Kerala | సమ్మర్‌లో టూర్‌కి ప్లాన్‌ చేస్తున్నారా..? దేవభూమి కేరళ అందాలను చూసిరండి..!

Kerala | సమ్మర్‌లో టూర్‌కి ప్లాన్‌ చేస్తున్నారా..? దేవభూమి కేరళ అందాలను చూసిరండి..!

Kerala | ఎండాకాలం వచ్చేసింది. సూళ్లు, కాలేజీలకు సెలవులు రానున్నాయి. సమ్మర్‌లో కొద్దిరోజులు సేదతీరేందుకు పలువురు వివిధ పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు ప్లాన్‌ చేస్తుంటారు. దేశంలో ఎన్నో పర్యాటక ప్రాంతాలున్నాయి. ఇవి పర్యాటకులకు ఆహ్వానం పలుకుతున్నాయి. వేసవిలో పర్యటించేందుకు కేరళ అనువైన ప్రాంతం. గాడ్స్‌ ఓన్‌ కంట్రీగా పేరొదిన కేరళ ప్రకృతి అందాలకు కేరాఫ్‌ అండ్రస్‌గా నిలుస్తున్నది. అందమైన సముద్ర తీరం, పచ్చికబయళ్లతో నిండిన పర్వతాలు, కనుల విందు చేసే సరస్సులు, కాలువలు, జలపాతాలు ప్రకృతి ప్రేమికుల మనసును దోచేస్తాయి. మరి ముఖ్యంగా బ్యాక్‌వాటర్‌లో పడవలపై ప్రయాణం మరిచిపోలేని అనుభూతిని అందిస్తుంది. పశ్చిమ తీరంలో విస్తరించిన కేరళ తీరాన్ని ‘మల్‌బార్‌’గా పిలుస్తుంటారు. ప్రపంచంలో జీవవైవిధ్యం కలిగిన 25 ప్రాంతాల్లో కేరళ ఒకటి.. నేషనల్‌ జియోగ్రాఫిక్‌ ట్రావెలర్‌ సర్వే ప్రకారం.. ప్రపంచంలో చూడదగిన మొదటి 50కిపైగా ప్రదేశాల్లో కేరళకు స్థానం దక్కింది.

వెన్నీస్‌ ఆఫ్‌ ఈస్ట్‌..

కేరళలో మూడు నౌకాశ్రయాలుంటాయి. ఇందులో ఒకటి అలప్పుర నౌకాశ్రయానికి వెన్నీస్ ఆఫ్ ఈస్ట్‌గా పిలుస్తుంటారు. ఇక్కడి బ్యాక్ వాటర్స్ పర్యాటకులను ఆకర్షిస్తాయి. విజయ పార్క్‌లోని పురాతన లైట్‌హౌస్ చూపరులను కట్టిపడేస్తుంది. తిరువనంతపురం సమీపంలోని శంఖుముఖం బీచ్‌‌తో పాటు కోజీకోడ్, కుళుపిలీ, ఎర్నాకులం, మీన్‌కున్ను, పాపనాశం, పూవార్, కోవలం, మీనకున్న, ‌వర్కాల, బీకల్, చైరాయి, చవ్వకడ్, కణ్వతీర్థ, కప్పిల్, చౌరా, కప్పాడ్, కిహున్నా, కొల్లం, పెరారు, పయ్యంబాలం బీచ్‌లు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. ఇక కేరళ సముద్ర తీరం నుంచి సూర్యాస్తమయం మరిచిపోలేని అనుభూతినిస్తుంది.

హిల్‌స్టేషన్స్‌..

కేరళ రాజధాని తిరువనంతపురానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొన్ముడి హిల్‌ రిసార్ట్‌, ఆగస్త్య కూడమ్‌ ప్రాంతాలు ప్రకృతి ప్రేమికులకు సరికొత్త లోకంలోకి తీసుకెళతాయి. ఆస్త్యకుడమ్‌ పర్వత ప్రాంతం అరుదైన వనమూలికలు, ఔషధ మొక్కలు నిలయం. అలాగే ఇక్కడ వివిధ రకాల పక్షులను చూడొచ్చు. ఈ పర్వత శిఖరం మీదకు మహిళలకు మాత్రం అనుమతి ఉండదు. మున్నార్‌లోని దేవికుళం పర్వతాలు, ఎకో పాయింట్, కుండాల, నీలకురింజి పూల పర్వతం చూడాల్సిందే. అమృతమేడు, వాయనాడ్‌లోని చెంబారా పర్వతం, చార్నకున్ను, ఎడుక్కల్ గుహలు, గవి, ఇలవీంజపూనించర, జటాయుపరా (చడయ మంగళం), కోజీకోడ్‌లోని ఇరింగల్, గ్రంపి, నెల్లియంపథి (పాలక్కాడ్), ఇడుక్కిలోని పట్టుమాల, పిరుమేడు, పోతమేడు, రామకాలమేడు, రాణిపురం (ఇడుక్కి), రాణిపురం, రాజమాల (కాసర్‌గోడ్), వయనాడ్ వైతిరి హిల్‌స్టేషన్, కొట్టాయం పర్వత ప్రాంతాలు చూపరులను కట్టిపడేస్తాయి.

అనంత పద్మనాభుడి ఆలయం..

కేరళ రాజధాని తిరువనంతపురం. దీన్నే త్రివేండ్రంగా పిలుస్తారు. ఇది బీచ్‌లకు ప్రసిద్ధి చెందింది. ఇక ప్రపంచంలోని అత్యంత ధనిక దేవాలయాల్లో ఒకటైన అనంత పద్మనాభ స్వామి ఆలయం ఇక్కడే ఉన్నది. కేరళ పర్యటనకు వెళ్లిన వారు తప్పకుండా అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని దర్శించుకోవాల్సిందే. కేరళలోని త్రిసూర్ నగరం బంగారు వజ్రాభరణాలకు ప్రసిద్ధి చెందింది. కేరళలో ఉపయోగించే దాదాపు 70శాతం ఆభరణాలు ఇక్కడే తయారవుతాయి. అత్యంత పరిశుభ్రమైన బీచ్‌లలో చావక్కాడ్ బీచ్, నాటికా బీచ్, వడనపల్లి బీచ్, స్నేహతీరం బీచ్, పెరియంబలం బీచ్ ఉన్నాయి. కేరళలోని కీలకమైన పర్యాటక ప్రదేశాల్లో వయనాడ్ ఒకటి. కాలుష్య రహిత వాయనాడ్ పర్యాటకులకు ఆకర్షణీయమైన ప్రదేశం. మడ అడవులు, పచ్చని వరి పొలాలు, కొబ్బరి తోటలతో నిండి ఉన్న కుమరకోమ్ అద్భుతంగా ఉంటుంది. బ్యాక్ వాటర్‌ అందాలు, పక్షుల కిలకిలరావాలు, జలపాతాల సవ్వడి మదిలో చెరగని ముద్రవేస్తాయి. కుమరకోమ్‌లో హౌస్‌బోట్ రైడ్ ప్రధాన పర్యాటక ఆకర్షణగా నిలుస్తోంది.


కొత్త జంటలకు మున్నార్‌..

కేరళలో చూడదగ్గ ప్రదేశాల్లో మున్నార్‌ ఒకటి. ఇక్కడ ఎత్తయిన పచ్చిక బయళ్లతో నిండిన పర్వతాలు, హత్తుకునేలా ఉండే మేఘాలు పర్యాటకుల్ని మంత్రముగ్ధులను చేస్తాయి. మున్నార్ టీ ఉత్పత్తికి కూడా ప్రసిద్ధి చెందింది. తేయాకు తోటల సువాసన, ప్రకృతి అందాలను చూసేందుకు ఏటా ఎంతో మంది పర్యాటకులు తరలివస్తారు. కొత్తగా పెళ్లయిన జంటలకు ఇది ఎంతో ఆకర్షణీయమైన ప్రదేశం. కేరళలోని పూవార్ ద్వీపం చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ బస చేసేందుకు ఫ్లోటింగ్ కాటేజీలు ఉటాయి. మోటే హార్బర్‌లో పడవ ప్రయాణాన్ని ఆస్వాదించొచ్చు. వివిధ రకాల క్రూయిజ్‌లు సైతం అందుబాటులో ఉన్నాయి. కేరళలోని తిరువనంతపురం నుండి కేవలం 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోవలం కూడా అందమైన బీచ్‌లకు ప్రసిద్ధి చెందింది. కోవలం భారీ కొబ్బరి చెట్లు, ఆసక్తికరమైన బీచ్‌లతో ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. కోవలంను దక్షిణ భారత స్వర్గంగా పిలుస్తుంటారు.


ఆకర్షించే జలపాతాలు..

అందమైన పర్వతాలు లేకుండా కేరళలోని జలపాతాలు సైతం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. మలప్పురంలోని అడన్ పారా జలపాతం, కోజీకోడ్‌లోని అరిప్పర, కొట్టాయంలోని అరువిక్కుళు, మున్నార్‌లోని ఆట్టుకాడ్, వయనాడ్‌లోని చేతాలయం, త్రిసూర్‌లోని అత్తిరాపల్లి, వలచాల్, ఇడుక్కిలోని చెయ్యప్పర, మాడమాక్కుళం, కీళరుత్, వలరా, వయనాడ్‌లోని కంతానపుర, తిరువనంతపురంలోని కలక్కయం, మనక్కయం, కాల్‌పెటాలోని మీన్‌ముట్టీ, కొల్లంలోని పాలురువి, పాలక్కాడ్‌లోని మీనవల్లం, కోజీకోడ్‌లోని తుషారగిరి, వెల్లరిమల, వయనాడ్‌లోని సెంటినెల్ రాక్ జలపాతాలు ఆకర్షిస్తాయి.

బ్యాక్‌ వాటర్‌లో విహారం..

వెన్నిస్‌ ఆఫ్‌ ఈస్ట్‌ పేరుగాంచిన అలప్పుర బ్యాక్‌వాటర్ విహారం ఎన్నటికీ మరిచిపోలేరు. హౌస్‌బోట్‌లో ప్రయాణం కొత్త అనుభూతి ఇస్తుంది. పర్యాటకులకు అన్ని రకాల సదుపాయాలు ఉంటాయి. హోటల్స్‌ తరహాలోనే ఫర్నిష్డ్‌ బెడ్‌రూంలు, మోడ్రన్‌ టాయిలెట్లు, లివింగ్‌ రూమ్‌లు, కిచెన్‌, బాల్కనీలు కూడా ఉంటాయి. కేరళ టూరీజంలో ఈ హౌస్‌బోట్లకు ప్రత్యేక స్థానం ఉంది. అలప్పురతో పాటు కొచ్చిన్, కొల్లం, అష్టముడి, చంద్రగిరి కడంబ్రాయార్, చిత్తారి, కుమర్‌కమ్, మున్రో తదితర ప్రాంతాల్లో కూడా బ్యాక్‌వాటర్‌లో విహరించొచ్చు. ఎవరైనా కేరళకు వెళ్లాలనుకుంటే ఈ ప్రాంతాలను చూసిరావడం అస్సలు మిస్సవ్వొద్దు.