఎం చంద్రబాబును, బీజేపీని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్. షర్మిల విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌పై ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడారు.

విధాత, హైదరాబాద్ : కేంద్ర బడ్జెట్‌లో కేవలం 15 వేల కోట్ల నిధులు మాత్రమే రాష్ట్రానికి కేటాయించారని, దీనికే పండుగ చేసుకోవాలా అని సీఎం చంద్రబాబును, బీజేపీని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్. షర్మిల విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌పై ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడారు. బీహార్ 12 మంది ఎంపీలు ఇస్తే 26 వేల కోట్లు ఇచ్చారని, ఏపీ నుంచి 25 మంది ఎంపీలను తీసుకొని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ముష్టివేస్తుందా అని షర్మిల మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్‌లో నిధుల కేటాయింపులో ఏపీకి జరిగిన అన్యాయంపై సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. బీజేపీ మళ్ళీ ఏపీకి మోసం చేస్తుందని ప్రజలు గమనించాలని, ఒక్కో ఎంపీకి 1 వెయ్యి కోట్ల చొప్పున 15 వేల కోట్లు ఇచ్చి కొనుక్కున్నట్లుగా కేంద్ర నిధులు ఇచ్చారా అని ఎద్దేవా చేశారు. కేంద్ర బడ్జెట్‌లో విశాఖ రైల్వే జొన్ ఊసే లేదని, విశాఖ,విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు ప్రస్తావన లేదన్నారు. లక్ష కోట్లు అడిగితే 15 వేల కోట్లు ఇచ్చారని, ప్రధాని మోదీ మళ్ళీ మోసం చేశారని సీఎం చంద్రబాబు ధైర్యంగా చెప్పగలరా ? అని ప్రశ్నించారు.
ఇకనైనా చంద్రబాబబు కళ్ళు తెరవాలని, బీజేపీకి మద్దతు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు కాస్ట్ ఎంతో తెలియదని, 12 వేల కోట్లు రీహాబిలిటేషన్ కి కావాలని, ముఖ్యమైన ప్రాజెక్టు అయితే నిధులు ఎంత ఇస్తారు అని ఎందుకు చెప్పలేదని, ఓర్వకల్, కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్ కి ఎంత నిధులు ఇస్తారన్న విషయం కూడా బడ్జెట్‌లో లేదని, కేవలం హామీలే ఇచ్చారని విమర్శించారు. కేంద్ర సంస్థల స్థాపన కూడా ప్రస్తావన లేదన్నారు. విభజన హక్కులను గౌరవిస్తాం అంటునే, విభజనలో మొదటి అంశం ప్రత్యేక హోదా పక్కన పెట్టారని తప్ఫుబట్టారు. హోదా నే ఏపికి సంజీవని అని, హోదా వస్తేనే రాష్ట్ర అభివృద్ధి, హోదా వస్తే ఇండస్ట్రీలు వస్తాయన్నారు. వినుకొండ హత్యా పై నేను విచారణ చేశానని చెప్పలేదని, న్యూట్రల్ మీడియాను అడిగానని మాత్రమే చెప్పానని షర్మిల స్పష్టం చేశారు. హత్యా రాజకీయాలు ఏవో జాతీయ సమస్యగా వైఎస్ జగన్ డిల్లీలో ఎందుకు ధర్నా చేస్తున్నారని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక్కరోజైనా ధర్నా చేశాడా అని ప్రశ్నించారు. కడప స్టీల్ ప్లాంటు ప్రవైటీకరణపై ఒక్క రోజైనా ధర్నా ఎందుకు చేయలేదన్నారు. అసెంబ్లీ జరుగుతుంటే..వారు తెచ్చిన లాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తుంటే ఎందుకు చర్చ చేయడం లేదని, అంటే వైసీపీ నేతలకు మెదడు లేదని అర్థం అయిందని షర్మిల విమర్శించారు.