రైతుబంధు విడ‌త‌లవారీగా ఇస్తున్నాం

రైతుబంధును విడుతల వారీగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.

రైతుబంధు విడ‌త‌లవారీగా ఇస్తున్నాం
  • ఎక‌రం ఉన్న‌వారికి వేశాం
  • రెండెక‌రాల రైతుకు వేస్తున్నాం
  • డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌ వెల్లడి


విధాత‌: రైతు బంధు నిధులను రైతుల ఖాతాల్లో విడుత‌లవారీగా జమచేస్తున్నామని డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క తెలిపారు. మంగ‌ళ‌వారం ఆయ‌న అసెంబ్లీలోని మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ రైతుల‌కు ఆర్థిక స‌హాయం అందించ‌డం కోసం రోజువారీగా రైతు బంధు నిధులు విడుద‌ల చేస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక ఎక‌రం భూమి ఉన్న పేద రైతులు 27 ల‌క్ష‌ల మందికి రైతు బంధు నిధులు విడుద‌ల చేశామ‌న్నారు. ఇప్పుడు రెండు ఎక‌రాల భూమి ఉన్న రైతుల‌కు రైతు బంధు నిధులు విడుద‌ల చేస్తున్నామ‌న్నారు. ఈ మేర‌కు నిధులు ఆయా రైతుల ఖాతాల్లో జ‌మ అవుతున్నాయ‌ని భ‌ట్టి విక్ర‌మార్క తెలిపారు.


నిధుల లేమితో ఆల‌స్యం..

రైతు బంధు నిధులు రైతుల ఖాతాల్లో ఒకేసారి జ‌మ చేయ‌డానికి నిధుల కొర‌త అడ్డుగా మారింది. ఖ‌జానాలో డ‌బ్బులు లేకపోవ‌డంతో రైతుబంధు ఒకేసారి ఇవ్వ‌లేక పోతున్నారు. వాస్త‌వంగా ఎన్నిక‌ల‌కు ముందు రైతు బంధు డ‌బ్బులు రైతుల ఖాతాల్లో జ‌మ అవుతున్నాయ‌ని బీఆరెస్ స‌ర్కారు పెద్ద‌లు ప్ర‌క‌టించారు. అయితే ఆనాటి ఎన్నిక‌ల క‌మిష‌న్ కోడ్ కార‌ణంగా రైతుల ఖాతాలో జ‌మ చేయ‌వ‌ద్ద‌ని, ఎన్నిక‌ల షెడ్యూల్ ముగిసిన త‌రువాత రైతుల ఖాతాలో జ‌మ చేసుకోవాల‌ని ఎన్నిక‌ల క‌మిష‌న్ స్ప‌ష్టం చేసింది. అయితే రైతు బంధు కోసం ఖ‌జానాలో జ‌మ అయిన డ‌బ్బులు అలాగే ఉంటాయ‌ని భావించిన రేవంత్‌రెడ్డి ఆనాడు పీసీసీ అధ్య‌క్షుడి హోదాలో త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే డిసెంబ‌ర్ 9వ తేదీన రైతుల ఖాతాలో జ‌మ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. కానీ డిసెంబ‌ర్ 7వ తేదీన సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి అదే రోజు ఖాళీ ఖ‌జానా క‌నిపించింది. ఆర్థిక శాఖ అధికారులు తాపీగా వ‌చ్చి న‌యా పైస కూడా లేదు స‌ర్ అని రేవంత్ కు స‌మాధానం ఇచ్చారు. దీంతో ఏం చేయాలో పాలుపోని ప‌రిస్థితి రేవంత్ రెడ్డికి ఏర్ప‌డింది.


ఖాళీ ఖ‌జానా అప్ప‌గించ‌డంతో..

రైతు బంధు కోసం జ‌మ చేసిన డ‌బ్బుల‌న్నీ పాత ప్ర‌భుత్వం ఖ‌ర్చు చేస్తుంద‌ని, తాము అధికార ప‌గ్గాలు చేప‌ట్టే వ‌ర‌కు ఎలాంటి ఖ‌ర్చులు చేయ‌కుండా ఆదేశాలు ఇవ్వాల‌ని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల క‌మిష‌న్‌ను కోరింది. కాంగ్రెస్ పార్టీ భ‌యప‌డిన‌ట్లుగానే ఖాళీ ఖ‌జానా ద‌ర్శ‌నం ఇచ్చింది. దీంతో శ్వేతప‌త్రం విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించి, శ్వేత పత్రం విడుద‌ల చేసింది. రైతు బంధు కోసం జ‌మ‌చేసిన సొమ్మును అనుకూల కాంట్ర‌క్ట‌ర్ల‌కు చెల్లింపులు చేశార‌ని నాడు కాంగ్రెస్ ఆరోపించింది. ఒక వైపు ఖాళీ ఖ‌జానా, మ‌రోవైపు అప్పులు కూడా దొర‌క‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీంతో వ‌చ్చిన ఆదాయంతోనే ప్ర‌స్తుతానికి బండి న‌డుపుతున్నారు. మ‌రో వైపు కేంద్రం వ‌ద్ద కొత్త అప్పుల కోసం రేవంత్ స‌ర్కారు ఆర్జీ పెట్టింది. కేంద్రం క‌నిక‌రిస్తే రైతు బంధు నిధుల‌తో స‌హా ఇత‌ర ప‌థ‌కాల‌కు కూడా నిధుల కొర‌త తీరుతుంది. ఈలోగా వచ్చే ఆదాయంలో రైతు బంధుకు అత్య‌ధిక ప్రాధాన్యం ఇచ్చి రైతు ఖాతాలో నిధులు జ‌మ చేయాల‌ని రేవంత్ స‌ర్కారు నిర్ణ‌యించింది. ఈ మేర‌కు ఎక‌రాల వారీగా రైతు బంధు నిధులు రైతుల ఖాతాలో జ‌మ చేస్తున్నారు.