Shilpa Shetty And Raj Kundra | విదేశాలకు వెళ్లాలా..రూ.60కోట్లు డిపాజిట్ చేయండి: శిల్పాశెట్టి దంపతులకు హైకోర్టు షాక్
విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై శిల్పాశెట్టి దంపతులకు ముంబై హైకోర్టు షాకిచ్చింది. రూ.60 కోట్లు డిపాజిట్ చేస్తేనే దేశం విడిచి వెళ్లాలని కోర్టు ఆదేశించింది.

న్యూఢిల్లీ : బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాలు(Raj Kundra) తాము విదేశాలకు వెళ్లేందుకు అనుమతించాలంటూ దాఖలు చేసిన పిటిషన్ ను ముంబై హైకోర్టు(Mumbai Highcourt) తిరస్కరించింది. వారు ఒకవేళ దేశం విడిచి వెళ్లాలంటే ముందు రూ.60కోట్లు డిపాజిట్(Rs 60 Crore Deposit) చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను పాటించిన తర్వాత తదుపరి విచారణ కొనసాగుతుందని తెలిపింది. ఓ వ్యాపార వేత్త దీపక్ కోఠారిని రూ.60 కోట్లకు పైగా మోసం చేశారన్న ఆరోపణల కేసు విచారణలో ఉంది. ఈ క్రమంలోనే ముంబై పోలీసుల ఆర్థికనేరాల విభాగం ఇప్పటికే వారికి లుకౌట్ నోటీసులు(Look Out Notice) జారీ చేసింది. ఇది ఇలా ఉండగా శిల్పాశెట్టి(Shilpa Shetty) దంపతులు విదేశీ పర్యటనకు వెళ్లడానికి అనుమతి కోరుతూ బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు.
ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహించే కార్యక్రమంలో భాగంగా శిల్పాశెట్టి అక్టోబరు 25-29 తేదీల మధ్యలో కొలంబో వెళ్లాల్సి ఉంది. లుకౌట్ నోటీసులు ఉన్న నేపథ్యంలో ఆమె కోర్టును ఆశ్రయించారు. ‘ఈవెంట్ నిర్వాహకుల నుంచి ఏమైనా ఆహ్వానం ఉందా?’ అని కోర్టు శిల్ప లాయర్‌ను ప్రశ్నించగా, ప్రస్తుతం కేవలం ఫోన్‌కాల్ ద్వారా మాత్రమే సమాచారం తెలియజేశారని, కోర్టు అనుమతి ఇస్తే, అధికారికంగా ఆహ్వానం అందుతుందని తెలిపారు. పిటిషన్ ను విచారించిన కోర్టు శిల్ప దంపతుల అభ్యర్థనను తిరస్కరించింది. ఒకవేళ శిల్పా శెట్టి దంపతులు విదేశాలకు వెళ్లాలనుకుంటే, రూ.60 కోట్లు డిపాజిట్ చేసి వెళ్లొచ్చని కోర్టు స్పష్టం చేసింది.