Ranya Rao : రన్యారావుకు మరో కొత్త తలనొప్పి.. బంగారం స్మగ్లింగ్‌పై రంగంలోకి కేంద్ర దర్యాప్తు సంస్థ!
ఆమె పాస్‌పోర్టులో పేరు హర్షవర్ధిని రన్య అని ఉన్నట్టు దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. గడిచిన ఆరు నెలల్లోనే ఆమె 27 సార్లు దుబాయికి వెళ్లి వచ్చినట్టు గుర్తించారు. ఇన్నిసార్లు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనే అంశంలో అధికారులు కూపీలాగుతున్నారు.

Ranya Rao : దుబాయి నుంచి పెద్ద మొత్తంలో బంగారాన్ని తరలిస్తూ దొరికిపోయిన కన్నడ సినీ నటి రన్యారావుకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ రంగంలోకి దిగింది. గ్యాంగులుగా ఏర్పడి వేర్వేరు ఎయిర్‌పోర్టుల ద్వారా బంగారం స్మగ్లింగ్ చేశారన్న ఆరోపణలపై సీబీఐ తాజాగా కేసు నమోదు చేసిందని ఒక వార్తా సంస్థకు ఆ సంస్థ అధికారులు తెలిపారు. రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు నేపథ్యంలో సీబీఐ రంగంలోకి దిగడం గమనార్హం. ఇటీవల కెంపెగౌడ విమానాశ్రయంలో రన్యారావును అరెస్టు చేసిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులతో సీబీఐ అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే ముంబై, బెంగళూరు ఎయిర్‌పోర్టులకు చేరుకున్న సీబీఐ బృందాలు.. అవసరమైన సమాచార సేకరణలో నిమగ్నమైనట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి.
పాస్‌పోర్టులో పేరు హర్షవర్ధిని రన్య
కర్ణాటక డీజీపీ సవతి కుమార్తె, సినీ నటి అయిన రన్యారావును డీఆర్ ఐ అధికారులు మార్చి 3వ తేదీన బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో తనిఖీల సందర్భంగా ఆమె నుంచి 12.56 కోట్లు విలువ చేసే బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమె నివాసంలో నిర్వహించిన సోదాల్లో 2 కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలు, 2.67 కోట్ల కరెన్సీని సీజ్ చేశారు. ఈ మధ్యకాలంలో 14.2 కిలోల బంగారం స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారని విమానాశ్రయ వర్గాలు పేర్కొన్నాయి. శుక్రవారం ఆమెను మూడు రోజులపాటు డీఆర్ ఐ కస్టడీకి అప్పగిస్తూ ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆమె యూరప్ దేశాలు, అమెరికా, మిడిలీస్ట్, దుబాయి, సౌదీ అరేబియా వంటి దేశాలకు తరచూ ప్రయాణాలు చేసేదని అధికారులు తెలిపారు. ఆమె పాస్‌పోర్టులో పేరు హర్షవర్ధిని రన్య అని ఉన్నట్టు దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. గడిచిన ఆరు నెలల్లోనే ఆమె 27 సార్లు దుబాయికి వెళ్లి వచ్చినట్టు గుర్తించారు. ఇన్నిసార్లు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనే అంశంలో అధికారులు కూపీలాగుతున్నారు.