పాక్‌లో ఉగ్రదాడి.. 10 మంది పోలీసులు దుర్మరణం
పాకిస్తాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. చోడన్ పోలీసు స్టేషన్ పరిధిలోని డేరా ఇస్మాయిల్ ఖాన్ వద్ద పోలీసులపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు.

ఇస్లామాబాద్ : పాకిస్తాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. చోడన్ పోలీసు స్టేషన్ పరిధిలోని డేరా ఇస్మాయిల్ ఖాన్ వద్ద పోలీసులపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో 10 మంది పోలీసు అధికారులు ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు.
అయితే ఉగ్రవాదులు పోలీసు స్టేషన్‌లోకి చొరబడి కాల్పులు జరిపారు. అనంతరం గ్రెనేడ్లతో దాడులకు పాల్పడ్డారు. దీంతో ప్రాణ నష్టం అధికంగా జరిగింది. ఈ ఘటనలో గాయపడ్డ పోలీసులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఖైబర్ ఫక్తున్‌కహ్వా రీజియన్, బలూచిస్థాన్‌లో గత కొద్ది రోజుల నుంచి ఉగ్రదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. జనవరి 31న ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో నేషనల్ అసెంబ్లీ క్యాండిడేట్ రేహన్ జేబ్ ఖాన్ చనిపోయారు. ఖాన్ పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుడు.
జనవరి 30వ తేదీన బలూచిస్తాన్‌లో బాంబు పేలుళ్లు జరిపారు. ఈ ఘటనలో 15 మంది పోలీసులు చనిపోయారు. ఇద్దరు పౌరులు, నలుగురు లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెంట్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడులకు పాల్పడింది తామేనని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది.
త్వరలో జరగబోయే పాక్ ఎన్నికలు జరగనివ్వొద్దనే ఉద్దేశంతోనే ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ, సెక్యూరిటీ ఏజెన్సీల సహకారంతో సమయానికే ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.