ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖరాసిన..ఎంపీ జీవీఎల్ నరసింహారావు

తెలుగు భాష యొక్క ప్రాముఖ్యతను తగ్గించడంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి లేఖ విధాత :మీరు అధికారంలోకి వచ్చినప్పటినుంచి తెలుగు భాష ప్రాముఖ్యతను తగ్గించే విధంగా,కించపరిచే విధంగా మీ ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకొంది.తెలుగు భాష మన సంస్కృతికి, ఉనికికి ఆధారం. తెలుగు భాషను చిన్నచూపుచూడటం. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటమే. అయినా, మూడున్నర వేల సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగుభాష ఔన్నత్యాన్ని తగ్గించే అధికారం మూన్నాళ్ళకు ఎన్నుకోబడే ప్రభుత్వాలకు ఎక్కడిది ముఖ్యమంత్రి ? మన […]

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖరాసిన..ఎంపీ జీవీఎల్ నరసింహారావు

తెలుగు భాష యొక్క ప్రాముఖ్యతను తగ్గించడంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి లేఖ

విధాత :మీరు అధికారంలోకి వచ్చినప్పటినుంచి తెలుగు భాష ప్రాముఖ్యతను తగ్గించే విధంగా,కించపరిచే విధంగా మీ ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకొంది.తెలుగు భాష మన సంస్కృతికి, ఉనికికి ఆధారం. తెలుగు భాషను చిన్నచూపుచూడటం. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటమే. అయినా, మూడున్నర వేల సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగుభాష ఔన్నత్యాన్ని తగ్గించే అధికారం మూన్నాళ్ళకు ఎన్నుకోబడే ప్రభుత్వాలకు ఎక్కడిది ముఖ్యమంత్రి ?

మన భాషపై మనకే మక్కువ లేకుంటే అంతకన్నా దౌర్భగ్యం ఏమైనా ఉందా? బ్రిటిష్ వారు పరిపాలించినపుడే ఇంత సాహసం చేయలేదే.ఆంగ్లభాషకు ఎవ్వరం వ్యతిరేకం కాదు. కానీ విదేశ భాష మోజులో మన భాషను మరుగునపడేయాలనుకోవటం భావ్యం కాదు. చేయరాని దుస్సాహసం కూడా.

మొదటగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని మీ ప్రభుత్వం తప్పనిసరిచేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.ఈ నిర్ణయాన్ని మా పార్టీ నాయకులు ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేస్తే న్యాయస్థానం ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టేసింది. దానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. అక్కడ కూడా చుక్కెదురవటం ఖాయం. ఎందుకంటే, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం. పార్లమెంటు 1968లో చేసిన అధికారిక భాషా తీర్మానానికి విరుద్ధం. నూతన జాతీయ విద్యా విధానానికి కూడా విరుద్ధమే. ఏ రకంగా వీటన్నింటికీ విరుద్దమో సంబంధిత అంశాలను ఈ లేఖతో జతచేస్తున్నాను.

డిగ్రీ కళాశాలల్లో తెలుగు మీడియాన్ని ఎత్తివేయాలన్నది మీ ప్రభుత్వం తీసుకొన్న మరొక నిర్ణయం. తెలుగు మాధ్యమంలో చదువుకొనే వేలాదిమంది విద్యార్థులకు ఇది అశనిపాతంగా మారింది. ఒకవైపు, ఉన్నతవిద్యతోపాటు సాంకేతిక విద్యను కూడా భారత భాషల్లో నేర్పాలని కేంద్ర ప్రభుత్వం చక్కటి ప్రయత్నం చేస్తుంటే మీరంతా ఆంగ్లమయం చేయాలనుకోవడం ఆశ్చర్యాన్ని, అనుమానాలను కలగచేస్తోంది. గత వారమే ప్రధాని నరేంద్ర మోడీ భారతభాషల్లో సాంకేతిక విద్య ఉండాలని చెప్పటం, దానికి అనుగుణంగా అఖిల భార్హత సాంకేతిక విద్యా మండలి (AICTE) తెలుగుతో సహా ఎనిమిది భారత భాషల్లో వచ్చే విద్యా సంవత్సరానికి బిటెక్ పాఠ్యపుస్తకాలను సిద్ధం చేయటం తెలిసిందే. జాతీయ విద్యా విధానానికి, ప్రణాళికలకు విరుద్ధంగా పనిచేయటం ఎంతవరకు సబబు ముఖ్య మంత్రి ? గత వారం తెలుగు అకాడమీ పేరును తెలుగు సంస్కృత అకాడెమీగా మారుస్తూ మీ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం తెలుగుభాష ప్రాముఖ్యతను తగ్గించాలనే మీ ఆలోచనలో భాగంగా కన్పిస్తోంది. ప్రాచీన భాష అయిన సంస్కృత భాషాభివృద్ధి చేయాలనుకోవడం మంచి నిర్ణయమే. కానీ దానికి తెలుగు అకాడమీ కార్యకలాపాల్లో తెలుగు భాష ప్రాధాన్యతను తగ్గించవలసిన అవసరం లేదు. సంస్కృతానికి కొత్త అకాడెమీని స్థాపించి ఇతర రాష్ట్రాలకు సైతం ఆదర్శప్రాయం కావచ్చు.

జగన్,మీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తెలుగు భాషను, తెలుగువారి సంస్కృతిని దెబ్బతీసే విధంగా వున్నాయి. ఇది ఉద్దేస్యపూరితమా కాదా అన్నది పక్కనపెడితే వాటి పర్యవసానం మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర యువతకు, వారి భవిష్యత్తుకు అఘాతం కలిగించేవే. మీ అనాలోచిత నిర్ణయాలను స్వయంగా ఉపసంహరించుకోవాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. లేకుంటే, మీ ప్రభుత్వ నిర్ణయాలను అన్ని విధాలుగా తీవ్రంగా వ్యతిరేకిస్తాం..

మాలాగ మీరు తెలుగు మాధ్యమంలో చదవలేదుకనుక తెలుగులో ఈ లేఖను చదవటానికి ఇష్ట పడతారో లేదో లేక కష్టపడతారేమోనన్న అనుమానంతో ఈ లేఖ ఆంగ్ల అనువాదాన్ని కూడా జతచేస్తున్నాను.

ఇట్లు.

జీవీఎల్
గుంటుపల్లి వెంకట లక్ష్మీ నరసింహా రావు