సంగం డెయిరిపై ప్రభుత్వ పెత్తనాన్ని అంగీకరించం
విధాత: వడ్లమూడి: సంగం డెయిరిలో ప్రభుత్వాస్తులున్నాయని మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పటం అవాస్తవమని, ప్రభుత్వానికి చెల్లించాల్సిన షేర్ క్యాపిటల్ తోపాటు అన్నరకాల బకాయిలు గతంలోనే చెల్లించామని సంగం డెయిరి ఛైర్మన్ దూళిపాళ్ళ నరేంద్రకుమార్ అన్నారు. గురువారం సంగం డెయిరి సమావేశమందిరంలో ఛైర్మన్ నరేంద్రకుమార్ అధ్యక్షతన పాలకవర్గ సమావేశం జరిగింది. సమావేశ అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఛైర్మన్ పాలకవర్గం తీసుకున్న నిర్ణయాలను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు స్థానికంగా ఉన్న సంస్థలను దెబ్బతీసి అమూల్ కు పాలసేకరణ […]

విధాత: వడ్లమూడి: సంగం డెయిరిలో ప్రభుత్వాస్తులున్నాయని మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పటం అవాస్తవమని, ప్రభుత్వానికి చెల్లించాల్సిన షేర్ క్యాపిటల్ తోపాటు అన్నరకాల బకాయిలు గతంలోనే చెల్లించామని సంగం డెయిరి ఛైర్మన్ దూళిపాళ్ళ నరేంద్రకుమార్ అన్నారు. గురువారం సంగం డెయిరి సమావేశమందిరంలో ఛైర్మన్ నరేంద్రకుమార్ అధ్యక్షతన పాలకవర్గ సమావేశం జరిగింది. సమావేశ అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఛైర్మన్ పాలకవర్గం తీసుకున్న నిర్ణయాలను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు స్థానికంగా ఉన్న సంస్థలను దెబ్బతీసి అమూల్ కు పాలసేకరణ పెంచే ప్రయత్నంలో ఉన్నారని చెప్పారు. పాల వ్యాపారంలో అమూల్ సంస్థను అడ్డుపెట్టుకొని పాల సేకరణలో ప్రభుత్వం గుత్తాదిపత్యాన్ని సాగించాలని చూస్తుందని, ప్రభుత్వ చర్యలను అడ్డుకోవాలని పాలకవర్గం నిర్ణయించిందని చెప్పారు. అమూల్ కు పాలు సేకరించి ఇస్తున్న ప్రభుత్వం రైతులకు సకాలంలో బకాయిలు చెల్లించిన తరువాత మిగిలిన విషయాల గురించి మంత్రి మాట్లాడాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లాలో అమూల్ కు పాలు సేకరిస్తున్న ప్రభుత్వం రైతులకు సకాలంలో బకాయిలు చెల్లించకుండా, ఇవ్వాల్సిన మొత్తంలో కోతలు విదిస్తూ పాడి రైతులను ఎన్నిరకాలుగా ఇబ్బందులు పెట్టాలో ఆన్ని రకాలుగా వేదిస్తున్నారని చెప్పారు. సంగం డెయిరిపై ప్రభుత్వ పెత్తనాన్ని అంగీకరించేది లేదని తేల్చిచెప్పారు. ప్రభుత్వ చర్యలను అడ్డుకునేoదుకు అవసరమైన మేర న్యాయపోరాటం చేయాలని పాలక వర్గం నిర్ణయించిందని ఛైర్మన్ నరేంద్ర కుమార్ తెలిపారు.
సంగం డెయిరి పాలకవర్గ సమావేశంలో డెయిరి ఆర్దిక స్థితిగతులపై సమీక్షించామని, 2019-20 ఆర్దిక సంవత్సరం కన్నా 2020-21లో ఇరవైశాతం అదనంగా టర్నోవర్ సాదించామని ఛైర్మన్ తెలియజేశారు. డెయిరి గత ఏడాదిలో 1100 కోట్ల రూపాయల వ్యాపారం చేసిందని తెలిపారు. వచ్చిన ఆదాయంలో రైతులకు పంచిన బోనస్ మరియు షేర్ క్యాపిటల్ పోను పదికోట్లకు పైగా నికర ఆదాయం పొందామని చెప్పారు. ఈ వార్షిక సంవత్సరంలో ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో గతంలో పాలు సేకరిస్తున్న ప్రాంతాలతో పాటు, వివిద ప్రాంతాలకు పాలసేకరణను విస్తరిస్తున్నామని అన్నారు. వచ్చే ఏడాదిలో ప్రకాశం జిల్లాలో లక్ష లీటర్ల పాలను సేకరించాలని, నెల్లూరు జిల్లాలో పాల సేకరణ పెంచాలని నిర్ణయించామని తెలిపారు. ఈనెలలో పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలలో పాలసేకరణ ప్రారంభిస్తున్నామని ఛైర్మన్ తెలియజేశారు. డెయిరి సామర్ధ్యాన్ని ఐదు లక్షల లీటర్ల నుండి ఎనిమిది లక్షల లీటర్లకు పెంచుతున్నామని, భవిశ్యత్తులో పన్నెండు లక్షల లీటర్ల పాలను ప్రాసెస్ చేసేందుకు అనుగుణంగా మార్పులు చేస్తున్నామని నరేంద్ర కుమార్ తెలియజేశారు.
సంగం డెయిరి లీగల్ అడ్వైజర్ వేణుగోపాల్ తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి కుటుంబ సమేతంగా వెళితే తిరుమల కొండమీద ఏసిబి అదికారులు అరెస్ట్ చేయటం అమానుషమని, ప్రభుత్వం మతపరమైన పవిత్రతను మంట గలిపే విధంగా వ్యవహరిస్తుందని నరేంద్రకుమార్ ఆరోపించారు. సుప్రీంకోర్ట్ సూచనలకు విరుద్ధంగా ఏసిబి అధికారుల ప్రవర్తన ఉందని, వేణుగోపాల్ అరెస్ట్ ను ఖండిస్తున్నామని అన్నారు. తిరుమల పవిత్రతను మంటగలిపేలా వ్యవహరించిన ఏసిబి అదికారులను తిరుమల పైకి అనుమతించిన టిటిడి అధికారులపై చర్యతీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వేణుగోపాల్ కుటుంబ సభ్యులను ఏసిబి అధికారులు బెదిరింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. అక్రమ అరెస్టులు, బెదిరింపులకు బయపడేది లేదని, ప్రభుత్వ పెత్తనాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని అన్నారు. సంగం డెయిరి పాడిరైతుల ఆస్తి అని, అందులో ప్రభుత్వ జోక్యానికి వ్యతిరేకంగా న్యాయపోరాటం సాగించాలని పాలక వర్గ సమావేశంలో ఏకగ్రీవంగంగా నిర్ణయించామని అందుకు అనుగుణంగా ముందుకు సాగుతామని ఛైర్మన్ నరేంద్ర కుమార్ తెలియజేశారు.