ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఇళ‌య‌రాజా కుమార్తె క‌న్నుమూత‌.. కార‌ణాలు ఏంటంటే..!

ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఇళ‌య‌రాజా కుమార్తె క‌న్నుమూత‌.. కార‌ణాలు ఏంటంటే..!

మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా గురించి సంగీత ప్రియుల‌కి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఇప్పుడు ఆయ‌న కూతురు భ‌వ‌తారిణి 47 ఏళ్ల వ‌య‌స్సులో క‌న్నుమూసారు. భవతారిణి.. ఇళయరాజా కుమార్తెగానే కాకుండా, పలు సినిమాల్లో పాటలు పాడటం ద్వారా ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఆమెకి జాతీయ అవార్డ్ కూడా ద‌క్కింది. అయితే కొంతకాలంగా ఆమె క్యాన్సర్‌తో బాధపడుతుండ‌గా, ఇటీవ‌ల ఆమె పరిస్థితి విషమించడంతో శ్రీలంకలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. అయితే గురువారం (జనవరి 25) రాత్రి ఆమె ఆరోగ్యం విష‌మించ‌డంతో కన్నుమూశారు. ఇంత చిన్న వ‌య‌స్సులో భవతారిణి మరణవార్త తెలిసి, సినీ రంగ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.

భ‌వ‌తారిణి దాదాపు 30కి పైగా చిత్రాల్లో ఎన్నో పాటలు పాడి అల‌రించింది. ఇళయరాజా సంగీతం అందించిన రాసయ్య చిత్రంతో ఆమె గాయనిగా అరంగేట్రం చేశారు. ఇళయరాజా తనయులైన యువన్ శంకర్ రాజా, కార్తీక్ రాజాలకు సోదరి అయిన భ‌వ‌త‌ర‌ణి తన తండ్రి, సోదరులు కంపోజ్ చేసిన సినిమాల్లోనే ఎక్కువగా పాటలు పాడింది. ఇళయరాజా కంపోజ్ చేసిన భారతి మూవీలోని మైల్పోలా పొన్ను ఒన్ను పాటకుగాను బెస్ట్ ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్ గా నేషనల్ అవార్డు కూడా అందుకుంది. తెలుగులో కూడా ఆమె పలు పాటలు పాడింది. 2003లో వచ్చిన అవునా సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేసింది. ఇక 2012లో వచ్చిన గుండెల్లో గోదారి మూవీలో పాట పాడింది. రేవతి డైరెక్షన్ లోనే వచ్చిన హిందీ మూవీ ఫిర్ మిలేంగేకు కూడా భవతరణి మ్యూజిక్ అందించింది.

శబరిరాజ్ అనే ఓ అడ్వర్టైజ్ ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్ ను భవతరణి పెళ్లి చేసుకుంది. ఆమె సంగీత దర్శకత్వం వహించిన చివరి చిత్రం ‘మయానధి’ (2019). గ‌త కొద్ది రోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె.. శ్రీలంకలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే ఆరోగ్యం పూర్తిగా విష‌మించ‌డంతో భ‌వ‌త‌ర‌ణి చిన్న వ‌య‌స్సులోనే క‌న్నుమూసారు. ఆమె ఆత్మ‌కి శాంతి చేకూరాల‌ని ప్ర‌తి ఒక్క‌రు ప్రార్ధిస్తున్నారు. . కాగా, ఇళయరాజా కూడా శ్రీలంకలోనే ఉన్నారు. శనివారం శ్రీలంకలో ఇళయరాజా మ్యూజిక్‌ ఫెస్ట్‌ కార్యక్రమం జరగాల్సి ఉండగా, ఇందుకోసం ఆయన అక్కడకు వెళ్ళారు. ఇదే స‌మ‌యంలో అక్క‌డే త‌న కూతురు మ‌ర‌ణించ‌డంతో శోక‌సంద్రంలో మునిగారు.