కుదిరిన బీజేపీ..జనసేన..టీడీపీ పొత్తు

అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్‌షాతో టీడీపీ అధినేత, మాజీ సీఎం ఎన్‌.చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ల భేటీ అయ్యారు

కుదిరిన బీజేపీ..జనసేన..టీడీపీ పొత్తు
  • ఎన్డీఏలోకి టీడీపీ..ఆహ్వానించిన అమిత్‌షా
  • 8ఎంపీ సీట్లలో ఆరు బీజేపీకి…రెండు జనసేనకు
  • 17ఎంపీ స్థానాల్లో టీడీపీ
  • కాకినాడ నుంచి పవన్ కల్యాణ్ పోటీ
  • అసెంబ్లీలో 24జనసేనకు..6 బీజేపీకి
  • 145స్థానాల్లో టీడీపీ పోటీ
  • వైసీపీ ఒంటరి పోరు..కూటమిలతో విపక్షాలు


విధాత: అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్‌షాతో టీడీపీ అధినేత, మాజీ సీఎం ఎన్‌.చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ల భేటీ అయ్యారు. రెండు రోజుల నిరీక్షణ అనంతరం అమిత్ షాతో జరిగిన భేటీలో టీడీపీని ఆయన ఎన్డీఏలోకి ఆహ్వానించారు. ఆ వెంటనే సీట్ల సర్ధుబాటు కూడా ఫైనల్ అయ్యింది.


మొత్తం 175అసెంబ్లీ స్థానాల్లో 145 స్థానాలు టీడీపీకి, 24 స్థానాలు జనసేనకు, ఆరు స్థానాలు బీజేపీకి కేటాయించేలా నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 25లోక్‌సభ స్థానాల్లో 17స్థానాలు టీడీపీకి, జనసేనకు 2స్థానాలు, బీజేపీకి 6 స్థానాలు కేటాయించారు. అనూహ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ దఫా కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన లోక్‌సభ స్థానంతో పాటు భీమవరం, పిఠాపురం స్థానాల్లో ఏదేని ఒక స్థానంలో అసెంబ్లీకి కూడా పోటీ చేయవచ్చని తెలుస్తుంది. టీడీపీ-జనసేన-బీజేపీల పొత్తులు..సీట్ల సర్ధుబాటుపై అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది.


ఈ సీట్లలోనే బీజేపీ, జనసేన పోటీ


లోక్‌సభ స్థానాల్లో బీజేపీకి అరకు, రాజమండ్రి, విశాఖ, నర్సాపురం, రాజంపేట, హిందూపూర్ లేదా తిరుపతి లోక్‌సభ స్థానాల్లో బీజేపీ పోటీ చేయనున్నట్టు సమాచారం. జనసేన కాకినాడ, మచిలీపట్నంలలో పోటీ చేయనుంది. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల మధ్య పొత్తు ఫైనల్ కావడంతో ఇక ముగ్గురు కూటమిగా వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో వైసీపీని ఢీ కొట్టనున్నారు.


బీజేపీ నుంచి హిందుపురంలో స్వామి పరిపూర్ణానంద, రాజమండ్రి బీజేపీ స్టేట్ చీఫ్ పురంధరేశ్వరి, అరకు వంగా గీత, రాజాంపేట మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, విశాఖ నుంచి జీవిఎల్‌, నర్సాపూర్ నుంచి రఘురామకృష్ణం రాజు లేదా పొట్లూరి వరప్రసాద్‌లు పోటీ చేయనున్నారని సమాచారం. ఇక జనసేన నుంచి పవన్ కల్యాణ్ కాకినాడ నుంచి, మచిలీపట్నం నుంచి బాలశౌరీ పోటీ చేయనున్నారు.


వైసీపీ ఒకవైపు..విపక్షాల మరోవైపు


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల కురుక్షేత్రంలో సీఎం వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి సారథ్యంలోని వైసీపీ పార్టీ ఒకవైపు, మిగిలిన ప్రతిపక్షాలన్ని మరోవైపు అన్నట్లుగా మోహరించాయి. ప్రధానంగా పోటీ వైసీపీకి, టీడీపీ-జనసేన-బీజేపీకి కూటమి మధ్య సాగునున్నప్పటికి, వైఎస్ షర్మిల సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ సైతం సీపీఐ, సీపీఎంలతో కలిసి మరో కూటమిగా ఈ ఎన్నికల్లో తమ సత్తాను పరీక్షించుకుంటుంది. ఈ నేపథ్యంలో రానున్న అసెంబ్లీ ఎన్నికలలో వైనాట్ 175నినాదం ఎత్తుకున్న ఏపీ సీఎం జగన్ విపక్షాలతో ఒంటరి పోరు చేయనుండం ఆసక్తికరం.