TSPSC | గ్రూప్-4 ఫ‌లితాల‌పై కీల‌క అప్‌డేట్‌.. ద‌స‌రా త‌ర్వాత మెరిట్ జాబితా విడుద‌ల‌

TSPSC | గ్రూప్-4 ఫ‌లితాల‌పై కీల‌క అప్‌డేట్‌.. ద‌స‌రా త‌ర్వాత మెరిట్ జాబితా విడుద‌ల‌

TSPSC | గ్రూప్-4 ఫ‌లితాల‌పై టీఎస్‌పీఎస్సీ కీల‌క స‌మాచారం అందించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్-4 ఫ‌లితాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. 8,180 పోస్టుల‌కు సంబంధించిన జ‌న‌ర‌ల్ ర్యాంక్ మెరిట్ జాబితాను ద‌స‌రా పండుగ త‌ర్వాత విడుద‌ల చేస్తామ‌ని క‌మిష‌న్ స్ప‌ష్టం చేసింది.

గ్రూప్‌-4 రాత‌ప‌రీక్ష‌కు సంబంధించిన తుది కీ ఇప్ప‌టికే వెలువ‌డింది. పేప‌ర్-1లో ఏడు ప్ర‌శ్న‌లు, పేప‌ర్‌-2లో మూడు ప్ర‌శ్న‌లు.. మొత్తం ప‌ది ప్ర‌శ్న‌ల‌ను తొల‌గించింది క‌మిష‌న్‌. రెండు పేప‌ర్ల‌లో క‌లిపి మొత్తం 13 ప్ర‌శ్న‌ల స‌మాధానాల్లో మార్పులు చేయ‌గా, ఇందులో అయిదింటికి ఒక‌టి క‌న్నా ఎక్కువ స‌మాధానాల‌ను స‌రైన‌విగా పేర్కొంది. తుది కీల వెల్ల‌డి కావ‌డంతో అభ్య‌ర్థుల జ‌వాబు ప‌త్రాల మూల్యాంక‌నం పూర్తిచేసింది. ఎలాంటి పొర‌పాట్ల‌కు తావు లేకుండా జ‌న‌ర‌ల్ ర్యాంకు మెరిట్ జాబితాను విడుద‌ల చేయాల‌ని టీఎస్‌పీఎస్సీ నిర్ణ‌యించింది.

జిల్లాల వారీగా మెరిట్ జాబితాలు..

మెరిట్ జాబితా.. ప‌రీక్ష రాసిన అభ్య‌ర్థులు పొందిన మార్కుల వివ‌రాలు, జిల్లా స్థానిక‌త‌, కేట‌గిరి త‌దిత‌ర వివ‌రాలు ఈ జాబితాలో ఉండ‌నున్నాయి. ద‌స‌రా త‌ర్వాత మెరిట్ జాబితా విడుద‌ల‌కు క‌మిష‌న్ సిద్ధ‌మైంది. మ‌హిళ‌ల‌కు స‌మాంత‌ర రిజ‌ర్వేష‌న్ల‌పై హైకోర్టు స్ప‌ష్ట‌త‌నిచ్చాక‌.. ఎన్నిక‌ల కోడ్ అనంత‌రం 1:2 నిష్ప‌త్తి ప్ర‌కారం తుది ఎంపిక జాబితాల‌ను క‌మిష‌న్ ప్ర‌క‌టించ‌నుంది.