మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ఉపశమనం పొందండిలా..!
ఎండలు ముదరడంతో.. వేడి గాలుల తీవ్రత కూడా పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో వడదెబ్బ తగిలే అకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి పిల్లలు, వృద్ధులు ఈ వేడి గాలులకు దూరంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఇంట్లో నుంచి కాలు బయట మోపాలంటేనే భయపడిపోతున్నారు. ఎండలు ముదరడంతో.. వేడి గాలుల తీవ్రత కూడా పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో వడదెబ్బ తగిలే అకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి పిల్లలు, వృద్ధులు ఈ వేడి గాలులకు దూరంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లోనే బయటకు వెళ్లడం మంచిదని చెబుతున్నారు. మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్తే వడదెబ్బ ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
వడదెబ్బ లక్షణాలు ఇవే..
ఎండలో బయట తిరిగే వారికి వడదెబ్బ తగులుతుంది. తల తిరగడం, తల నొప్పి రావడం వడదెబ్బ లక్షణాలు. ఇక తీవ్రమైన జ్వరం కూడా వస్తుంది.. అపస్మారక స్థితిలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఫిట్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..
- మండుటెండల్లో బయటకు వెళ్లినప్పుడు కాటన్ వస్త్రాలు ధరించాలి. తలకు కర్చీఫ్ కట్టుకుంటే మంచిది. అవసరమైతే గొడుగు తీసుకెళ్లడం బెటర్.
- కళ్లకు నేరుగా వేడి గాలులు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకు సన్ గ్లాసెస్ ఉపయోగిస్తే మంచిది.
- మండుటెండలో బయటకు వెళ్లినప్పుడు మంచినీళ్ల బాటిల్ తప్పకుండా వెంట తీసుకెళ్లాలి. ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజ్ వాటర్, ఓఆర్ఎస్ కలిపిన నీటిని తాగుతూ ఉండాలి.
- ఎండలో నుంచి ఇంటికి వచ్చిన వెంటనే.. మంచినీరు గానీ, నిమ్మరసం గానీ, కొబ్బరి నీళ్లు గానీ తాగాలి.
- ఇంటికి చేరుకున్న కాసేపటికి చల్లటి నీళ్లతో స్నానం చేస్తే ఇంకా బెటర్.
- శరీరాన్ని డీహైడ్రేట్ చేసే ఆల్కహాల్, టీ, కాఫీలు, కూల్డ్రింక్స్ తాగకూడదు. అధిక ప్రోటీన్, ఉప్ప, కారం, నూనె ఉండే పదార్థాలు తీసుకోకూడదు.
- తీవ్రమైన ఎండలో బయటకు వెళ్లి వచ్చినప్పుడు తలతిరుగడం, వాంతులు వంటి లక్షణాలు కనిపించినా.. ఇతర అనారోగ్య సమస్యలు ఏర్పడినా.. వెంటనే డాక్టర్ను సంప్రదించాలి.
- వడదెబ్బకు గురైన వారిని వేడి నీటిలో ముంచిన గుడ్డతో తుడువకూడదు. ఆలస్యం చేయకుండా దగ్గరలోని ఆస్పత్రిలో చేర్పిస్తేనే మంచిది.