మురికివాడల రహితంగా విశాఖ
విశాఖకు కొత్త రూపు ఆగస్టులో సీఎం జగన్ మోహన్ రెడ్డి చేతులమీదుగా పలు పథకాలకు భూమి పూజ. విశాఖపట్నం : కార్యనిర్వాహక రాజధానిగా మారబోతున్న విశాఖ నగరాన్ని ప్రణాళికాయుతంగా అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఎం.శ్రీనివాసరావు వెల్లడించారు. నగరంలో వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టనున్న అభివృద్ధి పనులు, భూ ఆక్రమణలు, సింహాచలం భూ సమస్యలపై ఎంపీ వి.విజయసాయిరెడ్డితో కలిసి మంత్రి కలెక్టరేట్లో సమీక్షించారు. అనంతరం సమావేశ నిర్ణయాలను వెల్లడించారు.విశాఖను మురికివాడల రహితంగా తీర్చిదిద్దేందుకు చర్యలు […]

విశాఖకు కొత్త రూపు ఆగస్టులో సీఎం జగన్ మోహన్ రెడ్డి చేతులమీదుగా పలు పథకాలకు భూమి పూజ.
విశాఖపట్నం : కార్యనిర్వాహక రాజధానిగా మారబోతున్న విశాఖ నగరాన్ని ప్రణాళికాయుతంగా అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఎం.శ్రీనివాసరావు వెల్లడించారు. నగరంలో వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టనున్న అభివృద్ధి పనులు, భూ ఆక్రమణలు, సింహాచలం భూ సమస్యలపై ఎంపీ వి.విజయసాయిరెడ్డితో కలిసి మంత్రి కలెక్టరేట్లో సమీక్షించారు. అనంతరం సమావేశ నిర్ణయాలను వెల్లడించారు.
విశాఖను మురికివాడల రహితంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఈ క్రమంలో పేదలందరికీ ఇళ్లు నిర్మించనున్నామన్నారు. మురికివాడల్లోని ప్రజల వివరాలను నెలరోజుల్లో అధికారులు సేకరిస్తారని చెప్పారు. ఆయా అంశాల ఆధారంగా మెట్రోనగర స్వరూపంలో అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళికను తయారు చేస్తామన్నారు. నగరాన్ని కాలుష్య రహితంగా మార్చేందుకు వీలుగా లక్ష మొక్కలు నాటనున్నామన్నారు. ఆగస్టులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహించనున్నారని వివరించారు. సింహాచలం దేవస్థానానికి చెందిన 744 ఎకరాల భూములకు సంబంధించి గత ప్రభుత్వ పాలనలో దస్త్రాలు తొలగించారని, ఆయా భూములను కొంతమంది కొనుగోలు చేశారని మంత్రి తెలిపారు. ఈ భూ ఆక్రమణలపై విచారణ చేస్తున్నామని, బాధ్యులైన అధికారులు, సిబ్బంది, కొనుగోలుదారులపై చర్యలు తీసుకుంటామన్నారు. పంచగ్రామాల సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తామని, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల జేసీల ఆధ్వర్యంలో సర్వే సాగుతుందని మంత్రి చెప్పారు. రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ దేవాలయాల భూముల ఆక్రమణలు, ఒకరి నుంచి మరొకరికి భూ బదలాయింపులు, అమ్మకాలపై చట్ట ప్రకారం చర్యలు తీసు కుంటామన్నారు. ఎంతటివారినైనా విడిచి పెట్టేదిలేదన్నారు. సింహాచలం దేవస్థానం భూముల విషయంలో ఇళ్ల స్థలాలు, వ్యవసాయ భూములను కోర్టు ఆదేశాలకు లోబడి క్రమబద్ధీకరిస్తామన్నారు. కలెక్టర్ వినయ్‌చంద్, జేసీలు వేణుగోపాల్‌రెడ్డి, అరుణ్‌బాబు, కమిషనర్ సృజన, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మేయరు హరి వెంకట కుమారి, జీవీఎంసీ, వీఎంఆర్డీఏల అధికారులు పాల్గొన్నారు.