శ్రీరాముడు దేశ ప్రజలందరికీ ప్రేరణ

శ్రీరాముడు దేశ ప్రజలందరికీ ప్రేరణ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రామరాజ్య భావన నిజమైన ప్రజాస్వామ్యం అని మహాత్మాగాంధీ చెప్పేవారంటూ గుర్తు చేశారు

శ్రీరాముడు దేశ ప్రజలందరికీ ప్రేరణ

– రామరాజ్య భావన నిజమైన ప్రజాస్వామ్యం

– సుపరిపాలనకు కేంద్రంగా ‘నాసిన్’

– ప్రధాని నరేంద్ర మోదీ

– శ్రీ సత్యసాయి జిల్లాలో రూ.1500 కోట్లతో

నిర్మించిన నాసిన్ అకాడమీ ప్రారంభం

– హాజరైన ఏపీ సీఎం జగన్, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్,

గవర్నర్ అబ్దుల్ నజీర్

విధాత: శ్రీరాముడు దేశ ప్రజలందరికీ ప్రేరణ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రామరాజ్య భావన నిజమైన ప్రజాస్వామ్యం అని మహాత్మాగాంధీ చెప్పేవారంటూ గుర్తు చేశారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్ లోని శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలో కేంద్ర ప్రభుత్వం రూ.1500 కోట్లతో 503 ఎకరాల్లో ఏర్పాటు చేసిన నాసిన్ అకాడమీని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరయ్యారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడారు. పుట్టపర్తి శ్రీసత్యసాయిబాబా జన్మస్థలమని, లేపాక్షిలో వీరభద్ర స్వామిని దర్శించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ప్రజలకు సేవకులు మాత్రమే అన్నారు. అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠకు ముందు 11 రోజులు అనుష్టానం చేస్తున్నట్లు చెప్పారు.


ఐఆర్ఎస్ అభ్యర్థులకు నాసిన్ అకాడమీలో శిక్షణ ఇస్తారని, నాసిన్ సుపరిపాలనకు కేంద్రంగా మారనుందని తెలిపారు. సుపరిపాలన అంటే బలహీనులకు అండగా ఉండడమే అన్నారు. ‘నేను ఎల్లప్పుడూ ధర్మం పక్షానే నిలుస్తాను’ అని రాముడు చెప్పాడన్నారు. ‘అధర్మ మార్గంలో వచ్చేది నాకు ఇంద్రప్రస్థమైనా అక్కర్లేదు’ అని రాముడి బోధనలు మనకు గుర్తున్నాయన్నారు. అక్రమంగా వచ్చే అధికారాన్ని స్వీకరించొద్దని రాముడు చెప్పాడని అన్నారు. రామరాజ్యంలో పన్నుల వ్యవస్థ కూడా సరళంగా ఉండేదని, అదేమాదిరి బీజేపీ ప్రభుత్వంలో కూడా పన్నుల వ్యవస్థ సరళంగా ఉందని చెప్పారు. జీఎస్టీ రూపంలో కొత్త పన్నుల వ్యవస్థ తీసుకొచ్చామన్నారు. ఇన్ కం ట్యాక్స్ చెల్లింపులు సులభతరం చేశామని, ఈక్రమంలో ఆదాయపు పన్ను చెల్లించేవారి సంఖ్య ప్రతిఏటా పెరుగుతోందని తెలిపారు. ఆదాయపు పన్ను పరిమితి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచామని, రికార్డు స్థాయిలో పన్నులు వసూలవుతున్నట్లు పేర్కొన్నారు.


గాంధీ ఎల్లప్పుడూ రాముడి గురించే చెప్పేవాడని, రామరాజ్యంలో రాజులు ఉండరు.. ప్రజలే ప్రభువులన్నారు. నాసిన్ లో పెండింగ్ పనులు పూర్తిచేస్తామని, అవినీతిపై ఉక్కుపాదం మోపుతామని ప్రధాని మోదీ అన్నారు. అంతకుముందు కార్యక్రమంలో మాట్లాడిన సీఎం జగన్.. నాసిన్ ఐఆర్ఎస్ అభ్యర్థుల శిక్షణా కేంద్రం అని, రూ.1500 కోట్లతో 503 ఎకరాల్లో నాసిన్ అకాడమీ ఏర్పాటైనట్లు చెప్పారు. శ్రీసత్యసాయి జిల్లా పాలసముద్రం సమీపంలో నాసిన్ ప్రారంభం కావడం, వరల్డ్ క్లాస్ ఇన్ స్టిట్యూట్ రావడం గర్వంగా ఉందని జగన్ అన్నారు. ఈ అకాడమీతో ఆంధ్రప్రదేశ్ పేరు, ప్రతిష్ట అంతర్జాతీయ స్థాయిలో నిలబడనుందని చెప్పారు.