దిక్కూ దివానం లేని ధరణి పోర్టల్‌!.. దరిద్రంగా ధరణి చట్టం!

ధరణి పోర్టల్‌ నిర్వహణ సాఫ్ట్‌వేర్‌ సరిగ్గా లేదని, అందులో అనేక లోపాలు ఉన్నాయని ధరణిపై అధ్యయనానికి నియమించిన కమిటీ అభిప్రాయపడినట్టు విశ్వసనీయంగా తెలిసింది.

దిక్కూ దివానం లేని ధరణి పోర్టల్‌!.. దరిద్రంగా ధరణి చట్టం!
  • సాఫ్ట్‌వేర్ స‌క్కంగ లేదు.. ప‌నిచేసేవాడూ లేడు
  • ద‌రిద్రంగా ధ‌ర‌ణి చ‌ట్టం
  • గత ప్రభుత్వ పెద్దలు, అధికారుల అనాలోచిత నిర్ణయాల వల్లే లోపాలు
  • ఐదు జిల్లాల క‌లెక్ట‌ర్లు,
  • పోర్ట‌ల్‌ నిర్వ‌హ‌ణ సంస్థ‌ల‌తో సమావేశంలో ధరణి క‌మిటీ!

విధాత‌, హైద‌రాబాద్‌: ధరణి పోర్టల్‌ నిర్వహణకోసం రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ సరిగ్గా లేదని, అందులో అనేక లోపాలు ఉన్నాయని ధరణిపై అధ్యయనానికి ప్రభుత్వం నియమించిన కమిటీ అభిప్రాయపడినట్టు విశ్వసనీయంగా తెలిసింది. సాఫ్ట్‌వేర్‌ సమస్యలకు తోడు.. అధికారాల‌న్నీ క‌లెక్ట‌ర్ వ‌ద్ద‌నే కేంద్రీకృతం కావ‌డంతో క్షేత్రస్థాయిలో ప‌ర్య‌వేక్షించే నాథుడు లేకుండా పోయాడు. ఫ‌లితంగా ధ‌ర‌ణిలో రైతుల స‌మ‌స్య‌లు అప‌రిష్కృతంగా మిగిలిపోయాయ‌ని క‌మిటీ భావించిందని సమాచారం. నాటి ప్ర‌భుత్వ పెద్ద‌లు, కీల‌క‌ అధికారుల అనాలోచిత చ‌ర్య‌ల కార‌ణంగా ధ‌ర‌ణి చ‌ట్టం లోప‌భూయిష్టంగా ఉంద‌ని కమిటీ భావించినట్టు సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. బుధ‌వారం స‌చివాల‌యంలో ధ‌ర‌ణి క‌మిటీ స‌మావేశ‌మైంది. ఉద‌యం 10.30 గంట‌ల‌కు ప్రారంభ‌మైన క‌మిటీ స‌మావేశం రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగింది. మ‌ధ్యాహ్నం అరగ‌ంట భోజనవిరామం స‌మ‌యం తీసుకొని తిరిగి స‌మావేశాన్ని కొన‌సాగించారు. ఈ స‌మావేశంలో ధ‌ర‌ణిలోపాల‌పై విస్తృతంగా చ‌ర్చించారని తెలిసింది.


ధరణిలో మూడు కీలక లోపాలు

ధ‌ర‌ణి ప్రాజెక్ట్‌లో ప్ర‌ధానంగా మూడు లోపాలున్న‌ట్లు కమిటీ సభ్యులు కలెక్టర్లతో సమావేశం సందర్భంగా గుర్తించారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రైతులు, భూ యజ‌మానులు ఎదుర్కొంటున్న అనేక ఈ స‌మ‌స్య‌కు ఇవే ప్ర‌ధాన కార‌ణాల‌ని నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. క‌లెక్ట‌ర్లు, ఇత‌ర అధికారుల‌పై ప‌ని ఒత్తిడి, వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుపై క్షేత్ర స్థాయిలో ప‌రిశీలించ‌డానికి క్షేత్రస్థాయిలో యంత్రాంగం లేకపోవడం, సాఫ్ట్‌వేర్‌లో పొందుప‌రిచిన మాడ్యూల్స్‌లో ఇబ్బందులను ప్రధాన లోపాలుగా గుర్తించారని సమాచారం.


క్షేత్రస్థాయిలో పని ఎవరు చేయాలి?

ధ‌ర‌ణి సాఫ్ట్‌వేర్‌లో పొందుప‌రిచిన మాడ్యూల్స్‌లో రైతులు ఏ చిన్న స‌మ‌స్య కోసం మీ-సేవ‌లో ఫీజు చెల్లించి ద‌ర‌ఖాస్తు చేసినా.. నేరుగా క‌లెక్ట‌ర్ లాగిన్‌లోకే వెళుతుంది. దీనిని క్షేత్రస్థాయిలో ప‌రిశీలించి నివేదిక ఇచ్చేవాళ్లు లేరు. ఒక్కో జిల్లా క‌లెక్ట‌ర్‌కు ఒక్క రెవెన్యూనే కాకుండా జిల్లా ప‌రిపాల‌న‌కు చెందిన అనేక ప‌నులు ఉంటాయి. ఈ ప‌ని ఒత్తిడి వ‌ల్ల వీటిని అటెండ్ చేసే ప‌రిస్థితి క‌లెక్ట‌ర్ల‌కు లేదు. వ‌చ్చిన ధ‌ర‌ఖాస్తులపై క‌లెక్ట‌రే నోటీస్ జ‌న‌రేట్ చేయాలి. దీంతో ధ‌ర‌ణిలో వ‌చ్చిన ద‌ర‌ఖాస్తులు పెండింగ్‌లో ఉంటున్నాయని గుర్తించారని సమాచారం. ఆన్‌లైన్‌లో క‌లెక్ట‌ర్ లాగిన్‌కు వ‌చ్చిన ధ‌ర‌ఖాస్తుకు క‌లెక్ట‌ర్ నోటీస్ జ‌న‌రేట్ చేసిన త‌రువాత‌ ఆన్‌లైన్‌లో కాకుండా ఫిజిక‌ల్‌గానే ఫైల్ మండ‌ల కార్యాల‌యానికి పంపించి, క్షేత్రస్థాయి ప‌రిశీల‌న చేయించాలి. అయితే క్షేత్రస్థాయిలో ప‌రిశీల‌న చేయ‌డానికి గ‌తంలోలా వీఆర్వోలు, వీఆర్ఏలు లేరు. ఒక్క రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌మీదనే ఆధార ప‌డాలి. సదరు ఆర్‌ఐ.. ఆ మండ‌లంలో వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల‌న్నింటికీ నోటీస్‌లు ఇచ్చి, ఒక్కొక్క‌రికి తేదీ కేటాయించి, విచారించాలి. అయితే త‌గిన సిబ్బంది లేక రిపోర్ట్ ఇచ్చేవాడే లేని ప‌రిస్థితి. దీంతో క‌లెక్ట‌ర్లు, మండ‌ల అధికారుల‌పై ప‌ని ఒత్తిడి విప‌రీతంగా పెరిగింది.


పెండింగ్‌లో ఉంటే లావాదేవీలకు అవకాశం లేదు

ధ‌ర‌ణిలో చిన్న చిన్న స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ద‌ర‌ఖాస్తు చేసినా ఆ ద‌ర‌ఖాస్తు పెండింగ్‌లో చూపించిన‌న్ని రోజులూ లావాదేవీలు జ‌ర‌గ‌డానికి సాఫ్ట్‌వేర్‌లో అవకాశం లేద‌ని క‌మిటీ ప‌రిశీల‌న‌లో తేలింది. ధ‌ర‌ణి చ‌ట్టంతోపాటు వీఆర్వో వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేస్తూ గత ప్ర‌భుత్వం చ‌ట్టం తీసుకొచ్చింది. దీంతో క్షేత్రస్థాయిలో ప‌రిశీల‌న చేసి నివేదిక ఇచ్చే గ్రామ స్థాయి అధికారి లేడు. పైగా విచారించిన నిర్ణ‌యం తీసుకునే తాసీల్దార్ల‌కు, ఆర్డీఓల‌కు ఎలాంటి అధికారం లేకపోవ‌డంతో రెవెన్యూ వ్య‌వ‌స్థ నిర్వీర్య‌మై రైతుల స‌మ‌స్య‌ల‌న్నీ పెండింగ్‌లో ఉండ‌టానికి కార‌ణ‌మైంద‌ని క‌మిటీ గుర్తించిన‌ట్లు తెలిసింది.


టెక్నికల్‌ అంశంగా ధరణిని మార్చేశారు!

చ‌ట్టం పొందుప‌ర‌చ‌డంలోనే ఏ ఒక్క అధికారికీ అధికారం లేకుండా పూర్తిగా టెక్నిక‌ల్ అంశంగా రెవెన్యూ వ్య‌వ‌స్థ‌ను మార్చే ప్ర‌య‌త్నంలో జ‌రిగిన త‌ప్పిదాలే ప్ర‌ధాన కార‌ణంగా గుర్తించార‌ని స‌మాచారం. దీంతో అనేక ప్రైవేట్ భూములు అసైన్డ్‌, ప్ర‌భుత్వ భూములుగా రికార్డుల్లో ద‌ర్శ‌నం ఇచ్చాయ‌ని, స‌ర్వే నంబ‌ర్లు మిస్ మ్యాచ్ అయ్యాయ‌ని, ఏదైన ఒక భూమిలో కొంత భాగాన్ని ప్ర‌జా అవ‌స‌రాల కోసం ప్ర‌భుత్వం సేక‌రిస్తే.. మొత్తం ఆ స‌ర్వే నంబ‌ర్‌ను నిషేధిత జాబితాలో చేర్చిన అంశాలు, కొన్ని స‌మ‌స్య‌ల పరిష్కారానికి ధ‌ర‌ణిలో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి మాడ్యూల్ లేక పోవ‌డాన్ని కూడా ఈ క‌మిటీ గుర్తించిందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఈ సమస్యలన్నింటికీ ధరణి కోసం రికార్డ్‌ ఆఫ్‌ రైట్‌ చట్టానికి సవరణ చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడమే కారణమని కమిటీ తేల్చిందని సమాచారం.


భూమితో సంబంధమున్న శాఖలతోనూ భేటీలు!

భూమితో ప్ర‌త్య‌క్ష‌, ప‌రోక్ష సంబంధాలున్న వివిధ శాఖ‌ల‌తోనూ స‌మావేశం కావాలని కమిటీ నిర్ణయించిందని సమాచారం. ఈ మేర‌కు శ‌నివారం అట‌వీ, గిరిజ‌న‌, వ్య‌వ‌సాయ శాఖ‌ల‌తో స‌మావేశం కానున్నారు. మ‌రో రోజు స‌ర్వే సెటిల్‌మెంట్‌, రిజిస్ట్రేష‌న్‌, వ‌క్ఫ్‌, దేవాదాయ శాఖ‌ల‌తో స‌మావేశం నిర్వహిస్తారని తెలిసింది. తదుపరి ఎంపిక చేసిన గ్రామాల‌లో ప‌ర్య‌టించి నివేదిక ఇవ్వాల‌న్న నిర్ణ‌యానికి క‌లెక్ట‌ర్ల స‌మావేశం వ‌చ్చిందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఈ స‌మావేశానికి క‌మిటీ స‌భ్యులు మాజీ ఎమ్మెల్యే కోదండ‌రెడ్డి, మాజీ సీసీఎల్ఏ రేమండ్ పీట‌ర్‌, ప్ర‌ముఖ న్యాయ‌వాది భూమి సునీల్‌, రిటైర్డ్ డిప్యూటీ క‌లెక్ట‌ర్ మ‌ధుసూదన్‌, మెంబ‌ర్ సెక్ర‌ట‌రీ సీసీఎల్ఏ న‌వీన్ మిట్ట‌ల్‌, సీఎం ఆర్వో ప్రాజెక్ట్ డైరెక్ట‌ర్ వీ. లచ్చిరెడ్డిల‌తో పాటు సిద్దిపేట‌, రంగారెడ్డి, వ‌రంగ‌ల్‌, నిజామాబాద్‌, ఖ‌మ్మం జిల్లాల క‌లెక్ట‌ర్లు, ధ‌ర‌ణి సాఫ్ట్‌వేర్ నిర్వ‌హ‌ణ సంస్థ‌ల ప్రతినిధులు హాజ‌ర‌య్యారు.