ఏపీలో మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలు.. రంగంలోకి సిట్ బృందం

ఏపీలో ఎన్నికల హింస నేపథ్యంలో ఈసీ ఆదేశాలతో జరుగుతున్న ప్రక్షాళనలో భాగంగా మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించారు.

ఏపీలో మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలు.. రంగంలోకి సిట్ బృందం

విధాత: ఏపీలో ఎన్నికల హింస నేపథ్యంలో ఈసీ ఆదేశాలతో జరుగుతున్న ప్రక్షాళనలో భాగంగా మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా ఎస్పీగా గౌతమీ శాలి, తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్‌, పల్నాడు జిల్లా ఎస్పీగా మలికా గార్గ్‌ ను నియమించారు. అదే విధంగా పల్నాడు జిల్లా కలెక్టర్‌గా శ్రీకేష్‌ బాలాజీ ని నియమించారు. ఎ

న్నికలలో పోలింగ్ రోజున, తర్వాత మూడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలను సీరియస్‌గా తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీ, డీజీపీల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈసీ ఆదేశాల మేరకు సీఎస్‌ జవహర్‌రెడ్డి, డీజీపీ హరీష్‌ కుమార్‌ ఢిల్లీకి వెళ్లి నివేదికను అందజేశారు. సీఈసీ ఆదేశాల మేరకు పల్నాడు కలెక్టర్‌ను, మూడు జిల్లాల ఎస్పీలను బదిలీ చేయడంతో ఖాళీ అయిన పోస్టులలో కొత్తవారిని నియమించడం జరిగింది.

సిట్ దర్యాప్తు ప్రారంభం

ఏపీలో పోలింగ్‌ రోజున, అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ బృందం శనివారం నుంచి దర్యాప్తును ప్రారంభించింది. ముఖ్యంగా పల్నాడు, తిరుపతి, అనంతపురంలో జరిగిన ఘటనలపై ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలో 13 మంది సభ్యులతో కూటిన సిట్‌ బృందానికి డీజీపీ పలు ఆదేశాలు జారీ చేశారు. సిట్ సారధి వినీత్ బ్రిజ్‌లాల్ శనివారం డీజీపీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో డీజీపీ హింసాత్మక ఘటనలపై కేసులను పునఃసమీక్షించాలని బ్రిజ్‌లాల్‌ను ఆదేశించారు.

ఎన్నికల రోజు, తర్వాత ఘటనలపై నమోదు చేసిన వివిధ కేసుల దర్యాప్తును పర్యవేక్షించాలని సూచించారు. నేర నిరూపణకు అదనపు సెక్షన్లూ జోడించేలా చూడాలని, ప్రతీ కేసు దర్యాప్తులో అవసరమైతే అదనపు సెక్షన్లు పెట్టేలా చూడాలని సిట్‌కు సూచించారు. అవసరమైన చోట ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు సిట్‌ సిఫార్సు చేయొచ్చని స్పష్టం చేశారు. మూడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.

ఈవీఎంల ధ్వంసం, ఓటర్లు, ఏజెంట్లు, పార్టీ అభ్యర్థులపై దాడులు, హత్యాయత్నం, పౌరుల ఇండ్లపై పెట్రోలు దాడులు కలకలం సృష్టించాయి. ఈ ఘటనలపై తీవ్రంగా స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ సీఎస్‌, డీజీపీలు సైతం స్వయంగా ఢిల్లీకి పిలుపించుకుని జరిగిన ఘటనలపై నివేదిక రూపంలో తీసుకున్నారు. ఈ నివేదిక ఆధారంగా జిల్లాల కలెక్టరు, ఎస్పీల బదిలీలతో పాటు, మరికొందరిపై వేటు వేసిన విషయం తెలిసిందే. అంతేగాకుండా అల్లర్ల కారకులైన వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించరాదని, కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం హుటాహుటిన సిట్‌ ఏర్పాటు చేసింది.

కడప ఘటనపై చార్జ్‌మోమోలు

కడప గౌస్ నగర్ లో పోలింగ్ రోజున జరిగిన టీడీపీ-వైసీపీ వర్గాల మధ్య జరిగిన ఘర్షణపై ప్రేక్షకపాత్ర వహించిన సిబ్బందిపై జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ చర్యలకు ఉపక్రమించారు. చార్జి మెమో జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన కడప వన్ టౌన్ సీఐ భాస్కర్ రెడ్డి, కడప వన్ టౌన్ ఎస్ఐ రంగస్వామి, తాలూకా ఎస్సై తిరుమల నాయక్, చిన్న చౌక్ ఎస్ఐ మహమ్మద్ రఫీ, రిమ్స్ ఎస్సై ఎర్రన్న, కడప టూ టౌన్ ఎస్ఐ మహమ్మద్ అలీఖాన్‌లకు, ఇతర సిబ్బందికి చార్జి మోమోలు జారీ చేశారు. శాఖపరమైన విచారణకు ఆదేశించారు. నివేదిక వచ్చాక మరిన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు.