ఏడాదిగా ఇంట్లో తల్లి శవంతోనే.. కారణం..?!

చనిపోయిన తమ తల్లికి అంత్యక్రియలు చేయకుండా.. మృతదేహాన్ని ఒక గదిలో పెట్టి తాళం వేశారు.

ఏడాదిగా ఇంట్లో తల్లి శవంతోనే.. కారణం..?!

వారణాసి: ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఏడాదిగా తమ తల్లి శవంతోనే ఇంట్లో నివాసం ఉంటున్నారు. వారణాసిలోని లంకా ప్రాంతంలో ఈ ఉదంతం వెలుగు చూసింది. ఆ మహిళ గత ఏడాది డిసెంబర్‌లో చనిపోయింది. కానీ.. ఆమె ఇద్దరు కుమార్తెలు ఆ శవానికి అంతిమ సంస్కారాలు చేయకుండా ఇంట్లోని ఒక గదిలో పెట్టి తాళం వేశారు. ఆ నోట ఈ నోట ఆ విషయం కాస్తా పోలీసులు తెలియడంతో ఘటనా స్థలానికి వచ్చి.. అక్కడి దృశ్యం చూసి నిర్ఘాంతపోయారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు బుధవారం వెల్లడించారు.


సామెన్‌ఘాట్‌లోని మదర్వా ప్రాంతానికి చెందిన ఉషా త్రిపాఠి అనే మహిళ దీర్ఘకాలిక అనారోగ్యంతో గత ఏడాది డిసెంబర్‌లో చనిపోయిందని లంకా స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ శివకాంత మిశ్రా చెప్పారు. అంతకు రెండేళ్ల ముందే ఆమె భర్త ఇంటి నుంచి వెళ్లిపోయాడని తెలిపారు. భార్య చనిపోయిన తర్వాత కూడా ఆయన ఇంటికి తిరిగి రాలేదని, దీంతో ఆమె ఇద్దరు కుమార్తెలు పల్లవి త్రిపాఠి (27), వైష్విక్‌ త్రిపాఠి (18) చనిపోయిన తమ తల్లికి అంత్యక్రియలు చేయకుండా.. మృతదేహాన్ని ఒక గదిలో పెట్టి తాళం వేశారని ఆయన తెలిపారు. వారిద్దరూ వారం రోజులుగా ఇంటినుంచి బయటకు కూడా రావడం లేదని, తలుపే వేసే ఉంటున్నదని చెప్పారు.


దీంతో అనుమానం వచ్చిన స్థానికులు పలుమార్లు తలుపు తట్టినా అక్కా చెల్లెళ్లు తలుపు తీయలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. పోలీసులు తలుపు తట్టినా స్పందన లేకపోవడంతో తలుపు బద్దలు కొట్టి లోనికి ప్రవేశించారు. లోపల గదిలోకి వెళ్లి చూడగా అక్కడ మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో పడి ఉన్నది. అదే గదిలో అక్కాచెల్లెళ్లు కూడా కూర్చొని కనిపించారు. వారిద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.