అంశాల స్వామి ఎలా చనిపోయాడంటే..?

విధాత:  ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ విముక్తి పోరాట సమితి వేదికగా సుదీర్ఘ పోరాటం చేసిన అంశాల స్వామి కన్నుమూశారు. మర్రిగూడ మండలం శివన్నగూడెంలో శుక్రవారం రాత్రి తన ఎలక్ట్రికల్ త్రి వీలర్ పై నుంచి కింద పడ్డా అంశాల స్వామికి తలకు తీవ్రగాయం కావడంతో మృతి చెందాడు. రిపబ్లిక్ డే రోజున కొత్త ఎలక్ట్రికల్ త్రీ వీలర్ బైక్‌ను స్వామి కొనుగోలు చేసుకున్నారు. నిన్న రాత్రి ఆ బైక్‌ను స్వామి తండ్రి నడుపుతూ ఇంటి ర్యాంపు […]

అంశాల స్వామి ఎలా చనిపోయాడంటే..?

విధాత: ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ విముక్తి పోరాట సమితి వేదికగా సుదీర్ఘ పోరాటం చేసిన అంశాల స్వామి కన్నుమూశారు. మర్రిగూడ మండలం శివన్నగూడెంలో శుక్రవారం రాత్రి తన ఎలక్ట్రికల్ త్రి వీలర్ పై నుంచి కింద పడ్డా అంశాల స్వామికి తలకు తీవ్రగాయం కావడంతో మృతి చెందాడు.

రిపబ్లిక్ డే రోజున కొత్త ఎలక్ట్రికల్ త్రీ వీలర్ బైక్‌ను స్వామి కొనుగోలు చేసుకున్నారు. నిన్న రాత్రి ఆ బైక్‌ను స్వామి తండ్రి నడుపుతూ ఇంటి ర్యాంపు పైకి ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు స్వామి కింద పడ్డారు. తలకు తీవ్ర గాయమైన స్వామి అర్ధరాత్రి వాంతులతో అస్వస్థతకు గురై మృతి చెందాడు.

ఆయన మృతితో స్వగ్రామం శివన్న గూడెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అంశాల స్వామి గత ముప్పై ఏళ్లుగా నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ మహమ్మారిపై రాజీ లేని పోరాటం చేశారు. తన తోబుట్టువులు ఇద్దరు ఫ్లోరైడ్తో మృతి చెందడంతో ఫ్లోరైడ్ సమస్యపై పోరాడాలని నిర్ణయించుకున్న అంశాల స్వామి అందుకు తన జీవితకాలం కృషి చేశారు.

ఫ్లోరైడ్ విముక్తి పోరాట సమితి కన్వీనర్ కంచుకట్ల సుభాష్, జలసాధన సమితి నాయకుడు దుశ్చర్ల సత్యనారాయణ తో కలిసి పార్లమెంటు వరకు… ప్రధానుల వరకు జిల్లా ఫ్లోరైడ్ సమస్యను తీసుకెళ్లారు. వారితో కలిసి గత ప్రధాని అటల్ బీహార్ వాజ్ పేయ్‌ని కలిసిన అంశాల స్వామి ఫ్లోరైడ్ సమస్యపై పోరాటానికి ప్రతీకగా నిలిచారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలోని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం మునుగోడు ఫ్లోరైడ్ ప్రాంతాల్లో ప్రకటించిన సందర్భంగా అంశాల స్వామి జిల్లా ఫ్లోరైడ్ సమస్యలను బాధితులతో కలిసి వారి దృష్టికి తీసుకెళ్లారు.

ఇటీవల మంత్రి కేటీఆర్ అంశాల స్వామికి నూతన ఇంటిని నిర్మింపజేసి గృహప్రవేశానికి సైతం వచ్చి భోజనం చేశారు. అంశాల స్వామి మృతి సమాచారం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో స్పందిస్తూ తన సంతాపాన్ని తెలిపారు తాను ఉన్నంతకాలం తన గుండెల్లో అంశాల స్వామి నిలిచి ఉంటారని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలన్నారు.

అంశాల స్వామి పోరాట యోధుడు.. KTR భావోద్వేగం