TTD | తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలెర్ట్.. ఈ రోజుల్లోనే శ్రీవారి సేవలు, దర్శన టికెట్ల కోటా విడుదల..

TTD | తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త టీటీడీ శుభవార్త చెప్పింది. జూన్ మాసానికి సంబంధించి ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్న ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఆర్జితసేవా టికెట్లు, శ్రీవారి సేవ కోటాకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ నెల 18న ఉదయం 10 నుంచి 20న ఉదయం 10 గంటల వరకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల లక్కీడిప్ కోసం పేర్లు నమోదు చేసుకోవచ్చని తెలిపింది.
అదే రోజున మధ్యాహ్నం ఎంపికైన వారి పేర్లను ప్రకటిస్తామని, టికెట్ల పొందిన వారంతా 22న మధ్యాహ్నం 12 గంటలలోపు డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. 21న ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జితసేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల కోటాను విడుదల చేయనున్నట్లు తెలిపింది. జూన్ 19 నుంచి 21వ తేదీ వరకు జరుగనున్న జ్యేష్టాభిషేకం ఉత్సవంలో పాల్గొనేందుకు 21న ఉదయం 10 గంటలకు భక్తులకు అందుబాటులో టికెట్లు ఉంచనున్నట్లు చెప్పింది.
మార్చి 21న మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి వర్చువల్ సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనున్నట్లు తెలిపింది. 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు విడుదల చేస్తామని చెప్పింది. 23న ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దాతల దర్శనం, గదుల కోటా.. 23న మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శన టికెట్ల కోటాను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది.
ఇక 25న ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టకెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామని చెప్పింది. అదే రోజున మధ్యాహ్నం తిరుమల, తిరుపతిలోని వసతి గదుల కోటా విడుదలవుతుందని టీటీడీ పేర్కొంది. 27న ఉదయం 11 గంటలకు తిరుమల, తిరుపతిలోని శ్రీవారి సేవ కోటాను, అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ కోటాను, మధ్యాహ్నం 1 గంటలకు పరకామణి సేవ కోటాను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు వివరించింది. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరింది.