రెండో టీ20లో ఓడిన టీమిండియా.. రింకూ సింగ్ సిక్స‌ర్‌కి మీడియా బాక్స్ బ‌ద్దలు

రెండో టీ20లో ఓడిన టీమిండియా.. రింకూ సింగ్ సిక్స‌ర్‌కి మీడియా బాక్స్ బ‌ద్దలు

సొంత గ‌డ్డ‌పై టీ20 సిరీస్ నెగ్గిన సూర్య‌కుమార్ బృందం ఇప్పుడు సౌతాఫ్రికా గ‌డ్డ‌పై సేమ్ రిపీట్ చేసేందుకు సిద్ధ‌మైంది. తొలి టీ20 వ‌ర్షార్ప‌ణం కాగా, రెండో టీ20లోను వ‌రుణుడు కాసేపు అంత‌రాయం క‌లిగించాడు. అయితే డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప్ర‌కారం లక్ష్యంతో పాటు ఓవ‌ర్ల‌ని త‌గ్గించి ఆట ఆడించ‌గా, ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఏడు బంతులు మిగిలి ఉండ‌గానే విజ‌యం సాధించింది. ముందుగా ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది అని చెప్పాలి.. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, యశస్వీ జైస్వాల్ డకౌట్‌‌లు పెవిలియన్ చేరారు. దాంతో టీమిండియా 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ‌గా, ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ..కెప్టెన్ సూర్యతో కలిసి ఇన్నింగ్స్‌ని చ‌క్క‌దిద్దాడు.

20 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 29 పరుగులు చేసి తిల‌క్ వ‌ర్మ వెనుదిర‌గ‌గా, ఆ త‌ర్వాత సూర్య‌, రింకూ క‌లిసి స్కోరు ని ప‌రుగులు పెట్టించారు. రింకూ సింగ్‌, సూర్యకుమార్‌ల హాఫ్‌ సెంచరీలతో భారత్‌ 19.3 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌటైంది. అయితే ఆ త‌ర్వాత అకస్మాత్తుగా వర్షం రావడంతో సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌ను 15 ఓవర్లకు కుదించి లక్ష్యాన్ని 152గా నిర్దేశించారు . సిరాజ్ వేసిన తొలి ఓవర్‌లో 14 పరుగులు రాగా, అర్ష్‌దీప్ సింగ్ ఓవర్‌లో 24 పరుగులు రావ‌డంతో భార‌త అభిమానులు డీలా ప‌డ్డారు. జట్టు 2.5 ఓవర్లలో మాథ్యూ బ్రిట్జ్కే రూపంలో తొలి వికెట్ కోల్పోగా, ఆ తర్వాత రెండో వికెట్‌కు రీజా హెండ్రిక్స్, కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ 30 బంతుల్లో 54 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ‌రో వికెట్ ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌గా ఆడారు.

17 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 30 పరుగులు చేసిన మార్క్రామ్ 8వ ఓవర్ ఐదో బంతికి అవుట్ అయ్యారు. ఇక 9వ ఓవర్ చివరి బంతికి 49 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హాఫ్ సెంచరీ దిశగా సాగుతున్న ఓపెనర్ రీజా హెండ్రిక్స్ ను కుల్దీప్ యాదవ్ ఔట్ చేశాడు. ఇక 10వ ఓవర్ రెండో బంతికి హెన్రిచ్ క్లాసెన్ 07 పరుగులు చేసి మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు.ఆ స‌మ‌యంలో భారత్ ప‌ట్టు బిగించిన‌ట్టు క‌నిపించింది. కాని ట్రిస్టన్ స్టబ్స్ 14 పరుగులతో నాటౌట్‌, ఆండిలే ఫెహ్లుక్వాయో 10 పరుగులతో నాటౌట్‌గా ఉండి సాతాఫ్రికాకి అద్భుత‌మైన విజ‌యం ద‌క్కేలా చేశారు. ఇదిలా ఉంటే రింకూ త‌న బ్యాటింగ్‌లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో వీరవిహారం చేయ‌గా, ఆయ‌న కొట్టిన స్ట్రైట్ సిక్సర్ ధాటికి మీడియా బాక్స్ గ్లాస్ పగిలిపోయింది. ప్రస్తుతం ఈ సిక్స్‌కు సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎయిడెన్ మార్క్‌రమ్ వేసిన 19వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.