విధ్వంసం సృష్టించిన హ‌ర్మ‌న్ ప్రీత్.. ప్లే ఆఫ్ చేరిన ముంబై ఇండియ‌న్స్

విధ్వంసం సృష్టించిన హ‌ర్మ‌న్ ప్రీత్.. ప్లే ఆఫ్ చేరిన ముంబై ఇండియ‌న్స్

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 చివ‌రి ద‌శ‌కు చేరుకుంటుంది. గ‌త కొద్ది రోజులుగా ఆస‌క్తిక‌రమైన మ్యాచ్‌లు సాగ‌గా, శనివారం రోజు కూడా అరుణ్ జైట్లీ స్టేడియంలో గుజరాత్ జెయింట్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ పోరు మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించింది. లీగ్‌లో ఇది 16వ మ్యాచ్ కాగా, ముందుగా గుజరాత్ జెయింట్స్ బ్యాటింగ్ చేసింది. 20 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్లు కోల్పోయి 190 ప‌రుగుల స్కోరు చేసింది. అయితే గుజ‌రాత్ మంచి టార్గెట్ విధించిన కూడా హ‌ర్మ‌న్ ప్రీత్(48 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో 95 నాటౌట్) విధ్వంస‌క‌ర‌మైన ఇన్నింగ్స్‌తో ముంబై ఇండియ‌న్స్ ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్‌కి చేరింది. ఒకానొక స‌మ‌యంలో ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు దారుణ‌మైన ప‌రిస్థితిలో ఉంది. స్లో ర‌న్ రేట్ వ‌ల‌న జ‌ట్టు ఓడిపోతుందని అంతా భావించారు. కాని హ‌ర్మ‌న్ సుడిగాలి ఇన్నింగ్స్‌తో ఆ జ‌ట్టు 7 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది.

గుజరాత్ జెయింట్స్ లో కెప్టెన్ బెత్ మూనీ(35 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 66), దయాలన్ హేమలత(40 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 74) అర్ధ‌సెంచ‌రీలు చేయ‌గా, ఇక చివ‌ర‌లో భార్టి ఫుల్మాలి(13 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 21 నాటౌట్) మెరుపులు మెరిపించింది. ఇక ముంబై బౌలర్లలో సైకా ఇషాక్(2/31) రెండు వికెట్లు తీయగా.. హీలీ మాథ్యూస్, షబ్నిమ్ ఇస్మాయిల్, పూజా వస్త్రాకర్, సజీవన్ సంజనల‌కి త‌లో వికెట్ ద‌క్కింది. ఇక 191 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టులో ఎవ‌రు పెద్ద‌గా స్కోర్స్ సాధించ‌లేదు. ఓపెనింగ్‌ బ్యాటర్ అయిన‌ యాస్తికా భాటియా 36 బంతుల్లో 49 పరుగులు చేసి తృటిలో అర్ధ సెంచరీ మిస్ చేసుకుంది.

అయితే ముంబైకి ఒకానొక సమయంలో ముంబై 6 ఓవర్లలో 91 పరుగులు చేయాల్సి ఉండగా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడింది.క్రీజులో కుదురుకునే వ‌ర‌కు హర్మన్‌ప్రీత్ స్కోరు 21 బంతుల్లో 20 పరుగులు మాత్ర‌మే చేసింది. ఆ త‌ర్వాత 27 బంతులు ఆడి 75 పరుగులు చేసింది. 10 ఫోర్లు, 5 సిక్సర్లతో హ‌ర్మ‌న్ ప్రీత్ విరుచుకుప‌డ‌డంతో గుజ‌రాత్ బౌల‌ర్లు క‌ళ్ల‌ప్ప‌గించి చూస్తూ ఉండిపోయారు. మొత్తానికి హ‌ర్మ‌న్ ప్రీత్ విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్‌తో ఆ జ‌ట్టు ప్లే ఆఫ్ చేరింది. ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో

ముంబై ఇండియ‌న్స్ 10 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. 8 పాయింట్లతో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ రెండో స్థానంలో ఉంది. గుజరాత్ జెయింట్స్ 5 మ్యాచ్‌ల్లో 1 విజయం సాధించి 2 పాయింట్లతో చివరి స్థానంలో ఉంది.