స్టేషన్‌లో పసికందు.. ఒడిలోకి తీసుకుని పాలుపట్టిన మహిళా కానిస్టేబుల్
ఆకలితో అలమటిస్తున్న ఒక చిన్నారికి మహిళా కానిస్టేబుల్ తన పాలుపట్టి.. ఆకలి తీర్చారు. ఆమె చేసిన పనికి ప్రశంసల జల్లు కురిసింది.

కోచి: తన పిల్లలే కాదు.. ఎవరి పిల్లలు ఆకలితో ఉన్నా.. అమ్మకు మనసొప్పదని నిరూపించారు ఒక మహిళా కానిస్టేబుల్. గుండె జబ్బుతో దవాఖానలో చేరిన ఒక తల్లికి నలుగురు పిల్లలు ఉన్నారు. వారంతా ఆకలితో అలమటిస్తున్నారన్న విషయం తెలుసుకున్న పోలీసులు వారిని స్టేషన్‌కు తీసుకెళ్లి భోజనం పెట్టారు. అయితే.. ఆ పిల్లల్లో ఒక పాలుతాగే పాపాయి కూడా ఉన్నది. ఆ పసికందు ఏడుస్తుంటే చలించిపోయిన ఒక మహిళా కానిస్టేబుల్.. ఆ పాపకు తల్లయి.. తన పాలుపట్టి ఆకలి తీర్చింది. ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది.
పాట్నాకు చెందిన వలస కార్మికురాలికి ఐదుగురు పిల్లలు. వారిలో ఒకరు పాట్నాలోనే ఉన్నారు. మిగిలిన నలుగురు పిల్లలు తల్లితో ఉన్నారు. గోరుచుట్టు మీద రోకలి పోటు అన్నట్టు అనారోగ్యంతో ఉన్న ఆమె దగ్గర తన భర్త కూడా లేడు. ఓ నేరంపై ఆయన కొచ్చిన్ సెంట్రల్ జైల్లో ఉన్నాడు. ఆమె ఆరోగ్యం మరింత క్షీణించి, గుండె నాళాలో సమస్య ఏర్పడి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. దీనితో ఆమె పిల్లలు దిక్కులేని స్థితిలో బిక్కుబిక్కుమని ఆసుపత్రిలో ఆకలితో అలుమటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి సిబ్బంది కొచ్చిన్ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి విషయం తెలియజేశారు. దీనితో ఆస్పత్రికి చేరుకున్న పోలీస్ సిబ్బంది ఆ పిల్లలను స్టేషన్‌కు తీసుకెళ్లి ఆహారం అందించారు.
Kochi Women’s Police Station
ఆ పిల్లల్లో నాలుగు నెలల పసిపాప కూడా ఉంది. ఆ పసిపాపను చూసి చలించి పోయిన మహిళా కానిస్టేబుల్.. పై అధికారికి ఆ పాప విషయం చెబుతూ ఆ చిన్నారికి తాను పాలిస్తానని చెప్పారు. దానికి ఆ అధికారి అంగీకరించడంతో ఆ పాపకు పాలు పట్టారు. తనకు తొమ్మిది నెలల పాప ఉన్నదని, ఆకలితో ఏడుస్తున్న ఆ చిన్నారికి పాలు ఇచ్చి ఆకలి తీర్చినందుకు సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. కానిస్టేబుల్ చేసిన పనికి అందరూ ఆమె పైన ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.