Kantara : Chapter 1 Review | కాంతారా చాప్టర్ 1 సినిమా రివ్యూ: రిషభ్ శెట్టి మైథలాజికల్ వండర్– అంచనాలను అందుకుందా?
“కాంతార: చాప్టర్-1”లో రిషభ్‌శెట్టి నటన, పౌరాణిక పోరాట దృశ్యాలు, అద్భుతమైన విజువల్ మాయాజాలం ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాయి. క్లైమాక్స్‌లో గులిగ రూపం, రుద్ర తాండవం థియేటర్లో పూనకం తెప్పిస్తాయి.

Kantara Chapter 1 Review: Rishab Shetty’s Divine Prequel with Visual Grandeur
- చిత్రం : కాంతార : చాప్టర్ 1
- నిర్మాణ సంస్థ: హోంబలే ఫిల్మ్స్
- నిర్మాతలు: విజయ్ కిరగందూర్, చలువే గౌడ
- దర్శకత్వం : : రిషభ్ శెట్టి
- నటీనటులు: రిషభ్ శెట్టి, రుక్మిణీవసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్, రాకేష్ పూజారి
- సంగీతం: బి. అజనీష్ లోక్‌నాథ్
- సినిమాటోగ్రఫీ: అరవింద్ ఎస్. కశ్యప్
- ఎడిటర్: సురేష్ మల్లయ్య
- నిడివి: 2 గంటల 49 నిమిషాలు
- విడుదల: అక్టోబర్ 2, 2025
హైదరాబాద్, అక్టోబర్ 2, 2025 – విధాత సినిమా డెస్క్
Kantara : Chapter 1 Review | 2022లో ‘కాంతారా’ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిషభ్షెట్టి, దానికి ప్రీక్వెల్‌గా ‘కాంతారా చాప్టర్ 1’ తో మళ్లీ వచ్చాడు. దసరా సందర్భంగా థియేటర్లలో రిలీజైన ఈ కన్నడ సినిమా, పాన్-ఇండియా హైప్‌తో తెలుగు, హిందీ సహా ఇతర భాషల్లో రిలీజైంది. ఈ సినిమా కన్నులపండువగా, దైవశక్తితో నడిచే యాక్షన్ డ్రామాగా నిలిచింది. అయితే, మొదటి అర్థ భాగం భావోద్వేగాలు సరిగ్గా పండకపోయినా, ప్రేక్షకుల ఆనందాన్ని అది అడ్డుకోలేకపోయింది – యాక్షన్, మైథాలజీ ఫ్యాన్స్‌కు మాత్రం ఫుల్ ఎంజాయ్!
గిరిజన హక్కులు, దైవిక రహస్యాల మధ్య యుద్ధమే కథా సారాంశం
8వ శతాబ్దంలో కర్ణాటక తీర ప్రాంతంలో కదంబ రాజవంశ కాలంలో ఈ కథ జరుగుతుంది. కాంతారా అనే దైవిక ఆరణ్యంలో ‘ఈశ్వరుడి పూదోట’, మార్మిక బావి కేంద్రంగా గిరిజన తెగ జీవిస్తుంది. ఈ భూమిని పరశురాముడు సృష్టించగా, పంజూర్లి దైవం కాపాడుతుంటుందని వారి నమ్మకం. బెర్మే (రిషభ్షెట్టి) నేతృత్వంలో ఈ తెగ, సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేస్తూ, వెట్టి చాకిరీ నుంచి విముక్తి కోసం పోరాడుతుంది. బాంగ్రా రాజ్యం (రాజు రాజశేఖర్ – జయరామ్, యువరాజు కులశేఖర్ – గుల్షన్ దేవయ్య, యువరాణి కనకవతి – రుక్మిణి వసంత్) ఈ దేవభూమిని, దేవుడి విగ్రహాన్ని కాజేయాలనుకుంటుంది.
బెర్మే తన తెగ హక్కుల కోసం ఆ రాజ్యాన్ని ఎదిరిస్తాడు. దైవశక్తుల జోక్యంతో పాటు, గిరిజన హక్కులు, ఆధ్యాత్మిక వారసత్వం చుట్టూ కథ నడుస్తుంది. మొదటి భాగం(కాంతార)తో కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. తన తండ్రి మాయమైన రహస్యాన్ని తెలుసుకోవడానికి కొడుకు శివ పడే తపనే కదంబ రాజవంశ కాలానికి కథను తీసుకెళుతుంది. తొలి అర్థభాగం కొంత గందరగోళానికి గురైనా, రెండో సగం మాత్రం ప్రశంసనీయంగాఉంది.
బలాలు: అద్భుతమైన దృశ్యాలు– రిషభ్ నటన, దర్శకత్వ ప్రతిభ
రిషభ్ శెట్టి నటన, దర్శకత్వం: ‘కాంతార: చాప్టర్-1’ పూర్తిగా రిషభ్‌శెట్టి వన్‌మ్యాన్ షో. నటుడిగానూ, దర్శకుడిగానూ ఆయన ప్రతిభ ప్రతిసన్నివేశంలో కనిపిస్తుంది. పూనకం వచ్చిన సన్నివేశాల్లో ఆయన నటన మనకు కూడా పూనకం తెప్పించేలా ఉంది. గులిగ రూపంలో ఆయన విజృంభణ స్క్రీన్‌పైన అద్భుతంగా ఉంది.
విజువల్స్, వీఎఫ్‌ఎక్స్, సినిమాటోగ్రఫీ: టెక్నికల్ వైపు సినిమా అద్భుతం. సినిమాటోగ్రాఫర్ అరవింద్ కశ్యప్ అడవుల అందాలను, పోరాట సన్నివేశాలను అద్భుతంగా కెమెరాలో బంధించారు. జంతువులతో చేసిన గ్రాఫిక్స్ పనితనం హాలీవుడ్ స్థాయిలో ఉంది. ముఖ్యంగా పులి, కోతుల దృశ్యాలు కనులవిందుగా ఉన్నాయి. అజనీష్ లోక్నాథ్ సంగీతం సినిమాకు ప్రాణం పోసింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ముఖ్యంగా క్లైమాక్స్‌లో థియేటరే కంపించేలా చేసింది. నిర్మాణ విలువలు అత్యున్నతంగా ఉన్నాయి. ప్రతీ ఫ్రేమ్‌లో భారీతనం కనిపిస్తుంది.
ఇతర నటవర్గం, వారి నటన: రుక్మిణి వసంత్ పాత్రకు మంచి ప్రాధాన్యం ఇచ్చారు. కేవలం ప్రేమ పాత్రే కాకుండా, క్లైమాక్స్‌లో ఆమె పాత్రలో వచ్చే ట్విస్ట్‌కి మంచి స్పందన లభించింది. జయరామ్, గుల్షన్ దేవయ్య తమ పాత్రల్లో సులువుగా ఒదిగిపోయారు. ముఖ్యంగా జయరామ్ క్లైమాక్స్‌లో విశ్వరూపం చూపించారు.
మైనస్ పాయింట్స్: కథ నెమ్మదిగా సాగడం, భావోద్వేగాలు సరిగ్గా పండకపోవడం
తొలి భాగం కొంచెం నెమ్మదిగా సాగడం, కొన్ని అనవసర సన్నివేశాలు పొడిగించబడడం వల్ల కథాగమనంలో వేగం తగ్గిపోయింది. కొంత గజిబిజిగా అనిపించే సన్నివేశాలూ ఉన్నాయి. కానీ రెండో భాగంలో వచ్చిన సన్నివేశాలన్నీ ఈ మైనస్ పాయింట్లను మరిపిస్తాయి.
మొత్తానికి ‘కాంతారా చాప్టర్ 1’ నిరాశపరచకుండా, ఆసక్తికరంగా సాగింది. రిషభ్‌శెట్టి ఈ చిత్రానికి ఆత్మలా నిలిచాడు. ఇటు నటుడిగా, అటు దర్శకుడిగా ద్విపాత్రాభినయం చేసి, రెండు పాత్రలకూ న్యాయం చేసాడు. హోంబలే ఫిల్మ్స్ నిర్మాణ విలువలు, అద్భుతమైన విజువల్స్, గుండె వేగాన్ని పెంచే బీజిఎం, సాంకేతికంగా అత్యున్నతంగా ఉండి, తప్పకుండా థియేటర్లోనే చూడాల్సిన విధంగా ఉంది. సినిమా అభిమానులు మాత్రం మిస్ కావద్దు.