కేంద్రమంత్రిగా లోకేశ్? చంద్రబాబు ప్రమాణ వాయిదా
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వ ప్రమాణ స్వీకారం కార్యక్రమం వాయిదా పడింది

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వ ప్రమాణ స్వీకారం కార్యక్రమం వాయిదా పడింది. ఈ కార్యక్రమం జూన్ 12న నిర్వహించనున్నారు. వాస్తవానికి జూన్ 9న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని భావించారు. అయితే.. జూన్ 8వ తేదీన కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడనున్న నేపథ్యంలో ఏపీలో ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రేమ్‌కుమార్ జైన్ ఢిల్లీలో గురువారం మీడియాకు తెలిపారు. ‘ఎన్డీయే ప్రభుత్వానికి చంద్రబాబు పూర్తి మద్దతును ప్రకటించారు.
ఇండియా కూటమి నాయకులు ఏం చెప్పినప్పటికీ.. మేం ఎన్డీయేతోనే ఉన్నాం. చంద్రబాబు ప్రమాణ స్వీకారం జూన్ 12న ఉండొచ్చు. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రిని ఆహ్వానించాం. ఇతర నాయకుల కూడా వస్తున్నారు’ అని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించడం ఇది నాలుగో సారి. తొలిసారి 1995లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు.. 1999 వరకు ఆ పదవిలో కొనసాగారు. తదుపరి 1999 నుంచి 2004 వరకూ విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు.
ఎన్డీయే కూటమిలో బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీ టీడీపీ. పార్టీ భవిష్యత్తు నిర్ణయంపై పలు ఊహాగానాలు వెలువడిన నేపథ్యంలో బుధవారం వివరణ ఇచ్చిన చంద్రబాబు.. ‘మేం ఎన్నికల్లో కలిసి పోటీచేశాం. మీకు ఇంకా ఎందుకు సందేహం?’ అని ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు. అదెలా ఉన్నప్పటికీ.. మూడవ ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ పలు కీలక పోర్టుఫోలియోలను అడుగుతున్నట్టు ఊహాగానాలు వస్తున్నాయి. లోక్‌సభ స్పీకర్‌తోపాటు ఏడు నుంచి 8 క్యాబినెట్ బెర్తులు, ఒక సహాయ మంత్రి పదవిని కోరుతున్నట్టు సమాచారం. వీటిలో రోడ్డు రవాణా, గ్రామీణాభివృద్ధి, ఆరోగ్యం, గృహ, పట్టణ వ్యవహారాలు, వ్యవసాయం, జల్‌శక్తి, ఐటీ అండ్ కమ్యూనికేషన్స్, విద్య, ఆర్థిక (సహాయ) మంత్రి పదవుల కోసం టీడీపీ పట్టుపడుతున్నట్టు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.
నారా లోకేశ్‌కు కూడా కేంద్రంలో మంత్రి పదవి ఇవ్వాలని అడిగే అవకాశం కూడా ఉన్నదని, అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి అభివృద్ధికి నిధులపై హామీ కోసం పట్టుపడుతారని తెలుస్తున్నది. దీనితోపాటు టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఏపీకి ప్రత్యేక హోదా కోసం గట్టిగా డిమాండ్ చేస్తారని సమాచారం. ఇదే అంశంలో గతంలో ఎన్డీయేతో విభేదించి టీడీపీ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. తదుపరి 2019 ఎన్నికల్లో ఇదే ప్రత్యేక హోదా అంశంపై జగన్ ఎన్నికలకు వెళ్లి.. విజయం సాధించారు. కానీ.. తొలి ఢిల్లీ పర్యటనలోనే కేంద్రం ఆ డిమాండ్ ముగిసిన శకమని చావు కబురు చల్లగా చెప్పింది. మరి ఇప్పుడు టీడీపీ మద్దతు కీలకంగా మారిన పక్షంలో ప్రత్యేక హోదాపై కేంద్రం ఏం చేస్తుందనే అంశంపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి.