Breaking: రాహుల్​ గాంధీపై అనర్హత వేటు.. 8ఏళ్లు ఎన్నికలకు దూరం!

Rahul Gandhi Disqualification । సూరత్‌ కోర్టు తీర్పు నేపథ్యంలో నిర్ణయం గెజిట్‌ వెలువరించిన లోక్‌సభ సెక్రటేరియట్‌ విధాత: ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీకి బీజేపీ భారీ షాక్‌ ఇచ్చింది. సూరత్‌ కోర్టు 2019 నాటి కేసులో గురువారం ఇచ్చిన తీర్పును ఆధారం చేసుకుని వాయనాడ్‌ ఎంపీ రాహుల్‌గాంధీని లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటిస్తూ లోక్‌సభ సచివాలయం శుక్రవారం గెజిట్‌ వెలువరించింది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 8, భారత రాజ్యంగంలోని 102(1) (ఈ) అధికరణం ప్రకారం ఈ నిర్ణయం […]

Breaking: రాహుల్​ గాంధీపై అనర్హత వేటు.. 8ఏళ్లు ఎన్నికలకు దూరం!

Rahul Gandhi Disqualification ।

  • సూరత్‌ కోర్టు తీర్పు నేపథ్యంలో నిర్ణయం
  • గెజిట్‌ వెలువరించిన లోక్‌సభ సెక్రటేరియట్‌

విధాత: ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీకి బీజేపీ భారీ షాక్‌ ఇచ్చింది. సూరత్‌ కోర్టు 2019 నాటి కేసులో గురువారం ఇచ్చిన తీర్పును ఆధారం చేసుకుని వాయనాడ్‌ ఎంపీ రాహుల్‌గాంధీని లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటిస్తూ లోక్‌సభ సచివాలయం శుక్రవారం గెజిట్‌ వెలువరించింది.

ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 8, భారత రాజ్యంగంలోని 102(1) (ఈ) అధికరణం ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు లోక్‌సభ సచివాలయం తెలిపింది. ఈ అనర్హత రాహుల్‌పై నేరారోపణ రుజువైన మార్చి 23, 2023 నుంచి వర్తిస్తుందని పేర్కొన్నది. కేరళలోని వాయనాడ్‌ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు రాహుల్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

రాహుల్‌పై వేటు వేయడాన్ని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మనీశ్‌ తివారీ తప్పుపట్టారు. ఒక ఎంపీని లోక్‌సభ సెక్రటేరియట్‌ అనర్హుడిగా ప్రకటించజాలదని అన్నారు. ఎన్నికల కమిషన్‌తో సంప్రదించిన తర్వాత రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

బీజేపీ ఓవర్‌ యాక్షన్‌

రాహుల్‌పై అనర్హత వేటు వేసే విషయంలో బీజేపీ నాయకత్వం అత్యుత్సాహాన్ని ప్రదర్శించిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శిక్ష విధించిన కోర్టే పైకోర్టులో అప్పీలు చేసుకునేందుకు 30 రోజులు అవకాశం ఇచ్చిన నేపథ్యంలో ఆయన తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు సమయం ఉన్నది. పై కోర్టుకు వెళ్లే ప్రయత్నాల్లో రాహుల్‌ తరఫు న్యాయవాదులు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడా సానుకూల ఫలితం రాకపోతే ఆయన సుప్రీం కోర్టులో కూడా అప్పీలు చేసుకునేందుకు అవకాశం ఉన్నది. కానీ.. ఈలోపే బీజేపీ అత్యుత్సాహం ప్రదర్శించిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది కాంగ్రెస్‌కు షాక్‌ ఇచ్చినట్టుగా ఉన్నా.. అంతిమంగా కాంగ్రెస్‌ పార్టీకే లబ్ధి చేకూర్చే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.

చేటు తెచ్చిన ‘మోదీ’ వ్యాఖ్యలు

‘మోదీ’ అనే ఇంటిపేరును ఉద్దేశించి రాహుల్‌ 2019లో చేసిన వ్యాఖ్యలపై గుజరాత్‌లోని సూరత్‌ కోర్టు ఆయనకు రెండేండ్ల జైలు శిక్ష విధించింది. ప్రస్తుతానికి శిక్షను నిలుపుదల చేసి, పైకోర్టులో అప్పీలు చేసుకునేందుకు 30 రోజులు అవకాశం కల్పించింది.

చట్టం ఏం చెబుతున్నది?

ప్రజాప్రాతినిధ్య చట్టం -1951 (Representation of the People Act-1951) ప్రకారం.. ఏదైనా నేరంలో పార్లమెంటు సభ్యుడికి రెండేళ్ల జైలు శిక్ష పడి.. అమలైతే ఆయనపై అనర్హత వేటు పడుతుంది. అప్పడు ఎన్నికల కమిషన్‌ ఆ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహిస్తుంది. కింది కోర్టు తీర్పు రద్దు కాని పక్షంలో రెండేళ్లు జైలు శిక్ష సమయం సహా మొత్తం 8 ఏళ్లు రాహుల్‌ ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేరు.

ఈ సెక్షన్‌లో ఇంత శిక్షా?

ఐపీసీ సెక్షన్‌ 499 కింద క్రిమినల్‌ పరువు నష్టం కేసులో రెండేండ్లు జైలు శిక్ష విధించడం అనేది అత్యంత అరుదైనదని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

రాహుల్‌ నోరు నొక్కే కుట్ర : కాంగ్రెస్‌
ప్రధాని నరేంద్రమోదీకి, వ్యాపార వేత్త గౌతం అదానీకి మధ్య ఉన్న సంబంధాలను ప్రశ్నిస్తున్న రాహుల్‌గాంధీ నోరు నొక్కడానికే ఈ కుట్ర చేశారని కాంగ్రెస్‌ ఆరోపించింది. దేశం కోసం, దేశంలోని ప్రజల కోసం ఆయన విరామం ఎరుగని పోరాటం చేస్తున్నారని, అందుకోసం వీధులు మొదలుకుని, పార్లమెంటు వరకు తన గళం వినిపిస్తున్నారని పేర్కొన్నది. రాహుల్‌ చేసేదంతా దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసమేనని స్పష్టం చేసింది. ఎన్ని కుట్రలు చేసినా రాహుల్‌ తన పోరాటం ఆపబోరని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటన్నింటినీ అధిగమిస్తారని తెలిపింది. ఈ పోరాటం ఆగేదే లేదని తేల్చి చెప్పింది.

విషయాన్ని పక్కదారి పట్టించే యత్నం : మల్లికార్జున ఖర్గే
ప్రజల సొమ్ము దోచుకుని పారిపోతున్న వారి గురించి తాము సమాధానాలు కోరుతుంటూ.. ఆ విషయాన్ని పక్కదారి పట్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ఓబీసీ వర్గాలను రాహుల్‌ కించపర్చారన్న బీజేపీ వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందిస్తూ.. మనువాదాన్ని నమ్మి ఆచరించాలనుకునే బీజేపీ నేతలు వెనుకబడిన వర్గాల గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. వాస్తవాలను మరుగుపర్చి పరువు నష్టం రాజీకీయాలకు పాల్పడుతున్నారంటూ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాపై కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజాస్వామ్యానికి మంచిది కాదు : శశిథరూర్‌

కేంద్ర ప్రభుత్వ చర్య ప్రజాస్వామ్యానికి ఏ విధంగానూ మంచిది కాదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ శశిథరూర్‌ అన్నారు. ఇంత హడావుడిగా ఈ చర్య తీసుకోవడం నన్ను నిశ్చేష్టుడిని చేసిందని పేర్కొన్నారు. కోర్టు తీర్పు వచ్చిన 24 గంటల్లోనే చర్యలా? అందులోనూ తీర్పు ఇచ్చిన కోర్టే పై కోర్టులో అప్పీలు చేసుకునేందుకు అవకాశం ఇచ్చిన తర్వాత చర్యలు ఎలా తీసుకుంటారని ఆయన నిలదీశారు.

దేశవ్యాప్తంగా నిరసనలు

కేంద్ర ప్రభుత్వ కక్షపూరిత రాజకీయాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాయి. సూరత్‌ కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా కర్ణాటకలో ఆందోళనకు దిగిన కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌ను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు.

కోర్టు తీసుకున్న నిర్ణయమే ఇది : బీజేపీ

అయితే బీజేపీ నేతలు మాత్రం ఒక వెనుకబడి తరగతి ప్రజలను దొంగలుగా అభివర్ణిస్తూ రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఒక స్వతంత్ర న్యాయ వ్యవస్థ తీసుకున్న నిర్ణయమే ఇదని పేర్కొంటున్నారు.