Revanth Reddy | ఐఏఎస్, ఐపీఎస్‌లు కేసీఆర్ కోసమే పని చేస్తున్నారు : రేవంత్ రెడ్డి

Revanth Reddy | న్యూఢిల్లీ : తెలంగాణలో విధులు నిర్వర్తిస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కేసీఆర్ కోసమే పని చేస్తున్నారని టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, అధికారుల తీరుపై కేంద్ర ఎన్నికల సంఘానికి రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు.
ఎన్నికల సంఘం అధికారులను కలిసిన అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ గెలుపు కోసమే అధికారులు పని చేస్తున్నారని ఆరోపించారు. పదవీ విరమణ పొందిన వారికి కేసీఆర్ కీలక బాధ్యతలను అప్పగించారని తెలిపారు. ఈ పదవుల్లో సీఎం బంధువులు కూడా ఉన్నారని, ప్రతిపక్ష పార్టీలను దెబ్బతీసే విధంగా కేసీఆర్ సన్నిహితులు పని చేస్తున్నారని పేర్కొన్నారు. ఇక కేసీఆర్‌కు చెందిన మీడియా సంస్థలు కాంగ్రెస్‌పై ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని, దీన్ని అడ్డుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్లు రేవంత్ తెలిపారు. ఎన్నికలు ముగిసే వరకు తెలంగాణలో మద్యాన్ని నిషేధించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు రేవంత్.