లోక్‌స‌భ స‌మరానికి కాంగ్రెస్ సై

లోక్‌సభ సమరానికి కాంగ్రెస్‌ సిద్ధమవుతున్నది.

లోక్‌స‌భ స‌మరానికి కాంగ్రెస్ సై
  • 25 నుంచి రాష్ట్ర‌స్థాయి స‌మావేశాలు
  • ఎన్నిక‌ల‌కు శ్రేణుల స‌మాయ‌త్తం
  • గురువారం తెలంగాణ‌లో రాష్ట్ర స్థాయి
  • మొదటి కార్యకర్తల మహాసభ ప్రారంభం
  • త‌ర్వాత వ‌రుస‌గా రాష్ట్రాల‌వారీగా నిర్వ‌హ‌ణ‌
  • పార్టీ చీఫ్ ఖ‌ర్గే అధ్య‌క్ష‌త‌న స‌మావేశాలు

విధాత‌: 2024 లోక్‌స‌భ ఎన్నికల సమరానికి కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతున్న‌ది. పార్టీ శ్రేణుల‌ను సిద్ధంచేసే ప‌నిలో ప‌డింది. గురువారం నుంచి రాష్ట్ర స్థాయి కార్యకర్తల సమావేశాలను ప్రారంభించనున్న‌ది. సంస్థాగత కార్యకర్తలను ఉత్తేజపరిచేందుకు పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆఫీస్ బేరర్ల సమావేశాలకు అధ్యక్షత వహించనున్నారు. బీఆర్ఎస్ చెందిన కే చంద్రశేఖర్ రావు ప్రభుత్వాన్ని గద్దె దించి ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన తెలంగాణలోనే రాష్ట్ర స్థాయి కార్యకర్తల మొదటి మహాసభలు ప్రారంభం కానున్నాయి.

ఆ తర్వాత జనవరి 28న ఉత్తరాఖండ్‌లో, 29న ఒడిశాలో, ఫిబ్రవరి 3న ఢిల్లీలో, ఫిబ్రవరి 4న కేరళలో, 10న హిమాచల్ ప్రదేశ్‌లో, 11న పంజాబ్‌లో పార్టీ రాష్ట్రస్థాయి కార్యకర్తల సదస్సును కాంగ్రెస్ పార్టీ నిర్వ‌హించ‌నున్న‌ది. తమిళనాడులో ఫిబ్రవరి 13న, జార్ఖండ్‌లో 15న మ‌హాస‌భ‌లు జరగనున్నట్టు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మంగ‌ళ‌వారం వెల్ల‌డించారు.

బూత్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఆఫీస్ బేరర్ల సమావేశాలకు పార్టీ చీఫ్ ఖర్గే అధ్యక్షత వ‌హిస్తార‌ని తెలిపారు. త‌మ పార్టీ క్యాడ‌ర్‌ను మ‌రింత బ‌లోపేతం చేస్తామ‌ని పేర్కొన్నారు. రాష్ట్ర‌స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు కాంగ్రెస్ మెరుపు ప్రచారానికి సిద్ధంగా ఉన్న‌ట్టు వెల్ల‌డించారు. సార్వత్రిక ఎన్నికలకు ఏకకాలంలో సన్నాహాలు చేస్తూ రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ భారత్ జోడో న్యాయ్ యాత్ర కూడా కొనసాగుతున్న‌ద‌ని తెలిపారు.

ఈ నెల ప్రారంభంలో జరిగిన పార్టీ కీలక సమావేశంలో ఖర్గే మాట్లాడుతూ.. రాత్రింబవళ్లు కష్టపడి 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత దేశ‌ ప్రజలకు ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని అందించగలుగుతామని ధీమా వ్య‌క్తం చేశారు. విభేదాలను పక్కనపెట్టాల‌ని, చిచ్చు పెట్టవద్దని, మీడియాలో అంతర్గత సమస్యలను లేవనెత్తవద్దని, కాంగ్రెస్‌ గెలుపు కోసం స‌మిష్టిగా పని చేయాలని ఆయన పార్టీ శ్రేణుల‌కు పిలుపునిచ్చారు. జనవరి 4న దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఢిల్లీలో స‌మావేశ‌మ‌య్యారు. వ‌చ్చే లోక్‌సభ ఎన్నికల కోసం పార్టీ అనుస‌రించాల్సిన వ్యూహం, భారత్ న్యాయ్ యాత్రకు సన్నాహాలతోపాటు ఇతర పార్టీలతో సీట్ల పంపకాలపై చర్చించిన సంగ‌తి తెలిసిందే.

సమీక్షించిన సీఎం రేవంత్‌

ఈ నెల 25వ తేదీన ఎల్బీ స్టేడియంలో జరిగే కాంగ్రెస్ ఏజెంట్స్ సమావేశానికి బూత్ లెవెల్ ఏజెంట్స్ పెద్ద ఎత్తున తరలి రావాలని పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరుకానున్న నేపథ్యంలో కార్యక్రమ ఏర్పాట్లు, ఇతర వివరాలపై జూబ్లీహిల్స్ నివాసంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్‌తో సీఎం సమీక్షించారు. కార్యక్రమానికి సంబంధించి రేవంత్ పలు సూచనలు చేశారు. 25న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ స‌మావేశం జ‌రుగ‌నున్న‌ది. అసెంబ్లీ ఎన్నికల్లో బూత్ లెవెల్ ఏజెంట్స్ క్రియాశీలకంగా పనిచేశారని, రాష్ట్రంలో పార్టీని గెలిపించడంలో కీలక భూమిక పోషించారని రేవంత్ అన్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికలకు అనుసరించాల్సిన విధానాలపై సమావేశంలో ఖర్గే దిశానిర్దేశం చేయనున్నట్లు సీఎం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ హామీలు, ప్రభుత్వ పథకాల అమలు తీరును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సంబంధించి ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే శ్రేణులకు పలు సూచనలు చేయనున్నార‌న్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేసి పార్టీ గెలుపుకు కృషి చేసిన బూత్ లెవెల్ ఎజెంట్స్ అందరూ సమావేశానికి హాజరు కావాలని పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.