వైసీపీకి మరో షాక్‌..షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే ఆళ్ల

ఏపీలో అధికార వైసీపీ పార్టీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీకి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆదివారం వైఎస్ షర్మిల సమక్షంలో

వైసీపీకి మరో షాక్‌..షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే ఆళ్ల
  • షర్మిల రాకతో జగన్‌లో భయం : రఘువీరారెడ్డి

విధాత : ఏపీలో అధికార వైసీపీ పార్టీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీకి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆదివారం వైఎస్ షర్మిల సమక్షంలో విజయవాడలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ కండువా కప్పి వైఎస్ షర్మిల ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. త్వరలోనే రాష్ట్ర కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు ఉంటాయని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. ఆళ్లతో పాటు శెట్టి గంగాధర్, మరి కొంతమంది వైసీపీ శ్రేణులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. షర్మిల ఏపీ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటనే వైసీపీ నుంచి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేరడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని రగిలించింది.

షర్మిల రాకతో జగన్‌లో భయం : రఘువీరారెడ్డి

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రాకతో జగన్ ప్రభుత్వానికి భయం పట్టుకుందని కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి అన్నారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ షర్మిల వస్తుంటే దారి పొడవునా ఆటంకాలు కలిగించారని మండిపడ్డారు. ఏపీలో తప్పకుండా కాంగ్రెస్‌కు పూర్వవైభవం రావడం ఖాయమన్నారు. షర్మిల జిల్లాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి అందరినీ కలుస్తారని తెలిపారు. కాంగ్రెస్ తరపున వైఎస్సార్ అభిమానులకు, పార్టీ శ్రేణులకు భరోసా ఇస్తారని.. ఆమె వెంట కలిసి నడుస్తారన్నారు. ఏపీసీసీ కోసం గిడుగు రుద్రరాజు చేసిన త్యాగం మరువలేనిదని చెప్పారు.

కాన్వాయ్ అడ్డగింతపై షర్మిల ఫైర్‌

విధాత : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై వైఎస్ షర్మిలఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని చూసి జగన్ సర్కార్ భయపడుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటున్న సమయంలో కాన్వాయ్ ఆపడంపై షర్మిల మండిపడ్డారు. రాజన్న బిడ్డ ఎవరికీ భయపడదని తేల్చిచెప్పారు. అనుమతి తీసుకొని వెళ్తుంటే అడ్డుకోవాల్సిన అవసరం ఏముందని అడిగారు. ఆంధప్రదేశ్‌లో నియంత పాలన నడుస్తోందని షర్మిల ధ్వజమెత్తారు. ఎనికేపాడు వద్ద వైఎస్ షర్మిల కాన్వాయ్‌ను పోలీసులు ఆపారు. అక్కడి నుంచి వాహనాలను మళ్లించారు. వెహికిల్స్ డైవర్ట్ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు రోడ్డు మీద బైఠాయించారు. సీఎం జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెనక ఉన్న వాహనాలు వచ్చేవరకు ముందుకు వెళ్లమని షర్మిల తేల్చిచెప్పారు. అక్కడ వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు షర్మిల వద్దకొచ్చి మాట్లాడారు. కాంగ్రెస్ శ్రేణుల ఆందోళనతో పోలీసులు దిగొచ్చారు. షర్మిల కాన్వాయ్‌కు అనుమతి ఇచ్చారు.