Postal Ballot | ఈసీ కీల‌క నిర్ణ‌యం.. జ‌ర్న‌లిస్టులు స‌హా ఈ ఉద్యోగుల‌కు పోస్ట‌ల్ బ్యాలెట్‌

Postal Ballot | ఈసీ కీల‌క నిర్ణ‌యం.. జ‌ర్న‌లిస్టులు స‌హా ఈ ఉద్యోగుల‌కు పోస్ట‌ల్ బ్యాలెట్‌

Postal Ballot | వ‌చ్చే నెల‌లో ఐదు రాష్ట్రాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. తొలిసారిగా జ‌ర్న‌లిస్టుల‌కు పోస్ట‌ల్ బ్యాలెట్ ఓటు వేసేందుకు ఈసీ అవ‌కాశం క‌ల్పించింది. అయితే ఆరోజు జ‌ర్న‌లిస్టులు ఎన్నిక‌ల వార్త‌ల సేక‌ర‌ణ విధుల్లో ఉండాలి. అంతేకాకుండా ఎన్నిక‌ల క‌మిష‌న్ నుంచి పాసులు పొందిన జ‌ర్న‌లిస్టుల‌కే పోస్ట‌ల్ బ్యాలెట్ ఓటు వేసేందుకు అవ‌కాశం ఇవ్వ‌నున్నారు. జర్నలిస్ట్‌లతో పాటు ఎన్నికలతో సంబంధం లేని 12 అత్యవసర సేవల రంగానికి చెందిన ఉద్యోగులు సైతం ఇకపై పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.

ఎయిర్‌పోర్టు ఆథారిటీ ఆఫ్‌ ఇండియా, ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ రైల్వే, ప్రెస్ ఇన్‌ఫర్మేష‌న్‌ బ్యూరో, దూరదర్శన్‌, ఆల్‌ ఇండియా రేడియో, విద్యుత్‌ శాఖ, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ), పౌర సరఫరాల శాఖ, బీఎస్‌ఎన్‌ఎల్‌, పోలింగ్‌ రోజు వార్తల సేకరణ కోసం ఎన్నికల సంఘం నుంచి పాస్‌ పొందిన జర్నలిస్ట్‌లు, అగ్నిమాపక శాఖ అధికారులు బ్యాలెట్ ఓటు వేయొచ్చు.

ఇందుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 10న ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్‌ 60(సీ) కింద ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం గెజిట్ నోటిఫికేషన్‌ విడుదల చేశాయి.

ఇక పోస్ట‌ల్ బ్యాలెట్ ఓటు వేసే వారికి ప్ర‌త్యేకంగా నోడ‌ల్ అధికారుల‌ను నియ‌మించాల‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆదేశించింది. ఈ అధికారుల వ‌ద్ద ఫారం-12 డీ అందుబాటులో ఉంచాల‌ని సూచించింది. పోస్ట‌ల్ బ్యాలెట్ ఓటు వేయాల‌నుకున్న వారు.. ఫారం-12డీ నింపి, స్థానిక ఎన్నిక‌ల అధికారికి స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. ఈ ప్ర‌క్రియ‌ను ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌చ్చిన రోజు నుంచి ఐదు రోజుల్లోగా పూర్తిచేయాలి. అంటే న‌వంబ‌ర్ 7వ తేదీ నాటికి రిటర్నింగ్‌ అధికారికి చేరితే వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం కల్పించడానికి ఏర్పాట్లు చేస్తారు.