పేద రైతు కల …” వై.ఎస్.ఆర్ జలకళ “
విధాత,నూజివీడు: దేశానికి వెన్నుముక రైతన్న.ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకుని శ్రమించి దేశానికి అన్నంపెట్టే రైతన్నకు ఎంతచేసినా తక్కువే నన్న దివంగత డా. వై.ఎస్. రాజశేఖరరెడ్డి ఆశయాల అడుగు జాడలలో ఆయనకు మించి రైతు సంక్షేమాన్ని కాంక్షించే మన ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి తపనలోనుండి పుట్టినదే "వై.ఎస్.ఆర్ జలకళ " పధకం.

విధాత,నూజివీడు: దేశానికి వెన్నుముక రైతన్న.ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకుని శ్రమించి దేశానికి అన్నంపెట్టే రైతన్నకు ఎంతచేసినా తక్కువే నన్న దివంగత డా. వై.ఎస్. రాజశేఖరరెడ్డి ఆశయాల అడుగు జాడలలో ఆయనకు మించి రైతు సంక్షేమాన్ని కాంక్షించే మన ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి తపనలోనుండి పుట్టినదే “వై.ఎస్.ఆర్ జలకళ ” పధకం.
రాష్ట్రంలోని ప్రతీ ఎకరాకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.నదీ జలాలు అందుబాటులో లేని ప్రాంతాలలో సాగునీటికి రైతాంగం బోర్లపైనే ఆధారపడుతున్నారు.మోతుబరి రైతులు తమ పొలాల్లో లక్షలాది రూపాయలు ఖర్చు చేసి సాగునీటి బోర్లు వేయించుకుని,వాటికీ మోటార్లు,విద్యుత్ ఏర్పాటుతో తమ పంటలను పండించుకుంటున్నారు.
రాష్ట్రంలోని ఎంతో మంది సన్న, చిన్నకారు రైతులు తమకున్న ఒకటి, రెండు ఎకరాల భూమిలో సాగునీటి సౌకర్యం లేక బోర్ వేయించే ఆర్ధిక స్థోమత లేక తమకున్న కొద్దిపాటి భూమిని సాగులోనికి తీసుకురాలేక నిరుపయోగంగా ఉంచుతున్నారు. సాగునీటి సౌకర్యం లేని కారణంగా సాగులోనికి రాని ఎస్.సి., ఎస్.టి ., రైతుల భూములను " వై.ఎస్.ఆర్ జలకళ " పధకం ద్వారా సాగులోనికి తీసుకువచ్చి వారి జీవనప్రమాణాలను మెరుగు పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని పెద్ద ఎత్తున అమలు చేస్తున్నది. " వై.ఎస్.ఆర్ జలకళ " కింద రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలోను నిరుపేదలైన ఎస్.సి., ఎస్.టి. రైతులను గుర్తించి, వారి భూములను సస్యశ్యామలం చేసేందుకు వ్యవసాయానికి సాగునీటికి బోర్ తవ్వకంతో పాటు పంపుసెట్,మోటార్ దానికి విద్యుత్ సౌకర్యాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. " వై.ఎస్.ఆర్ జలకళ "నూజివీడు నియోజకవర్గంలో ఇంతవరకు 31 వ్యవసాయ బోర్లు మంజూరు చేయడం జరిగింది.
"వై.ఎస్.ఆర్ జలకళ " పధకం ద్వారా లబ్ది పొందిన రైతు ఆనందం అతని మాటల్లోనే విందాం …
నూజివీడు మండలం ఈదులవారిగుడెంనకు చెందిన రైతు ముసిముక్కు శ్రీను మాట్లాడుతూ తనకు ఈదులవారిగూడెం లో 2 ఎకరాల పొలం ఉన్నదని , సరైన సాగునీటి సౌకర్యం లేని కారణంగా బీడు భూమిగానే ఉండేదన్నారు. పొలానికి సాగునీటి సౌకర్యం కల్పించేందుకు బోర్ వేయించేందుకు లక్షలాది రూపాయలు ఖర్చు అవుతుందని, అది తనకు తలకు మించినదని, ఏమీ చేయలేక బాధ పడేవాడినన్నారు.తనకు దగ్గరలోని గ్రామ సచివాలయ సిబ్బంది తన సమస్యను తెలుసుకుని, "వై.ఎస్.ఆర్ జలకళ " పధకం గురించి తెలియజేసి తనచేత దరఖాస్తు చేయించారన్నారు.రూపాయి కూడా ఖర్చు లేకుండా తన పొలంలో బోర్ వేసి ,మోటార్ బిగించి, విద్యుత్ కనెక్షన్ కూడా పూర్తిగా ఉచితంగా అందించి,తన భూమాతను సాగుకు అనువుగా మలచిన "వై.ఎస్.ఆర్ జలకళ " పధకం నిజంగా తన లాంటి చిన్న, సన్నకారు రైతుల పాలిట వరమని చెప్పారు.
తన స్వంత భూమిలో పంటలను సాగుచేస్తానని తాను జీవితంలో ఊహించలేదని,తన చిరకాల వాంఛ నెరవేర్చిన ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి తాను జన్మంతా రుణపడి ఉంటానని ఆనందభాష్పలతో తన మనసులో మాటను ముసిముక్కు శ్రీను చెప్పాడు.
బీడు భూములను చూస్తూ బాధపడే రోజులు పోయి, పచ్చని చేలతో కళకళ లాడే పంట భూములను చూస్తూ ఆనందించే రోజులు తమకు కల్పించిన ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కి తాము జీవితాంతం రుణపడి ఉంటామని రాష్ట్రంలోని రైతులందరూ ముక్తకంఠంతో చెబుతున్నారు.
రైతు సంక్షేమమే దేశ సంక్షేమం రైతుకు చేసిన సేవ దేశానికీ చేసిన సేవతో సమానం. దేశానికి అన్నంపెట్టే రైతు సంక్షేమానికి కృషి చేసే ప్రతీఒక్కరూ దైవంతో సమానం.