ఎంపీలో ప్రభుత్వ ఏర్పాటుపై సింధియా కీలక వ్యాఖ్యలు
తాను ముఖ్యమంత్రి పదవికి రేసులో లేనని కేంద్రమంత్రి, బీజేపీ నాయకుడు జ్యోతిరాదిత్య సింథియా స్పష్టం చేశారు.

భోపాల్: మధ్యప్రదేశ్ ఎన్నికల్లో అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. దిమాని నియోజకవర్గంలో కాల్పలు జరిగాయని, పలువురికి గాయాలయ్యాయని తొలుత వార్తలు వచ్చినా.. పోలీసులు మాత్రం అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు. పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉన్నదని మోరేనా ఎస్పీ శైలేంద్రసింగ్ తెలిపారు. మిర్ధ్వాన్ గ్రామంలో రెండు గ్రూపుల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకున్నదని చెప్పారు. ఓటు వేయనీయకుండా కొందరిని అడ్డుకోవడంతో ఈ ఘర్షణ తలెత్తిందని పేర్కొన్నారు. కర్రలతో కొట్టుకోవడంతో ఇద్దరికి గాయాలయ్యాయని చెప్పారు. బుల్లెట్ గాయాలయ్యాయన్న వార్తలు నిరాధారమని తెలిపారు. ఈ నియోజకవర్గంలో కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్, కాంగ్రెస్ సిటింగ్ ఎమ్మెల్యే రవీంద్రసింగ్ పోటీ పడుతున్నారు.
బీజేపీ కార్యకర్తలా మొరేనా ఎస్పీ..
ఇదిలాఉంటే మొరేనాలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బు, పోలీసులను బీజేపీ నేతలు వాడుకుంటున్నారని కమల్‌నాథ్ ఆరోపించారు. ‘వాళ్లకు మిగిలింది ఇదొక్కటే. నిన్న కూడా రోజంతా మద్యం, డబ్బు పంపిణీ చేశారు. ఏం జరుగుతున్నదో కొందరు నాకు వీడియోలు పంపారు. నేను స్పష్టంగా చెబుతున్నా.. మొరేనా ఎస్పీ బీజేపీ కార్యకర్తగా పనిచేస్తున్నాడు’ అని కమల్‌నాథ్ తేల్చి చెప్పారు. దిమాని మినహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఓటింగ్ సజావుగా సాగుతున్నదని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి అనుపమ్ రాజన్ చెప్పారు. కొన్ని చోట్ల సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఈవీఎంలు మార్చామని తెలిపారు.
పోలింగ్ బూత్‌లోకి ఎంపీ మాజీ సీఎం కొడుకు
ఛింద్వారాలోని బరారిపురాలో పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ కుమారుడు, ఎంపీ నకుల్ నాథ్‌ను బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఛింద్వారా నుంచి కమల్‌నాథ్ సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ బీజేపీ తరఫున వివేక్ బంటి సాహు పోటీ చేస్తున్నారు.
ఎంపీలో ప్రభుత్వ ఏర్పాటుపై సింధియా కీలక వ్యాఖ్యలు
తాను ముఖ్యమంత్రి రేసులో లేనని కేంద్రమంత్రి, బీజేపీ నాయకుడు జ్యోతిరాదిత్య సింథియా స్పష్టం చేశారు. ఈ విషయంలో వస్తున్న వార్తలు నిరాధారాలని అన్నారు. కాంగ్రెస్‌లోనే ముఖ్యమంత్రి పదవికోసం రేసులో ఉన్నారని ఎద్దేవా చేశారు. నేను 2013, 2018 లేదా 2023లో ముఖ్యమంత్రి పదవికి రేసులో లేనని ఎప్పుడూ చెబుతూనే ఉన్నానని గుర్తు చేశారు. తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీకి మళ్లీ పూర్తి మెజార్టీ ఖాయమని చెప్పారు. ప్రజలు తమకు ఉన్న అభివృద్ధి, ప్రగతిని పరిరక్షించుకుంటారన్న విశ్వాసాన్ని వ్యక్తంచేశారు. ఎన్ని సీట్లు వస్తాయో చెప్పనుగానీ.. తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోయేది తామేనని, ప్రధాని మోదీ నాయెకత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్ర ప్రగతికి దోహదపడుతుందని చెప్పారు.