రసవత్తరంగా మారిన ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్ మ్యాచ్.. చివరి ఓవర్‌లో హ్యాట్రిక్ వికెట్స్

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్ -2024)లో భాగంగా శుక్రవారం ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే.ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ 20 ఓవర్లలో 138 పరుగులు చేసింది. అయితే 139 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్.. 19.5 ఓవర్లలోనే 137 పరుగులకు ఆలౌట్ కావడంతో యూపీ వారియర్స్ ఆటగాళ్ల ఆనందానికి అవధులు లేవు. ఆఖరి ఓవర్‌లో పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. గ్రేస్ హారీస్ ఒక రనౌట్‌తో వరుసగా 3 వికెట్లు తీసి ఓడిపోయే మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌ను గెలిపించింది.
ఈ విజయం యూపీ వారియర్స్‌కి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అయితే మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ ఆటగాళ్లలో దీప్తి శర్మ(48 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 59) హాఫ్ సెంచరీతో రాణించగా.. అలీస్సా హీలీ(30 బంతుల్లో 5 ఫోర్లతో 29) ఓ మోస్తరు స్కోరు చేసింది. వీరిద్దరు తప్ప మిగతా ఎవ్వరు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. ఢిల్లీ బౌలర్స్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో యూపీ వారియర్స్‌కి పరుగులు రావడం కష్టమైంది. ఢిల్లీ బౌలర్స్‌లో టిటాస్ సధు, రాధా యాదవ్ రెండేసి వికెట్లు తీయగా.. శిఖా పాండే, అరుంధతి రెడ్డి, జెస్ జొనాస్సెన్, అలిస్ కేప్సీ తలో వికెట్ పడగొట్టారు.
ఇక 139 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ లక్ష్యాన్ని చేధించడంలో విఫలమైంది. మెగ్ లానింగ్ 60, జెమినాహ్ రోడ్రిగ్స్ 17, షఫాలీ వర్మ 15, అలిసే క్యాప్సే 15 పరుగులు మినహా మిగతా వారెవ్వరూ పెద్దగా పరుగులు చేయలేకపోయారు. దీప్తి శర్మ(4/19) నాలుగు వికెట్లతో చెలరేగగా.. సైమా టాకోర్(2/30), గ్రేస్ హారీస్(2/8) రెండేసి వికెట్లు పడగొట్టారు. సోఫీ ఎక్లెస్టోన్‌కు ఓ వికెట్ తీసారు. అయితే చివరి ఓవర్ మాత్రం చాలా ఆసక్తికరంగా సాగింది.ఢిల్లీ విజయానికి 4 బంతుల్లో 2 పరుగులు అవసరమైన సమయంలో రాధా యాదవ్ క్లీన్ బౌల్డ్ కావడం, అనంతరం క్రీజులోకి వచ్చిన తానియా భాటియా క్విక్ సింగిల్‌కు ప్రయత్నించగా.. నాన్‌స్ట్రైకర్ జెస్ జొనాస్సెన్(11) రనౌట్ కావడం జరిగింది. ఇక తర్వాత క్రీజులోకి వచ్చిన టిటాస్ సధు కూడా క్యాచ్ ఔట్ కావడంతో యూపీ ఖాతాలో విజయం చేరింది. సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ ఓటమి పాలైంది.