అధికారులపై చర్యలు తీసుకోండి..సైబరాబాద్ సీపీకి హైకోర్టు ఆదేశం
కాంగ్రెస్ వార్‌రూమ్ వాలంటీర్ల అరెస్టు విషయంలో పోలీసుల సమాధానం సమర్థనీయంగా లేదని హైకోర్టు అభిప్రాయపడింది

- కాంగ్రెస్ వాలంటీర్ల అరెస్టు సరైంది కాదు
- నోటీసులు ఇచ్చేందుకు వెళ్లి
- వారిని అరెస్టు చేయడమేంటని ప్రశ్న
విధాత, హైదరాబాద్ : కాంగ్రెస్ వార్‌రూమ్ వాలంటీర్ల అరెస్టు విషయంలో పోలీసుల సమాధానం సమర్థనీయంగా లేదని హైకోర్టు అభిప్రాయపడింది. నోటీసులు ఇవ్వడానికి వెళ్లి… అరెస్టు చేసి అక్రమంగా నిర్బంధించడం చట్టప్రకారం సరికాదంది. నాడు తనిఖీల్లో పాల్గొన్న అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించింది. కాంగ్రెస్ నేత మల్లు రవి దాఖలు చేసిన పిటిషన్‌ను అనుమతిస్తూ, విచారణను ముగించింది. కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్‌పై పోలీసులు చట్ట వ్యతిరేకంగా దాడి చేసి అక్కడ పనిచేసే ముగ్గురిని అక్రమంగా అరెస్టు చేయడాన్ని తప్పుపడుతూ ఆ పార్టీ మాజీ ఎంపీ మల్లు రవి హైకోర్టులో గత డిసెంబర్‌లో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.
కాంగ్రెస్ వార్ రూమ్ నుంచి తీసుకువెళ్లిన వాళ్లను తక్షణమే కోర్టులో హాజరుపర్చేలా పోలీసులకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. మాదాపూర్ ఇనార్బిట్‌మాల్‌లోని నాలుగో అంతస్తులో పనిచేసే సిమ్లాకు చెందిన ఇషాన్ శర్మ, విశాఖపట్నానికి చెందిన తాతినేని శశాంక్, విజయవాడకు మండ ప్రతాప్‌లను పోలీసులు డిసెంబర్ 14న ఉదయం 2 గంటల ప్రాంతంలో అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. తక్షణమే ముగ్గురు యువకులను విడుదల చేసేలా పోలీసులకు ఉత్తర్వులు ఇవ్వాలని, లేకపోతే వాళ్ల ప్రాణాలకు ముప్పు ఉంటుందని భయాందోళన వ్యక్తం చేశారు. పోలీసులు ఏకపక్షంగా, చట్ట వ్యతిరేకంగా, రాజ్యాంగ హక్కులను కాలరాసిన కారణంగా ముగ్గురు బాధితులకు రూ.20 లక్షలు చొప్పున పరిహారం చెల్లించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.
కేసు నమోదు చేసిన వివరాలుగానీ నోటీసుగానీ ఏమీ ఇవ్వలేదన్నారు ఆ ముగ్గురినీ అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని, వాళ్లపై గతంలో ఏవిధమైన కేసుల్లేవని, అరెస్టుకు కారణాలు తెలుపుతూ సీఆర్‌పీసీలోని 50 సెక్షన్ కింద నోటీసు కూడా ఇవ్వలేదని చెప్పారు. పోలీసుల చర్య రాజ్యాంగంలోని 21వ అధికరణానికి తూట్లు పొడవడమేనని అన్నారు. ఏం కేసు ఉందో పోలీసులు అడిగినా చెప్పలేదన్నారు. చట్ట ప్రకారం ఏడేళ్లలోపు శిక్షలు పడే కేసుల్లో సీఆర్‌పీసీ 41ఏ సెక్షన్ కింద నోటీసు ఇవ్వాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను తుంగలోకి తొక్కారని ఆరోపించారు. 2023లో అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వారంతా మాదాపూర్‌లో నిర్వహిస్తున్న ఆఫీసులో టీపీసీసీ కోసం వ్యూహాత్మక ఫ్రేమ్ వర్క్ చేస్తుంటారని వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్, సైబర్ క్రైం ఏసీపీ, సీఐలతోపాటు ఏఎస్పీ ప్రసాద్, సైబర్ క్రైం సీఐ రమేష్‌లను వ్యక్తిగత ప్రతివాదులుగా చేర్చారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ కె.సుజన ధర్మాసనం తీర్పు వెలువరించింది. 2022, డిసెంబర్ 13 రాత్రి 10.45 ప్రాంతంలో కాంగ్రెస్ వార్‌రూమ్‌లో తనిఖీలకు వెళ్లిన పోలీసులు.. 41ఏ నోటీసులు ఇవ్వకుండా రాత్రి 2 గంటలకు నేరుగా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది తేరా రజనీకాంత్‌రెడ్డి వాదనలు వినిపించారు.
అదే రోజు ఉదయం 10 గంటల వరకు అక్రమంగా నిర్భందించి తరువాత 41ఏ నోటీసుల జారీ చేశారన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. పిటిషనర్ వాదనలపై పోలీసులు చెప్పిన సమాధానంతో సంతృప్తి చెందలేదు. అరెస్టులో పాల్గొన్న ఏఎస్పీ, సీఐపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి.. చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను ఆదేశించింది.