నేడు ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 ఆడ‌నున్న భార‌త్.. కోహ్లీ గైర్హాజరుపై మండిప‌డుతున్న రోహిత్ ఫ్యాన్స్

నేడు ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 ఆడ‌నున్న భార‌త్.. కోహ్లీ గైర్హాజరుపై మండిప‌డుతున్న రోహిత్ ఫ్యాన్స్

ఇటీవ‌ల ద‌క్షిణాఫ్రికా టూర్‌ని స‌క్సెస్ ఫుల్‌గా ముగించుకున్న భార‌త జ‌ట్టు ఇప్పుడు ఆఫ్ఘ‌నిస్తాన్‌తో మూడు టీ20లు ఆడేందుకు సిద్ధ‌మైంది. అయితే కొంత కాలంగా టీ20ల‌కి దూరంగా ఉంటున్న రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ పొట్టి ఫార్మాట్‌లో సంద‌డి చేయ‌బోతున్నారు. అయితే సుమారు 14 నెలల తర్వాత కింగ్ కోహ్లిని పొట్టి ఫార్మాట్‌లో చూడాలని ఉవ్విళ్లూరుతున్న టీమిండియా అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చాడు. కోహ్లీ మొదటి మ్యాచ్‌లో ఆడటం లేదని రాహుల్ ద్రవిడ్ ఇప్ప‌టికే స్పష్టం చేశాడు. ఆడకపోవడానికి స్పష్టమైన కారణం చెప్పక‌పోగా, కుటుంబ కార‌ణాలు అంటూ విలేకరుల ప్ర‌శ్న‌ల‌ని దాట వేశాడు.

అయితే జ‌న‌వరి 11న వామిక బ‌ర్త్ డే కాగా, చిన్నారి బ‌ర్త్‌డేని కుటుంబ సమేతంగా జ‌ర‌పాల‌ని భావించి తొలి టీ20 మ్యాచ్ నుంచి వైదొలిగిన‌ట్టు తెలుస్తుంది. కూతురి బర్త్ డే కోసం విరాట్ కోహ్లీ అఫ్గాన్‌తో తొలి టీ20కి దూరంగా ఉండటంపై అభిమానులు మండిప‌డుతున్నారు. ఓ అంతర్జాతీయ క్రికెటర్ అయిన కోహ్లీకి ఇది ఏ మాత్రం తగదని క‌స్సుబుస్సుమంటున్నారు. దేశం క‌న్నా కూడా కూతురు బ‌ర్త్ డే వేడుక నీకు ఎక్కువైందా, టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికి కుర్రాళ్లకు అవకాశాలు ఇవ్వాలంటూ కొంద‌రు హిత‌వు ప‌లుకుతున్నారు. ఈ విష‌యంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అభిమానులు రెండుగా విడిపోయి విమర్శలు గుప్పిస్తున్నారు.

నేషనల్ డ్యూటీని పక్కనపెట్టి కూతురు బర్త్ డే వేడుకల్లో పాల్గొంటున్న కోహ్లీపై రోహిత్ శర్మ అభిమానులు దారుణ‌మైన విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఈ స‌మ‌యంలో కోహ్లీ ఫ్యాన్స్ ఆయ‌న‌కి అండ‌గా నిలుస్తూ ప్ర‌తి ఒక్క‌రికి వ్య‌క్తిగ‌త జీవితం ఉంటుంద‌ని దానికి కూడా న్యాయం చేయాల్సి ఉంటుంద‌ని అంటున్నారు. గతంలో రోహిత్ శర్మ కూడా తన కూతురు బర్త్ డే కోసం వన్డే మ్యాచ్‌కు దూరమయ్యాడని చెప్పుకొస్తున్నారు. అయితే మ‌హేంద్ర సింగ్ ధోని మాత్రం త‌న కూతురు జీవా పుట్టిన సమయంలో ఆస్ట్రేలియాలో వన్డే ప్రపంచకప్ 2015 ఆడాడ‌ని, టోర్నీ ముగిసిన తర్వాతనే తన కూతుర్ని చూశాడని చెప్పుకొచ్చారు. ఇక ఆఫ్ఘాన్‌తో తొలి టీ 20లో కెప్టెన్ రోహిత్ శర్మతో జైస్వాల్ ఓపెనింగ్ చేస్తాడని ద్ర‌విడ్ పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీ ఆడకపోతే మూడో నంబర్‌లో శుభ్‌మన్ గిల్‌ను పంపే అవకాశం ఉంది.