Kejriwal Arrest | భారత్‌ నిరసన తెలిపినా.. కేజ్రీవాల్‌ అరెస్టుపై మళ్లీ స్పందించిన అమెరికా..

Kejriwal Arrest | భారత్‌ నిరసన తెలిపినా.. కేజ్రీవాల్‌ అరెస్టుపై మళ్లీ స్పందించిన అమెరికా..

Kejriwal Arrest | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టుపై అమెరికా మరోసారి స్పందించింది. ఈ విషయంలో అమెరికా చేసిన వ్యాఖ్యలపై భారత్‌ నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయినా, అమెరికా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టుతో పాటు కాంగ్రెస్‌ ఖాతాల స్తంభనకు సంబంధించిన కేసులను నిశితంగా పరిశీలిస్తున్నామని విదేశాంగ ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ నిష్పాక్షిక, పారదర్శక, చట్టపరమైన ప్రక్రియను తాము ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. దీనిపై ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు ఉండకూడదని భావిస్తున్నామన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసింది. ప్రస్తుతం కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉన్నారు. కేజ్రీవాల్ అరెస్టుపై అమెరికా విదేశాంగ శాఖ రెండురోజుల కిందట స్పందించగా.. బుధవారం ఢిల్లీలోని యూఎస్‌ మిషన్‌ తాత్కాలిక డిప్యూటీ చీఫ్‌ గ్లోరియా బర్బెనాను కేంద్రం పిలిపించింది. తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ.. వ్యాఖ్యలను భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యంగా పరిగణిస్తున్నామని పేర్కొంది.

వాషింగ్టన్‌లో స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ సందర్భంగా ఢిల్లీలోని అమెరికా మిషన్ తాత్కాలిక డిప్యూటీ హెడ్ గ్లోరియా బార్బెనాను పిలిపించడం, కాంగ్రెస్ పార్టీ బ్యాంక్‌ ఖాతాల స్తంభనపై ప్రశ్నలు లేవనెత్తారు. ఇన్‌కం ట్యాక్స్‌ అధికారులు తమ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారని.. రాబోయే ఎన్నికల్లో సమర్థవంతంగా ప్రచారం చేయడం సవాల్‌గా మారిందని కాంగ్రెస్‌ పార్టీ చేసిన ఆరోపణలు కూడా తమకు తెలుసునని మిల్లర్‌ పేర్కొన్నారు. ప్రతి సందర్భంలో నిష్పాక్షికమైన, పారదర్శకమైన, చట్టపరమైన ప్రక్రియను తాము ప్రోత్సహిస్తామన్నారు. ఇంతకు ముందు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వేరే దేశాలు ఇతర దేశాల సార్వభౌమాధికారం, అంతర్గత వ్యవహారాలను గౌరవించాలని భావిస్తున్నట్లుగా విదేశాంగ మంత్రిత్వశాఖ పేర్కొంది. ఇలాంటి విషయాల్లో అమెరికా లాంటి ప్రజాస్వామ్య దేశానికి బాధ్యత మరింత ఎక్కువ ఉంటుందని.. లేకుంటే అది అనారోగ్యకరమైన ఉదాహరణగా అవకాశం ఉంటుందని తెలిపింది. భారతదేశం న్యాయ ప్రక్రియ, స్వతంత్ర న్యాయవ్యవస్థపై ఆధారపడి ఉందని, సమయానుకూల ఫలితాలకు కట్టుబడి ఉందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. దానిపై ప్రశ్నలు లేవనెత్తడం అన్యాయమని పేర్కొంది.