బ్రేకింగ్: ఢిల్లీ లిక్కర్ కేసులో CM కేజ్రీవాల్, కవిత పేర్లు
428 పేజీలతో ఈడీ రెండో చార్జిషీటు Arvind Kejriwal; Sameer Mahendru; Kavitha Kalvakuntla విధాత: విధాత: దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నది. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన రెండో చార్జి షీటులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీఆర్‌ఎస్ MLC కల్వకుంట్ల కవిత పేర్లను పేర్కొన్నారు. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పేరు సైతం చోటు చేసుకున్నది. మొత్తం 17 మంది […]

428 పేజీలతో ఈడీ రెండో చార్జిషీటు
Arvind Kejriwal; Sameer Mahendru; Kavitha Kalvakuntla
విధాత: విధాత: దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నది. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన రెండో చార్జి షీటులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీఆర్‌ఎస్ MLC కల్వకుంట్ల కవిత పేర్లను పేర్కొన్నారు. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పేరు సైతం చోటు చేసుకున్నది. మొత్తం 17 మంది నిందితులపై రెండో చార్జిషీటులో అభియోగాలు మోపారు.
విజయ్ నా మనిషే: కేజ్రీవాల్
ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీని రూపొందించడానికి ముందు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, వ్యాపార వేత్త స్పిరిట్స్ ఎండీ సమీర్ మహేంద్రు ఫేస్‌టైమ్‌లో సంభాషించుకున్నారని, ఈ సంభాషణను లిక్కర్ కేసులో ఉన్న ఒక నిందితుడు ఏర్పాటు చేశారని ఈడీ పేర్కొన్నది. ‘విజయ్ నా మనిషి. మీరు ఆయన్ను పూర్తిగా నమ్మొచ్చు’ అని సమీర్ మహేంద్రుతో జరిగిన వీడియోకాల్‌లో కేజ్రీవాల్ చెప్పారని తెలిపింది.
దాదాపు 428 పేజీలతో సప్లిమెంటరీ చార్జిషీటును ఈడీ అధికారులు ఢిల్లీ రౌజ్ ఎవెన్యూ కోర్టుకు సమర్పించారు. ఈ వ్యవహారం మొత్తం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కనుసన్నల్లోనే సాగిందని చార్జిషీటులో ఈడీ పేర్కొన్నది. ఆప్ నేతల తరఫున ‘సౌత్ గ్రూప్’ నుంచి విజయ్‌నాయర్ రూ.100 కోట్లను లైసెన్స్‌లకు అడ్వాన్స్‌గా అందుకున్నారని ఆరోపించారు.
లిక్కర్ కుంభకోణం సొమ్మును గోవా ఎన్నికల ప్రచారానికి ఆప్ వినియోగించిందని ఈడీ తన చార్జిషీటులో ఆరోపించింది. 2022లో జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ రెండు స్థానాలు గెలుపొందింది. ఆప్ సర్వే బృందాల్లోని వాలంటీర్లకు దాదాపు 70 లక్షల రూపాయల మేర క్యాష్ పేమెంట్స్ జరిగాయని ఈడీ పేర్కొన్నది. నగదు రూపంలో డబ్బు అందుతుందని ఆప్ ప్రచారంలో ఉన్న కొందరు వ్యక్తులకు ఆప్ కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జి విజయ్ నాయర్ చెప్పారని ఈడీ తెలిపింది.
వీరే ఆ సౌత్ గ్రూప్
ఆప్ తరఫున విజయ్ నాయర్‌కు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, బీఆర్‌ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత, మాగుంట తనయుడు రాఘవ్, అరబిందో ఫార్మా డైరెక్టర్ పీ శరత్‌చంద్రారెడ్డిల నుంచి దాదాపు 100 కోట్ల రూపాయల కిక్ బ్యాక్స్ అందాయని ఈడీ ఆరోపించింది.
సదరు సొమ్మును హైదరాబాద్‌కు చెందిన వ్యాపార వేత్త అభిషేక్ బోయినపల్లి.. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అనుచరుడు దినేష్ అరోరా ద్వారా చేరవేసినట్టు ఈడీ ఆరోపించింది. చార్జిషీటును పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. నిందితులకు నోటీసులు జారీ చేసింది. విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసింది.
అంతా అభూత కల్పన: కేజ్రీవాల్
ఈడీ తాజా చార్జి షీటు అంతా అభూత కల్పన అంటూ కేజ్రీవాల్ కొట్టిపారేశారు. ఈడీ ఇప్పటి వరకూ 5వేల కేసులు పెట్టిందని, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న చోట ప్రభుత్వాలను కూల్చడమే ఈడీ పనిగా పెట్టుకున్నదని ఆయన విమర్శించారు. ఈ చార్జి షీటు మొత్తం పూర్తి అభూత కల్పన అని వర్ణించారు.
ఏమిటీ ఢిల్లీ లిక్కర్ స్కాం?
ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం 2021-22 సంవత్సరానికి గాను కొత్త ఎక్సయిజ్ పాలసీని రూపొందించింది. దీనిని అమలు చేసే క్రమంలో వచ్చిన ఆరోపణలపై సీబీఐ విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ సక్సేనా సిఫార్సు చేయడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నగదు చేతులు మారిన అంశంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తున్నది.
ఢిల్లీ లిక్కర్ పాలసీని మార్చే క్రమంలో మద్యం లాబీల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారాయని ఈడీ, సీబీఐ పేర్కొంటున్నాయి. లైసెన్స్ ఫీజును మాఫీ చేయడం లేదా తగ్గించడంతోపాటు వారికి వివిధ మార్గాల్లో లబ్ధి కలిగించేందుకు హామీలు ఇచ్చారని దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి.
ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను ఈడీ ప్రశ్నించింది. ఆమ్ ఆద్మీ పార్టీని వదిలిపెట్టాలని ఈడీ అధికారులను తనను అడిగారని విచారణ అనంతరం మనీశ్ సిసోడియా మీడియాకు చెప్పారు.