ఇదిగో.. ఈవిడే అగ్ని-5 “దివ్యపుత్రి”
మిషన్ దివ్యాస్త్ర’అగ్ని-5 ను ముందుండి నడిపింది ఈవిడే .

మిషన్ దివ్యాస్త్ర’కు నేతృత్వం వహించిన డిఆర్‌డిఓ-హైదరాబాద్ శాస్త్రవేత్త మరెవరో కాదు, మహిళామణి షీనా రాణి. ఎంఐఆర్‌వీ అగ్ని-5 ఈమె అధ్వర్యంలోనే రూపుదిద్దుకుంది. 1999 నుండి షీనా అగ్ని క్షిపణి వ్యవస్థ మీద పనిచేస్తోంది.
బహుళ వార్‌హెడ్‌లతో నిన్న ప్రయోగింపబడి అఖండ విజయం సాధించిన మిషన్ దివ్యాస్త్రలో భాగం – అగ్ని-5, హైదరాబాద్‌లోని డిఆర్‌డిఓ మిసైల్ కాంప్లెక్స్‌లో తయారుచేయబడింది. ఈ మిషన్‌కు నేతృత్వం వహించింది షీనారాణి అనే మహిళా శాస్త్రవేత్త. తన ఉద్యోగ ‘రజతోత్సవ విజయం’గా తోటి శాస్త్రజ్ఞుల అభివర్ణన మధ్య షీనా రాణి ‘భారత్‌ను ఎల్లవేళలా రక్షించేందుకు సహాయపడే డిఆర్‌డిఓ కుటుంబంలో ఓ గౌరవనీయమైన సభ్యురాలిని మాత్రమే’ అని వినయంగా ప్రకటించుకున్నారామె. భారత ‘అగ్నిపుత్రి’గా పేరుగాంచిన అగ్ని గ్రూప్ మిసైల్స్ ప్రఖ్యాత శాస్త్రవేత్త టెస్సీ థామస్ అడుగుజాడల్లో నడవడమే తన విజయానికి కారణమని షీనా తెలిపింది.
షీనా రాణిని ఆఫీసులో పవర్‌హౌస్‌గా పిలుస్తారు. 57ఏళ్ల షీనా హైదరాబాద్-డిఆర్‌డిఓ, అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ ల్యాబొరేటరీలో సీనియర్ సైంటిస్ట్. తిరువనంతపురం ఇంజనీరింగ్ కాలేజీ నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీర్ అయిన షీనా కంప్యూటర్ సైన్స్‌లో కూడా నిష్ణాతురాలు. విక్రమ్ సారాభాయ్ స్పేస్ పెంటర్‌లో ఎనిమిది సంవత్సరాలు పనిచేసారు. 1998లో పోఖ్రాన్ అణుపరీక్ష తర్వాత డిఆర్‌డిఓకు మారిన షీనా, 1999 నుంచీ అగ్ని క్షిపణి శ్రేణి తాలూకు ప్రయోగ నియంత్రణావ్యవస్థలపై పనిచేస్తోంది.
భారత మాజీ రాష్ట్రపతి, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, డిఆర్‌డిఓ మాజీ అధిపతి డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాంను షీనా స్ఫూర్తిగా, ప్రేరణగా తీసుకుంది. ఆశ్యర్యకరంగా, వీరిద్దరి మధ్య ఓ పోలిక కూడా ఉంది. కలాం కూడా ముందుగా విక్రమ్ సారాభాయ్ స్పేస్ పెంటర్‌లో పనిచేసి, తర్వాత డిఆర్‌డిఓకు వచ్చారు. అక్కడ ఆయన సమగ్ర గైడెడ్ క్షిపణి అభివృద్ధి వ్యవస్థకు హెడ్‌గా పనిచేసారు. షీనా కెరీర్‌ను తీర్చిదిద్దారనుకుంటున్న డా. అవినాష్ చందర్ డిఆర్‌డిఓకు క్లిష్టసమయాల్లో అధిపతిగా ఉన్నారు. ఈయన షీనా గురించి మాట్లాడతూ, ఎల్లప్పుడూ చిరునవ్వుతో, కొత్తగా ఏదో చేయాలన్న తపనతో ఉంటుంది. అగ్ని మిసైల్ కార్యక్రమంలో తన అంకితభావం అద్భుతం. నిన్నటి అగ్ని -5 విజయయాత్ర తన కీర్తికిరీటంలో ఓ కలికితురాయి అని పేర్కొన్నారు.
షీనా భర్త పిఎస్ఆర్ఎస్ శాస్త్రి కూడా డిఆర్‌డిఓలో పనిచేసినవారే. 2019లో ఇస్రో ప్రయోగించిన ఎలక్ట్రానిక్ నిఘా ఉపగ్రహం కౌటిల్య ఈయన సారథ్యంలోనే రూపుదిద్దుకుంది.