Paytm | పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ నెల 15 నుంచి ఆంక్షలు అమలులోకి రానున్నాయి. మార్గదర్శకాల ఉల్లంఘన, నిర్వహణ లోపాల కారణంగా ఆంక్షలు విధించినట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది. గడువు తర్వాత కొత్త డిపాజిట్లు సేకరించడం, టాప్ అప్స్‌ను ఫిబ్రవరి 29 తర్వాత స్వీకరించొద్దని ఆదేశించింది. అయితే, ఆ గడువును మార్చి 15 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. ఇకపై గడువు పొడిగించాల్సిన అవసరం లేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. ఈ గడువు శుక్రవారంతో ముగియనున్నది. ఈ నేపథ్యంలో పేటీఎం యూజర్లు తప్పనిసరిగా కొన్ని వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. 15 తర్వాత పేటీఎంలో ఏ సేవలు అందుబాటులో ఉంటాయి.. ఏ సేవలు నిలిచిపోతాయో తెలుసుకుందాం రండి..!
ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో ఈ నెల 15 ఆ తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సేవలు అందుబాటులో ఉండవు. వాస్తవానికి జనవరి 31న ఆర్బీఐ ఆంక్షల విధిస్తున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 29 వరకు గడువును ఇస్తున్నట్లు తెలిపింది. ఆ తర్వాత గడువును మార్చి 15 వరకు పొడిగించింది. ఇకపై గడువును పొడిగించమని క్లారిటీ ఇచ్చింది. దాంతో పేమెంట్స్ బ్యాంక్‌లో ఎలాంటి లావాదేవీలకు అవకాశం ఉండదు. మార్చి 15 తర్వాత పేటీఎం బ్యాంకులే ఏమైనా నగదు ఉంటే.. మరో బ్యాంకుకు బదిలీ చేసుకోవాలని ఆర్బీఐ చెప్పింది. పేటీఎంలో కీలకమైన ఫాస్టాగ్ సేవలు నిలిచిపోనున్నాయి. వాస్తవానికి పేటీఎంలో భారీగా ఫాస్టాగ్ యూజర్లున్నారు. ఇకపై ఫాస్టాగ్ రీచార్జ్ చేసుకునే వీలుండదు. ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో ఇప్పటికే పేటీఎం అధీకృత బ్యాంకుల జాబితా నుంచి పేటీఎం బ్యాంక్‌ను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా తొలగించిన విషయం తెలిసిందే. అలాగే, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో నగదు స్వీకరణ జరుగదు. యూజర్లు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నుంచి జీతం తీసుకుంటున్నట్లయితే.. మరో బ్యాంకు మారాల్సి ఉంటుంది.
పేటీఎం పేమెంట్ బ్యాంక్ వినియోగదారులు వ్యాలెట్, బ్యాంక్‌లో ఉన్న డబ్బుల్ని విత్ డ్రా చేసుకునేందుకు వీలుంటుంది. రీఫండ్, క్యాష్‌బ్యాక్ తదితర సేవలు కొనసాగుతాయి. పేటీఎంలో బ్యాలెన్స్ ఉన్నంతవరకూ చెల్లింపులు చేసుకోవచ్చు. పేటీఎం వ్యాలెట్‌ను మరో బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసుకునేందుకు అవకాశం ఉంది. మార్చ్ 15 తర్వాత పేటీఎం ఫాస్టాగ్ పనిచేస్తుంది. అయితే, బ్యాలెన్స్ ఉన్నంత వరకు వాడుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత రీఛార్జ్ చేయడం కుదరదు. పేటీఎం నెలవారీ ఓటీటీ చెల్లింపులు చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా.. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆంక్షల నేపథ్యంలో గత నెల 16న తరుచూగా అడిగే ప్రశ్నల (FAQ)కు సంబంధించి సమాధానాలను సైతం విడుదల చేసింది.