మూతపడిన సినిమా థియేటర్లు.. రెండు వారాల పాటు బంద్
తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం నుంచి సినిమా థియేటర్ల మూసివేత కొనసాగుతుంది. థియేటర్ ఆక్యుపెన్సీ పడిపోవడంతో నష్టాల నివారణకు యాజమాన్యాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి

విధాత: తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం నుంచి సినిమా థియేటర్ల మూసివేత కొనసాగుతుంది. థియేటర్ ఆక్యుపెన్సీ పడిపోవడంతో నష్టాల నివారణకు యాజమాన్యాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. గరిష్టంగా రెండు వారాల మేరకు థియేటర్ల మూసివేత కొనసాగనుంది. వేసవి సెలవుల్లో పోటాపోటీ సినిమాల విడుదలతో, ప్రేక్షకుల రద్ధీతో కళకళలాడిన థియేటర్లు రెండు నెలలుగా కొత్త సినిమాలు విడుదల లేకపోవడం, ఐపీఎల్, ఎన్నికల ఎఫెక్ట్ వంటి కారణాలతో ప్రేక్షకులు థియేటర్లకు రాక వెలవెలబోతున్నాయి.
ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లకు రోజుకు వందమంది కూడా రాని పరిస్థితి నెలకొందని, దీంతో కరెంట్ ఖర్చులకు కూడా డబ్బులు రావడం లేదని ఆవేదన చెందిన సింగిల్ స్క్రీన్ థియేటర్ యాజమాన్యాలు 10 రోజుల పాటు థియేటర్లను మూసివేయాలని నిర్ణయించుకున్నారు. జూన్ 15 వరకు పెద్ద సినిమాలేవీ విడుదలకు నోచుకోకపోతుండటం.. చిన్న సినిమాల విడుదల ఉన్నప్పటికి వాటి నుంచి ఆశించిన లాభాలు దక్కకపోవచ్చన్న కారణం కూడా సింగిల్ స్క్రీన్ థియేటర్ల మూసివేతకే యాజమాన్యం మొగ్గు చూపింది.
తెలంగాణాలోని సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్ యాజమాన్యాలు ఆదరణ లేకపోవడంతో నష్టాల దృష్ట్యా సినిమా ప్రదర్శనలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని రాష్ట్ర ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి తెలిపారు. ఈ నిర్ణయంతో తెలంగాణలో దాదాపు 450.సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడనున్నాయన్నారు.
థియేటర్ మూసేస్తే రోజుకు 4 వేల రూపాయల నష్టం వస్తుందని , సినిమా ప్రదర్శితమైతే దాదాపు 6 వేల రూపాయల వరకు నష్టం వస్తుందని చెప్పారు. స్క్రీనింగ్‌లను నిలిపివేయాలన్న నిర్ణయం కనీసం రెండు వారాల పాటు అమలులో ఉంటుందని, అయితే ఎవరైనా నిర్మాతలు ముందుకు వచ్చి వ్యాపార లావాదేవీగా ముందస్తు చెల్లింపు చేస్తే థియేటర్ల యజమానులు సినిమాలను ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉంటారని ఆయన తెలిపారు.