చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ ఉందని వైసీపీ నిందలు: నారా లోకేశ్

- బీజేపీ పాత్ర లేదని అమిత్ షా స్పష్టం చేశారు
- టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్
విధాత: చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ ఉందని వైసీపీ నిందలు వేస్తుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ఆయన నిన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అనంతరం ఈ భేటీకి సంబంధించి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ లేదని నాకు అమిత్ షా స్పష్టం చేశారన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం రాజకీయ కక్షతో చంద్రబాబును, తనను కేసులతో ఇబ్బందులు పెడుతున్నారని, మా తల్లి, భార్యలను కూడా కేసుల్లోకి లాగేందుకు ప్రయత్నిస్తున్నారని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు.
సీఐడీ ఎందుకు నన్ను పిలిచిందో అమిత్ షా అడిగారని, చంద్రబాబు ఆరోగ్యం గూర్చి అమిత్ షా అడిగారని లోకేశ్ వెల్లడించారు. చంద్రబాబు జైలులో ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, జైలులో నక్సలైట్లు ఉన్నారని, రక్షణ పరంగా ఇబ్బందులు ఉన్నాయని అమిత్ షాకు తెలిపానన్నారు. అమిత్ షా నిన్ను కలవాలని అంటున్నారని కిషన్ రెడ్డి కాల్ చేశారని, రాజకీయాల గురించి అమిత్ షా తో సమావేశంలో ఎటువంటి చర్చ జరగలేదన్నారు. కేసులతో మమ్మల్ని బ్లేమ్ చేయాలని జగన్ చూస్తున్నారన్నారు.
వైసీపీ ఎంపీలు నేరుగా చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ ఉందని చెబుతున్నారని, చంద్రబాబు అరెస్ట్ విషయంలో బీజేపీపై జగన్ నిందలు వేస్తున్నారని వివరించడం జరిగిందన్నారు. ఏపీలో రాజకీయ కక్ష సాధింపు జరుగుతుందని, కేంద్రం జోక్యం చేసుకోవాలని అమిత్‌షాను కోరడం జరిగిందన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డులో నీ పాత్ర ఏంటి నిన్ను ఎందుకు పిలిచారని అమిత్ షా అడిగారని, హెరిటేజ్ భూముల నుంచి రోడ్డు మార్గం వెళ్తుంది కాబట్టి విచరణకి పిలిచారని తెలియచేశానన్నారు.ఇన్నర్ రింగ్ రోడ్డు లో స్కాం లేదని వివరించానన్నారు.
ఆంధ్ర ప్రాంతం పైనే ఫోకస్ గా ఉన్నానని అమిత్ షా చెప్పారన్నారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ లేదని ప్రజలు, టీడీపీ, బీజేపీ కేడర్ నమ్ముతుందన్నారు. శాంతి భద్రతలు రాష్ట్ర పరిధిలో ఉన్న అంశమని, చంద్రబాబు పై కేసుల విషయంలో పై రాష్ట్రాన్ని వివరణ కోరతామని అమిత్ షా హామీ ఇచ్చారని లోకేశ్ వెల్లడించారు. తాను యువగళం పాదయాత్ర తిరిగి చేపడుతానని, కేసులు,లీగల్ అంశాలపై దృష్టి పెట్టేందుకే పాదయాత్ర ఆపడం జరిగిందన్నారు. చంద్రబాబు అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ దేశ, విదేశాల్లో ఆందోళనలు జరిగాయని, జగన్ సంక్షేమ పథకాలతో ప్రజల పైనే భారాలు పడుతున్నాయని, విద్యుత్తు బిల్లులు, ఇంటి పన్నులు, బిల్లులు అన్ని పెరిగాయన్నారు.
సంక్షేమం, అభివృద్ధి వల్ల ప్రజలకు ఉపయోగం ఉంటుందన్నారు. ఉద్యోగాలు కల్పించాలని, కాని ఏపీలో పెట్టుబడులు లేవని, ఉద్యోగాలు లేవన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసు 2021 సెప్టెంబర్ 7 న నమోదైనట్లు ఎఫ్‌ఐఆర్‌లో ఉందని, అడ్వకేట్ జనరల్ ఏపీ హైకోర్టును తప్పుదోవ పట్టించారన్నారు. సీఐడీ విచారణలో భువనేశ్వరి ఇన్ కమ్ టాక్స్ రిటర్న్స్ గురించి నన్ను అడిగారని, నేను సమాధానం చెప్పలేనని అభ్యంతరం తెలిపానని, దాన్ని వెంటనే వెనక్కి తీసుకున్నారన్నారు. సీఐడీ దర్యాప్తు వ్యవహారం పై సీబీఐకి ఫిర్యాదు చేస్తానన్నారు.
జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు ఇక్కడితో ముగిసిపోలేదని, నా అకౌంట్స్, క్రెడిట్ కార్డు బిల్లులు అన్ని చెక్ చేస్తున్నారని, నా క్రెడిట్ కార్డు బిల్లులను నా భార్య కడుతుందని, నాకు ఎటువంటి అభ్యంతరాలు లేవన్నారు. లింగమనేని ఇంటికి మేము అద్దె కడితే క్విడ్ ప్రోకో అంటున్నారని, అది క్విడ్ ప్రోకో కిందకు ఎలా వస్తుందో వారికే తెలియలంటూ విమర్శించారు. ఈ సమావేశంలో ఎంపీలు కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్ర కుమార్, కంభంపాటి రామ్మోహన్ రావు , వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణ రాజులు పాల్గొన్నారు.