ప్రతి ఉద్యోగి సంస్థ అభివృద్ధికి కృషి చేయాలి

సంస్థ ఓ.ఆర్. పెంచేందుకు సిబ్బంది సమిష్టిగా కృషి వైద్యం కోసం వచ్చే సిబ్బందికి మెరుగైన చికిత్స విధాత‌: ఆర్టీసీ ఎం.డి. సి హెచ్.ద్వారకా తిరుమలరావు బుధవారం కడప రీజియన్లో పర్యటించారు. సంస్థ సిబ్బంది, అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. పులివెందుల నూతన డిపో బస్టాండ్ నిర్మాణ పనుల ప్రగతిని సమీక్షించారు. పులివెందుల నూతన బస్టాండ్ సముదాయంలో మొక్కలు నాటారు. నిర్మాణం పూర్తయిన తర్వాత డిపో సముదాయాన్ని బస్టాండ్ నకు తరలించనున్నట్లు తెలిపారు. పులివెందుల డిపో సందర్శ‌న‌ […]

ప్రతి ఉద్యోగి సంస్థ అభివృద్ధికి కృషి చేయాలి
  • సంస్థ ఓ.ఆర్. పెంచేందుకు సిబ్బంది సమిష్టిగా కృషి
  • వైద్యం కోసం వచ్చే సిబ్బందికి మెరుగైన చికిత్స

విధాత‌: ఆర్టీసీ ఎం.డి. సి హెచ్.ద్వారకా తిరుమలరావు బుధవారం కడప రీజియన్లో పర్యటించారు. సంస్థ సిబ్బంది, అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. పులివెందుల నూతన డిపో బస్టాండ్ నిర్మాణ పనుల ప్రగతిని సమీక్షించారు. పులివెందుల నూతన బస్టాండ్ సముదాయంలో మొక్కలు నాటారు. నిర్మాణం పూర్తయిన తర్వాత డిపో సముదాయాన్ని బస్టాండ్ నకు తరలించనున్నట్లు తెలిపారు.

పులివెందుల డిపో సందర్శ‌న‌

డిపోలో నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ ఎం.డి. ద్వారకా తిరుమలరావు కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రతి ఉద్యోగి సంస్థ అభివృద్ధికి కృషి చేయాలన్నారు . ప్రయాణికుల నుండి ఫిర్యాదులు లేకుండా ఉత్తమ సేవలు అందించడమే లక్ష్యంగా విధులు నిర్వర్తించాలన్నారు . ఆర్టీసీ ఉన్నది ప్రజల కోసమేనని, మనవంతుగా చేయవలసిన సేవలు పూర్తి స్థాయిలో అంకిత భావంతో చేయాలన్నారు. ప్రయాణికుల గురించే ఆలోచన ఉండాలని, వారికి కావలసిన విధంగా సర్వీసు చేసినప్పుడే ఆర్టీసీ పట్ల ప్రయాణికుల్లో నమ్మకం మరింత బలపడుతుందని అన్నారు. సంస్థ ఓ.ఆర్. పెంచేందుకు సిబ్బంది సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు. ఈ.పి.కే.మీద దృష్టి పెట్టాలని, కార్గో ఆదాయం పెంచుకోవడానికి అందరూ శ్రమించాలన్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కాబట్టి ఆర్టీసీ ఉద్యోగులు మరింత బాధ్యతగా మెలిగి, సంస్థకు, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకు రావాలన్నారు. కొత్త డిపో బస్ స్టేషన్ పనులు పురోగతిలో ఉన్నాయని సెప్టెంబర్ నాటికి పూర్తవుతాయని తెలిపారు. కోవిడ్ పాండమిక్ పరిస్థితుల్లో శానిటరీ, పోలీసు మొదలగు శాఖలతో సహా ఆర్టీసీ సిబ్బంది కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా సేవలందించడం గొప్ప విషయమన్నారు. కొందరు కార్మికుల్ని కూడా మనం దూరం చేసుకోవడం బాధాకరమని దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రతి ఉద్యోగి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. సిబ్బంది పెట్టుకుంటున్న ప్రతి ఆర్జీ క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుందని, సాధ్యాసాధ్యాలు గమనించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకునేందుకు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో ఎప్పటికప్పుడు తాను చర్చిస్తున్నట్లు, తగిన నిర్ణయాలు తీసుకుంటునట్లు ఎం.డి. తెలిపారు. సంస్థ ను లాభాల్లో నడిపించే భాద్యత మీదని, మీ భాద్యత నాదని అన్నారు.

యర్రగుంట్ల బస్ స్టేషన్ సందర్శన : యర్ర గుంట్ల బస్ స్టేషన్ సందర్శించి పరిశుభ్రత, బస్టాండ్ నిర్వహణను పరిశీలించారు. కడప ఏపీఎస్ఆర్టీసీ డిస్పిన్సరి పరిశీలించిన ఎం.డి. కడప జోన్ సిబ్బంది కోసం నిర్మించిన డా. వై.యస్. రాజశేఖర్ రెడ్డి ప్రాంతీయ వైద్యశాలను సందర్శించారు. సిబ్బందికి ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సౌకర్యాలు, సదుపాయాలను, అక్కడి గదులను డాక్టర్లతో కలిసి ఎం.డి. పరిశీలించారు. హాస్పిటల్లో ఆర్.ఓ. ప్లాంట్ ను ప్రారంభించారు. వివిధ విభాగాలు సందర్శించి, ఇన్ పేషెంట్ ని పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని వారికి సూచించారు. వైద్యం కోసం వచ్చే సిబ్బందికి మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లకు సూచించారు. కరోనా సమయంలో చాలా మంది సిబ్బంది ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ప్రజలకు సేవలు అందించారని కొనియాడారు. అలాంటి సిబ్బంది ఆరోగ్యం పట్ల బాధ్యత వహించడం మా బాధ్యత అని తెలిపారు. దానిలో భాగంగా ఈ ఆసుపత్రి ని సందర్శించడం జరిగిందని తెలిపారు. పూర్తి సౌకర్యాలతో సుమారు రూ.5 కోట్ల వ్యయంతో కడప జోన్ లో ఈ ఆసుపత్రి నిర్మించడం జరిగిందని, 7 గురు వైద్య సిబ్బంది ఇక్కడ సేవలందిస్తున్నారని తెలిపారు. త్వరలో ఆక్సిజన్ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తామన్నారు. పురుషుల, మహిళల ఇన్ పేషంట్ , ఔట్ పేషంట్ విభాగాలను పరిశీలించారు.

కడప జోనల్ వర్క్ షాప్ సందర్శన
ఎం.డి జోనల్ వర్క్ షాప్ సందర్శించారు. వర్క్ షాప్ అధికారులు, సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆవరణలో మొక్కలు నాటిన తదుపరి సిబ్బంది ని ఉద్దేశించి ప్రసంగించారు. కార్మికులంతా సమిష్టిగా కృషి చేసి కడప రీజియన్ ని బెస్ట్ రీజియన్ గా నిలబెట్టాలని, ఆ దిశగా అందరూ ఐకమత్యంతో పనిచేయాలన్నారు. ఉద్యోగుల సంక్షేమ బాధ్యత తనదని అందరికీ అందవలసిన ప్రయోజనాలన్ని అందించేందుకు నేనున్నానని తెలిపారు. అలాగే మీరంతా ఆర్టీసీకి పేరు తీసుకొచ్చేలా క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని తెలిపారు. కడప బస్టాండ్, గ్యారేజీ పరిశీలించిన ఎం.డి కడప బస్టాండ్ పరిశీలించి అక్కడి ప్రయాణికులతో మాట్లాడారు. బస్సుల నిర్వహణ పరిశీలించారు. డ్యూటి నిర్వహిస్తున్న సిబ్బందితో ముచ్చటించారు. విధి నిర్వహణలో సిబ్బంది చాలా శ్రమిస్తారని, అనేక ఒత్తిళ్ళకు గురవుతారని కాబట్టి బి.పి., షుగర్ మొదలగు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. తమని తాము నియంత్రించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తద్వారా డ్యూటి ఏకాగ్రతతో చేయగలమన్నారు. గ్యారేజీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. ఆర్టీసీ ని లాభాల బాటలో నడిపించడమే లక్ష్యంగా అందరూ కష్టపడాలన్నారు. సిబ్బంది ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చెడు అలవాట్లను దూరం చేసుకోవడం వలన మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా ఆనందంగా ఉంటారని తెలిపారు. ఆర్టీసీని ప్రజలకు మరింత దగ్గర చేసే బాధ్యత అందరిపై ఆధారపడి ఉందన్నారు. అసోసియేషన్ ప్రతినిధులు ఎం.డిని కలిసి వినతి పత్రాలు అందజేశారు. ఈ పర్యటనలో ఎం.డితో పాటు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు కే.ఎస్. బ్రహ్మానంద రెడ్డి (ఆపరేషన్స్ ), పి.కృష్ణ మోహన్ ( ఇంజినీరింగ్), కడప జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి. వి. రవి వర్మ, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.