‘చిరంజీవి అంటే పిచ్చి ప్రేమ’ – ఆమని భావోద్వేగ వ్యాఖ్యలు వైరల్

సీనియర్ హీరోయిన్ ఆమని, తను మెగాస్టార్​ చిరంజీవికి ఎంత పెద్ద అభిమానో తెలిపింది. తన కెరీర్‌లో మెగాస్టార్ చిరంజీవితో నటించే అవకాశాన్ని కోల్పోవడం తన జీవితంలో పెద్ద కోల్పోయిన అవకాశమని భావోద్వేగంతో చెప్పింది. ఆయన పక్కన నటించలేకపోవడం తనకు జీవితాంతం మిగిలిపోయే బాధ అని నిరాశపడింది.

‘చిరంజీవి అంటే పిచ్చి ప్రేమ’ – ఆమని భావోద్వేగ వ్యాఖ్యలు వైరల్

సీనియర్ నటి ఆమని, 90వ దశకంలో టాలీవుడ్‌లో తన ప్రత్యేక నటనతో, హోమ్లీ ఇమేజ్‌తో ప్రేక్షకుల హృదయాల్లో ముద్ర వేసుకున్న ప్రముఖ హీరోయిన్. మావి చిగురు, శుభలగ్నం, జంబలకిడి పంబ వంటి చిత్రాల్లో చేసిన ఆమె పాత్రలు యూత్‌తోపాటు కుటుంబ ప్రేక్షకులకూ బాగా నచ్చాయి. అయితే, తన కెరీర్‌లో అనేక స్టార్ హీరోలతో జోడీ కట్టిన ఆమని, ఒకే ఒక్క కోరిక మాత్రం నెరవేరలేదని, అది మెగాస్టార్ చిరంజీవితో జోడీగా నటించడం అని వెల్లడించింది.

ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమని, “నాకు చిరంజీవి అంటే అభిమానమే కాదు, ఒక ప్రత్యేకమైన క్రేజ్. రొమాన్స్ సాంగ్ లేదా సన్నివేశం అనుకుంటే నా మనసులో తొలుత కనిపించేది చిరంజీవే. డ్రీమ్ సీన్స్‌లో హీరోయిన్‌ని తీసేసి తన స్థానంలో నన్ను ఊహించుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆ స్థాయి క్రేజ్ ఉన్నప్పటికీ, ఆయన పక్కన హీరోయిన్‌గా కనిపించే అవకాశం మాత్రం చేజారిపోయింది,” అని చిరునవ్వుతో అన్నారు. చిరంజీవికి జోడీగా నటించే అవకాశం కూడా వచ్చినట్టు వెల్లడించారు. శుభలగ్నం తర్వాత రిక్షావోడు సినిమాలో మొదట నన్నే ఎంపిక చేశారు. డేట్స్ ఫిక్స్ అయ్యాయి. సౌందర్య గారు కూడా ఆ సినిమాలో ఉండటంతో మేమిద్దరం సంతోషించాం. కానీ ఒక వారం, పది రోజులకు ఏమైందో తెలియదు. ఒక పత్రికలో నగ్మా హీరోయిన్ అని చదివాను. తర్వాత తెలుసుకున్నది ఏమంటే, డైరెక్టర్ మారిపోయారు. కోదండ రామిరెడ్డి గారి స్థానంలో కోడి రామకృష్ణ గారు వచ్చారు. ఆ మార్పుతోనే నన్ను తీసుకోలేదు. ఆ నిరాశ వల్ల నేను చాలా రోజులు బాధపడ్డాను అని ఆమని చెప్పుకొచ్చింది.

ఆమని తన కెరీర్‌లో రెండుసార్లు మాత్రమే ఏడ్చానని, ఒకసారి హీరోయిన్ కాకపోయానని ఏడ్చాను. రెండోసారి చిరంజీవి పక్కన నటించలేకపోయానని ఏడ్చాను. ఆ బాధ ఇంకా మిగిలి ఉంది. స్టాలిన్ సినిమాలో సిస్టర్ క్యారెక్టర్ అడిగినా నేను స్పష్టంగా తిరస్కరించాను. ‘నేను ఆయనకు సిస్టర్‌గా ఎలా నటిస్తాను? అది నాకు సాధ్యం కాదు’ అని పది సార్లు నో చెప్పాను,” అని తెలిపింది.

అలాగే చిరంజీవిపై తన అభిమానాన్ని ఒక చిన్న సంఘటన ద్వారా వివరించారు. “కే. విశ్వనాథ్ గారి స్మారక కార్యక్రమం చిరంజీవి గారే దగ్గరుండి అంతా జరిపించారు.  చాలా ఏళ్ల తర్వాత ఆయన్ని చూసి సంతోషపడ్డాను. అందరూ గ్రూప్ సెల్ఫీలు తీసుకుంటుంటే, నేను మాత్రం ప్రత్యేకంగా వెళ్లి ‘సార్, ఒక్క ఫొటో’ అని అడిగాను. ఆయన ‘ఆమని గారూ.. మీరిలా అడగటమేంటండీ.. రండి’ అంటూ ఫోటో దిగారు. ఒక అభిమానిలా తీసుకున్న ఆ ఫోటో నా జీవితంలోని మధుర జ్ఞాపకాలలో ఒకటి,” అని ఆమని సంతోషంగా చెప్పారు. మెగాస్టార్‌తో నటించే కల తీరకపోయినా, ఆయనపై ఉన్న గౌరవం, అభిమానాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని ఆమని తెలిపారు. ఇక జీవితాంతం అది ఒక మిస్‌డ్ ఛాన్స్‌గానే మిగిలిపోతుంది. అలాగే  చిరంజీవి గారు కూడా నా డ్రీమ్ హీరోగానే మిగిలిపోయారు అని ఆమె భావోద్వేగంగా అన్నారు.