మరణశిక్ష విధించారని తెలియగానే ఖూనీకోరు రేపిస్ట్ స్పందన ఇదీ..
తనకు మరణ శిక్ష విధించారని తెలియగానే.. దోషి భోరున విలపించిన ఘటన కేరళలోని కోచి కోర్టులో చోటు చేసుకున్నది.

కోచి: ఎంతటి కిరాతకులకైనా మరణం అంటే భయమే. ఒక చిన్నారిపై అత్యంత దారుణంగా లైంగిక దాడి చేయడమే కాకుండా.. పాపను కిరాతకంగా హత్య చేసిన కేసులో నేరం రుజువైన దోషి.. తీర్పు వెలువడేంత వరకూ వణికిపోతూనే ఉన్నాడు. తనకు మరణ శిక్ష విధించారని తెలియగానే ఒక్కసారిగా కోర్టు హాలులో భోరున విలపించాడు. అష్ఫాక్ ఆలం అనే వ్యక్తికి కోర్టు మరణ దండన విధించింది. ఆ తీర్పు కాపీ ఇంగ్లిష్లో ఉన్నది. అందులోని వివరాలను బిని ఎలిజబెత్ అనే సహాయకురాలు అతనికి హిందీలో వినిపించారు.
ఖైదు, జీవిత ఖైదు పదాలను చెప్పినప్పుడు బాగానే ఉన్నాడని, కానీ.. మరణదండన అనే పదం వినగానే ఒక్కసారిగా భోరున విలపించాడని ఎలిజబెత్ తెలిపారు. గత పదిహేను రోజులుగా ఆలంకు ఎలిజబెత్ అనువాదంలో సహాయకురాలిగా ఉంటున్నారు. ఈ తీర్పు సరైందేనని తాను భావిస్తున్నానని, ఓ అమాయక చిన్నారిని చిదిమేశాడని ఎలిజబెత్ అన్నారు. ఆ పాప అతడిని కుటుంబ సభ్యుడిగా భావించి నమ్మిందని, ఆమె నమ్మకాన్ని ఆలం వమ్ము చేశాడని పేర్కొన్నారు. కోర్టులో పెద్దగా స్పందించలేదని, మొదట్లో తనను క్షమించాలని మాత్రం వేడుకున్నాడని తెలిపారు. తీర్పు అనంతరం ఆలంను వియ్యూర్ కేంద్ర కారాగారానికి తరలించారు. ఆ సమయంలో కోర్టు వద్ద ఉన్న ప్రజలు అతడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.