ఓజీలో పవర్ ఫుల్ విలన్..ఫస్ట్ లుక్ చూసి షాకవుతున్న సినీ ప్రియులు

చివరిగా బ్రో సినిమాతో ప్రేక్షకులని పలకరించిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. రాజకీయాల వలన కొన్నాళ్లపాటు ఆయన సినిమా షూటింగ్‌లకి బ్రేక్ పడ్డాయి. ఎలక్షన్ పూర్తైన తర్వాత పవన్ తిరిగి తను కమిటైన సినిమాల షూటింగ్స్ పూర్తి చేయనున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో ఓజీ చిత్రం ఒకటి కాగా, దీనిపై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రభాస్‌తో సాహో చిత్రం చేసి కాస్త నిరాశపరచిన సుజీత్ ఇప్పుడు పవన్‌తో ఓజీ మూవీని చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. మూవీ రిలీజ్‌కి సమయం ఉండడంతో మేకర్స్ అప్పుడప్పుడు చిత్రానికి సంబంధించి సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నారు.
ఇప్పటి వరకు చిత్రానికి సంబంధించి విడుదలైన పోస్టర్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా చిత్రంలో విలన్ పాత్ర పోషిస్తున్న ఇమ్రాన్ హష్మి ఫస్ట్ లుక్ విడుదల చేసింది. నేడు ఆయన బర్త్ డే సందర్భంగా పాత్రని రివీల్ చేస్తూ పోస్టర్ వదిలారు. అంతేకాకుండా చిత్రంలో అత్యంత భయంకరమైన విలన్‌గా ఆయనని పరిచయం చేశారు మేకర్స్. ఓమీ భావు పాత్రలో ఇమ్మాన్ హష్మీ కనిపించి సందడి చేయనున్నాడు. తాజాగా విడుదలైన పోస్టర్‌లో ఇమ్రాన్.. సిగరేట్ తాగుతూ, పవర్‌ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నాడు ..బాలీవుడ్‌లో కింగ్ ఆఫ్ రొమాన్స్ గా పేరుతెచ్చుకున్న ఇమ్రాన్ ఇప్పుడు పూర్తి భిన్నంగా ఓ క్రూరమైన విలన్‌గా కనిపించబోతుడడం చర్చనీయాంశం అయింది.
ఓజీ చిత్రం గ్యాంగ్‌స్టర్(మాఫియా) ప్రధానంగా సాగుతుందని తెలుస్తుంది.. చీకటి సామ్రాజ్యానికి అధిపతులుగా ఓ వైపు పవన్, మరోవైపు ఇమ్రాన్ కనిపిస్తారని,ఈ ఇద్దరు కోసం ఆధిపత్య పోరు కోసం పోరాడతారని సమాచారం. `ఓజీ`లో పవన్ పాత్ర మూడు భిన్నమైన షేడ్స్ లో ఉంటుందని ఇటీవల `రజాకార్` నటుడు తేజ సప్రూ వెల్లడించిన విషయం తెలిసిందే.. యూనియన్ లీడర్‌గా, డాన్ గా, పొలిటికల్ లీడర్ పాత్రలో పవర్ స్టార్ కనిపించి సందడి చేయనున్నాడు. పవన్ ఓ పాత్రలో ఇమ్రాన్ హష్మీకి తండ్రి పాత్రలో కూడా కనిపించి సందడి చేయనున్నారట. అర్జున్ దాస్, ప్రియాంక మోహన్, శ్రియా రెడ్డి చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సెప్టెంబర్ 27న మూవీని విడుదల చేసే అవకాశం ఉంది.