నీట మునిగిన బోటు.. ఆరుగురు విద్యార్థులు మృతి
గుజరాత్‌లోని వడోదర పరిధిలో విషాదం నెలకొంది. స్థానికంగా ఉన్న హరిణి లేక్‌లో విద్యార్థులతో వెళ్తున్న బోటు నీట మునిగింది

వడోదర : గుజరాత్‌లోని వడోదర పరిధిలో విషాదం నెలకొంది. స్థానికంగా ఉన్న హరిణి లేక్‌లో విద్యార్థులతో వెళ్తున్న బోటు నీట మునిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులు మృతి చెందారు. గల్లంతైన విద్యార్థుల ఆచూకీ కోసం గజ ఈతగాళ్లు, పోలీసులు గాలిస్తున్నారు.
ఓ ప్రయివేటు పాఠశాలకు చెందిన 27 మంది విద్యార్థులు బోటు రైడ్ కోసం హరిణి నది వద్దకు చేరుకున్నారు. విద్యార్థులంతా బోటులో వెళ్తున్న సమయంలో ప్రమాదవశాత్తు అది నీట మునిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆరుగురు విద్యార్థుల మృతదేహాలను వెలికితీశారు. మిగతా వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. అయితే విద్యార్థుల వెంట టీచర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన గుజరాత్ సీఎం
ఈ ప్రమాద ఘటనపై గుజరాత్ సీఎం భూపేంద్ర భాయ్ పటేల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హరిణి లేక్‌లో బోటు మునిగి విద్యార్థులు మృతి చెందడం దురదృష్టకరమన్నారు. విద్యార్థుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.