ఓటమి తర్వాత బాబర్ వెక్కి వెక్కి ఏడ్చాడు.. షాకింగ్ కామెంట్స్ చేసిన మాజీ క్రికెటర్

భారత్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వన్డే క్రికెట్ టోర్నమెంట్‌లో న్యూజిలాండ్, భారత్ దాదాపు సెమీస్ బెర్త్ ఖాయం చేసుకున్నాయి. ఇప్పుడు సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా తర్వాతి స్థానాలలో నిలవబోతున్నట్టు విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. అయితే భారీ అంచనాలతో వరల్డ్ కప్ రేసులో అడుగుపెట్టిన పాక్ ఘోరంగా విఫలం అవుతుంది. బ్యాటింగ్, బౌలింగ్ ఫీల్డింగ్ విభాగాల్లో ఆ జట్టు ఆటగాళ్లు పూర్తిగా విఫలం అవుతుండడంతో జట్టు సెమీస్ అవకాశాలు పూర్తిగా సన్నగిల్లిపోతున్నాయి. మరోవైపు పాక్ జట్టు పై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజాం పై మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాబర్‌ని నిందితుడిగా చూపిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.
మరోవైపు ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సైతం బాబర్ ఆజమ్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి మాజీ కెప్టెన్ సర్ఫరాజ్, వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్, పేసర్ షహీన్ షా అఫ్రిదీలలో ఒకరికి నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. అయితే బాబర్‌పై తీవ్రమైన ఒత్తిడి నెలకొన్న నేపథ్యంలో ఆయనకి మాజీ క్రికెటర్ మహ్మద్ యూసుఫ్ అండగా నిలిచారు. ఓటమికి బాబర్ ఒక్కడే కారణం కాదని, జట్టు మొత్తం బాధ్యత తీసుకోవాలని ఆయన కామెంట్ చేశాడు. రీసెంట్‌గా ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో .. యూసుఫ్ మాట్లాడుతూ…ఆఫ్గానిస్థాన్ పై పాక్ జట్టు ఓడిన తరువాత డ్రెస్సింగ్ రూంలో బాబర్ ఏడ్చాడనే విషయం తనకు తెలిసిందని అన్నాడు.
అతను ఏడ్చాడనే విషయం తెలిసి చాలా బాధపడ్డాను. ఓటమికి ఒక్క కెప్టెన్‌ని మాత్రమే బాధ్యుడిని చేయడం తప్పు. జట్టులోని ప్రతి ఆటగాడితో పాటు టీమ్ మేనేజ్‌మెంట్‌కి కూడా బాధ్యత ఉంటుంది.తన మద్దతు బాబర్‌కి ఉంటుందని యూసుఫ్ అన్నాడు. దేశం కూడా అతడికి అండగా నిలుస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. ఇక ఇదిలా ఉంటే వరల్డ్ కప్‌లో ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు ఆడి కేవలం రెండింటిలోనే విజయం సాధించడంతో పాక్ సెమీస్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. తాజాగా నెదర్లాండ్స్‌పై ఆస్ట్రేలియా సాధించిన భారీ విజయంతో పాక్ జట్టు సెమీస్‌కి వెళ్లడం కష్టంగానే కనిపిస్తుంది.